32.7 C
Hyderabad
April 27, 2024 01: 33 AM
Slider సంపాదకీయం

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి తాగించండి

#liquorShop@Hyd

ఇక లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉన్నా ఇబ్బంది లేదు. ఇటు ప్రజలకూ అటు ప్రభుత్వానికి. నిజం. ఎందుకంటే మద్యం అమ్మకాలపై గేట్లు ఎత్తేశారు. అందుకు. ఆదాయం పడిపోతున్నదని ఆందోళన చెందుతున్న వివిధ రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు వెసులుబాటు ఇవ్వాలని కేంద్రాన్ని మొదట్లో రిక్వెస్టు చేశాయి.

ఆ తర్వాత బెదిరించడం ప్రారంభించాయి. మద్యం ఆదాయం పైనే మా రాష్ట్రం ఆధారపడి ఉంది అందువల్ల మద్యం అమ్ముకోవడానికి అనుమతి ఇస్తారా లేక ఆ నష్టం మీరే భర్తీ చేస్తారా అంటూ కర్నాటక రాష్ట్ర ఆబ్కారీ మంత్రి ప్రశ్నించారు. మహారాష్ట్ర మంత్రి కూడా ఇంత కన్నా తీవ్రంగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

మద్యం అమ్మకాలు నిషేధించిన నాటికి ఇప్పటికి పరిస్థితి మెరుగుపడిందా?

అలాగే అన్ని రాష్ట్రాలూ మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని కోరాయి. మద్యం తాగడం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల త్వరగా వైరస్ బారిన పడతారని, మద్యం మత్తులో ఉన్నవాడు ఎవరికి వైరస్ అంటిస్తాడో తెలియదని కారణాలు చూపిస్తూ ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిషేధించింది.

అయితే ఈ రెండూ రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద కారణాలుగా కనిపించలేదు. కళ్ల ముందు డబ్బులే కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా కేసుల్లో ప్రధమ స్థానంలో ఉన్న మహారాష్ట్ర అయితే రెడ్ జోన్ లో కూడా మందు అమ్మేద్దామని నిర్ణయించిది. శభాష్. ఇంక కరోనా నిబంధనలు ఎందుకు? పూర్తిగా ఎత్తేస్తే సరిపోతుంది.

రేటు పెంచడం మద్య నిషేధానికి తొలి మెట్టు అంటే ఎలా?

మహారాష్ట్ర తీవ్ర మైన నిర్ణయం తీసుకోగా ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకో అడుగు ముందుకు వేసి ఇప్పటి వరకూ వచ్చిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి 25 శాతం రేట్లు పెంచేసింది. ఇలా రేట్లు పెంచడం మద్య పాన నిషేధానికి తొలి మెట్టు అంటూ వైసీపీ సామాజిక మాధ్యమాలు పుంఖాను పుంఖాలుగా పోస్టులు పెడుతున్నాయి.

మద్య నిషేధం అంటే రేటు పెంచడమా? తెలియదు. వైసీపీ చెబుతున్న మాటలు వింటే మాత్రం రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్యాగం చేస్తున్నదో అని పిస్తుంది. మద్యం అమ్మకాలకు గేట్లు తెరిచిన వారు ఈ కింది ప్రశ్నలు ఆలోచించారా? 1.మద్యం కొన్న వాడు ఎక్కడ తాగాలి? మద్యం లో పోసుకోవడానికి సోడా, నీళ్లు కూడా మద్య షాపు వాడే ఇస్తాడా?

మద్యం మత్తులో శాంతి భద్రతల సమస్య రాదా?

2. మద్యం బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్లి తాగాలంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారా? పైగా స్కూళ్లకు సెలవులు కారణంగా ఇంట్లో పిల్లలూ ఆడవాళ్లూ ఉంటారు కదా? 3.మద్యం తాగి ఇంట్లో మహిళలపై చెయ్యి చేసుకుని తగాదా రోడ్డు పైదాకా వస్తే పరిస్థితి ఏమిటి? కరోనా డ్యూటీలు వదిలి పోలీసులు మద్యం కేసులపై దృష్టి పెట్టాల్సి వస్తుంది కదా?

4.మద్యం మత్తులో గొడవలు జరిగి హత్యల వరకూ వెళితే దానికి బాధ్యత ప్రభుత్వం వహిస్తుందా? 5.మద్యం మత్తులో రోడ్డు పైకి వచ్చే వారిని ఎలా అదుపు చేయాలి? అది పోలీసులకు అదనపు తలనొప్పి కదా? 6.కూలీ డబ్బుల రాక ఇంతకాలం ఖాళీగా ఉన్న వారికి మద్యం కొనుగోలు కు ఎక్కడి నుంచి వస్తాయి?

మందు పెట్టారు సరే కొనేందుకు డబ్బులేవి?

ఉద్యోగస్తులైతే ఇప్పటి వరకూ జీతం కూడా రానివారి పరిస్థితి ఏమిటి? డబ్బుల కోసం హింస జరిగితే బాధ్యత ఎవరిది? 7. మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించాలని నిబంధన. ఈ నిబంధన అమలు చేయడానికి అదనంగా ఎంత మంది పోలీసులు కావాలో ఆలోచించారా?

8.మద్యం అమ్మే సమయాలు సరిపోయే పరిస్థితి లేదు. అందువల్ల మద్యం బాటిళ్లు వెనక డోర్ ల నుంచి అధిక ధరలకు అమ్మడం మొదలు పెడతారు. దీనివల్ల మద్యం వ్యాపారులు, దళారులు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించుకుంటారు. దాని నుంచి అక్రమ అధికారులు ఎవరైనా ఉంటే వారికి పండగే.

మహారాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటారా?

9.రెడ్ జోన్ లలో కూడా మద్యం షాపులు తెరిచే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కట్టడి చేయడం లేదు ఎందుకని? వీటన్నింటికి సమాధానాలు లేవు. అయినా మద్యం మాత్రం అందుబాటులోకి వచ్చేస్తున్నది. మద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యాలు మెరుగయ్యాయి. ఆసుపత్రులకు వెళ్లేవారి సంఖ్య తగ్గింది. ఇప్పడు మళ్లీ తాగించే ఏర్పాట్లు చేస్తున్నారు.

తాగండి కరోనాతో సహజీవనం చేయండి.

Related posts

నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

Satyam NEWS

వ్యవసాయాధారిత పరిశ్రమలపై కేసీఆర్ దృష్టి

Satyam NEWS

పుట్లూరు అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

Leave a Comment