పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేసింది. జాతీయ, ప్రాంతీయ మీడియాలో ప్రభుత్వం భారీ ఎత్తున మేం పౌరసత్వ చట్టాన్ని తిరస్కరించాం అంటూ ప్రకటనలు జారీ చేశారు. నేరుగా ప్రధాని నరేంద్రమోడీని సవాల్ చేస్తున్నట్లుగా ఈ ప్రకటనలు ఉన్నాయి.
మేమే నెంబర్ వన్ అంటూ జారీ చేసిన ఈ ప్రభుత్వ ప్రకటనలలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రచారం చేశారు. రాజ్యాంగ సారాన్ని సమర్థించడంలో, సామాజిక అభివృద్ధి సూచికలలో కేరళ మొదటిది అని ప్రకటనలలో పేర్కొంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ చిత్రంతో జాతీయ మీడియా మొదటి పేజీలో వచ్చిన ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది.
జాతీయ మీడియా మొదటి పేజీలో వచ్చిన ఈ ప్రకటనలో కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం కేరళ అంటూ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు చట్టాన్ని వ్యతిరేకించామని వివరించారు. నిర్బంధ శిబిరాలు, రేషన్ కార్డు నిరాకరణ వంటి బెదిరింపులు వెలువడినప్పుడు, ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుందని, పౌరసత్వ రిజిస్టర్‌కు దారితీసే ఎన్‌పిఆర్ ని కూడా కేరళ నిలిపివేసిందని ప్రకటనలో పేర్కొన్నారు.
