42.2 C
Hyderabad
April 26, 2024 15: 03 PM
Slider సంపాదకీయం

నిల్వ ఉన్న ఈ మద్యం అమ్మితే చాలు కరువు తీరుతుంది

#Liquor Stock

సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వచ్చిన ప్రభుత్వ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లోని బార్ ఓనర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మూసి వేసిన అన్ని వ్యాపార సంస్థలను, దేవాలయాలను ప్రభుత్వం తెరిచేందుకు ఆదేశాలు జారీ చేసింది.

చాలా రాష్ట్రాలలో హోటళ్లు, రెస్టారెంట్లను కూడా షరతులతో తెరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు బార్ లు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని బార్ యజమానులు కోరితే అందుకు సరే అనడమో ఇప్పుడే కాదు అనడమో చేయాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఉన్న స్టాకు మొత్తాన్ని ప్రభుత్వ మద్యం డిపోలలో అందచేసి అక్కడ సాయంత్రం దాకా వేచి చూసి అమ్ముడు పోయిన సరకు కు డబ్బులు తీసుకోని వెళ్లండి అంటూ ఆదేశాలు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర పరిస్థితి

సహజంగా రిటైల్ షాపుల్లో మద్యం తక్కువ ధరకు లభ్యం అవుతుంది. బార్ లలో ఎక్కువ ధర ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో విచిత్రంగా రిటైల్ షాపుల్లో ఇప్పుడు ఎక్కువ ధరకు మద్యం అమ్ముతున్నారు. బార్ ల వద్ద నిల్వ ఉండిపోయిన స్టాకు తక్కువ ధర ఉన్నప్పుడు కొన్నది.

ఇప్పుడు తమ వద్ద నిల్వ ఉన్న స్టాకును తాము కొన్న ధరకు అంటే  రిటైల్ ఔట్ లెట్లలో ఇప్పుడు ఉన్న ధర కన్నా దాదాపు మూడింతలు తక్కువ ధరకు అమ్ముకోవాలని ప్రభుత్వం షరతు విధించింది. ఏ వ్యాపారంలో అయినా మార్కట్ లో అప్పుడు ఉన్న ధరకు స్టాకు అమ్ముకుంటారు కానీ మార్కెట్ ధర కన్నా తక్కువకు, తాము కొన్న ధరకే స్టాకు అమ్మాలని చెప్పడంలో ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో బార్ యజమానులకు అర్ధం కావడం లేదు.

బార్ లు తెరవకపోగా వ్యాపారంపై దెబ్బ కొట్టారు

ఏప్రిల్ నెలలో ఎక్సయిజ్ శాఖ రాష్ట్రంలోని అన్ని బార్ లను తనిఖీ చేసి నిల్వలను నమోదు చేసింది. నిల్వల్లో తేడాలు ఉంటే వారిపై కేసులు నమోదు చేశారు. అప్పుడు ఉన్న నిల్వలను నిర్ణీత గడువు ఇచ్చి బార్ తెరవకుండా అమ్ముకోవాలని చెప్పడం సహజ న్యాయ సూత్రం. ఎందుకంటే ప్రభుత్వం రిటైల్ దుకాణాలను తెరచి అమ్ముతున్నది కాబట్టి.

అలా కాకపోతే సామాజిక దూరం పాటిస్తూ నిర్ణీత వేళల్లో బార్ తెరుచుకోవచ్చు అని చెప్పడం మరొక విధానం ఈ రెండు కాకుండా ఉన్న స్టాకును కొన్న ధరకు ప్రభుత్వం నిర్వహించే రిటైల్ దుకాణాలలో అప్పగించి, అవి అమ్ముడు పోతే మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం మారగానే మారిన విధానం

రాష్ట్ర ప్రభుత్వ నూతన విధానంతో బార్ యజమానులు భారీగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో 750కి పైగా బార్లు ఉన్నాయి. గత ప్రభుత్వం 2017లో నూతన బార్ లైసెన్సు విధానం తీసుకువచ్చింది. 2006 నుంచి 2017 వరకూ ఏడాదికి ఒక సారి రెన్యూవల్ విధానం ఉండేది కాగా 2017 లో దాన్ని ఐదు సంవత్సరాలకు పెంచారు.

దాంతో 2022 వరకూ ఇప్పుడు ఉన్న బార్ ఓనర్లే కొనసాగుతారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పాత విధానంలో మార్పులు తీసుకువచ్చి కొత్త బార్ లకు దరఖాస్తులను ఆహ్వానించారు. అయితే బార్ ఓనర్లు కోర్టుకు వెళ్లడంతో మారిన ప్రభుత్వ విధానంపై హైకోర్టు స్టే విధించింది. ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం రెండు వందల కోట్ల రూపాయల మద్యం నిల్వలు బార్ యజమానుల వద్ద ఉన్నాయి.

బయటి మార్కెట్ ధర వారు కొన్నదానికి రెట్టింపు కన్నా ఎక్కువ ఉంది. అంటే దాదాపు 450 కోట్ల రూపాయల మద్యం బార్ ల వద్ద ఉన్నట్లు అంచనా. బార్ లలో ఉన్న మద్యం నిల్వల పైనే ఇప్పుడు చాలా మంది కన్నేసి ఉన్నారు. అంతే కాకుండా బార్ లలో ఉన్న మద్యం పాపులర్ బ్రాండ్ మద్యం కావడం కూడా ఇక్కడ గమనార్హం.

Related posts

పానగల్ బ్రాంచి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

Satyam NEWS

8న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అందరూ పాల్గొనాలి

Satyam NEWS

హైదరాబాద్ వరద బాధితుల సాయంపై గులాబీ గద్దలు

Satyam NEWS

Leave a Comment