32.7 C
Hyderabad
April 26, 2024 23: 30 PM
Slider ఆధ్యాత్మికం

శివోహం: మహా శివరాత్రి వ్రతం ఎలా ఆచరించాలి?

maha siva 1

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

‘శివం’ అనగా మంగళం, శుభం. కైవల్యం, శ్రేయస్సు అనే అర్థాలున్నాయి. శివుడు యోగమూర్తి. సదా చిన్ముద్రలో హైమవతీ సహితుడై, నిష్కాముడై విరాజిల్లుతూ ‘జ్ఞాన’ దాయకుడిగా భారతీయులందరితోనూ ఆరాధింపబడుతున్నాడు.

శివుడు మహాతేజోలింగరూపాన ఆవిర్భవించిన సన్నివేశం 18 కల్పాలలో ఈశాన కల్పాన జరిగింది.

ఈ సందర్భంలో శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహ రూపం దాల్చి, శివలింగ ప్రాదుర్భవస్థానాన్ని చూసి రావడం కోసం ప్రయత్నించడం వల్ల  ఆనాటి నుండి ఈ కల్పానికి  శ్వేతవరాహకల్పం అని పేరు వచ్చినది. మహాశివరాత్రి విశిష్టమైన మహాపర్వదినం. ఈ పండుగ మాఘమాసంలో వస్తుంది.

మన పండగలన్నీ తిధులతోను, నక్షత్రాతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులూ, మరికొన్ని పండగలకు నక్షత్రాలూ ప్రధానమవుతాయి ఈ పద్ధతిలో ప్రతి నెల చాంద్రమాసం ప్రకారం కృష్ణ పక్షమిలోని ప్రదోష వ్యాప్తిగల చతుర్ధశి తిధిని మాస శివరాత్రి అంటారు. మాఘ కృష్ణ చతుర్దశి నాటి మహారాత్రి రోజున ఆదిదేవుడైన శివుడు లింగ రూపాన కోటి సూర్య ప్రభతో అవతరించాడు.

కనుక ఆనాడు శివరాత్రి వ్రతమాచరించాలన్నది శాస్త్ర నిర్ణయం. లింగ పూజ చేయాలని ఈశానసంహితలో ఉంది. ఈ విషయాన్ని నిర్ణయ సింధుకారుడు కూడా ప్రమాణంగా ధృవపరిచాడు. శివరాత్రులు అయిదు రకాలున్నాయి. అవి, నిత్య శివరాత్రి. పక్ష శివరాత్రి. మాస శివరాత్రి. మహాశివరాత్రి. యోగ శివరాత్రి.

వీటిలో మహాశివరాత్రి ప్రభావమే చాలా గొప్పది. ఈ రోజున ప్రత్యూషకాలంలో  నదిలో గానీ, తటాకంలోగానీ స్నానం చేసి, అర్ఘ్య ప్రదానాదాలు పూర్తి చేసుకుని పరమేశ్వరుని మహన్యాస పూర్వక రుద్ర నమకచమకాదులతో ఏకాదశ రుద్రాభిషేకం, శివార్పణంగా చేసి, ఆ తరువాత బిల్వ పత్రార్చన ప్రియుడైన శివుణ్ణి బిల్వంతోనూ, అష్టోత్తర శతనామావళితోనూ పూజించాలి.

ఆ విధంగా రోజంతా భగవద్ధ్యానాదులతో ఉపవాసంతో గడిపి రాత్రి జాగరణ దీక్ష చేయాలి. మరుసటిరోజు ఉదయాన్నే అమావాస్య స్నానం చేసి శివునికి పునః పూజ చేయడంతో శివరాత్రి దీక్ష ముగుస్తుంది. శివరాత్రి మహాత్మ్యం గురించి స్కంధ, లింగ, భవిష్య పురాణాలో ఎన్నో కథలు ఉన్నాయి.

ఈ కథలలో బిల్వ వృక్షము, వ్యాధుడు, జింకలు ప్రధానమైనవి. మానవదేహమే బిల్వ వృక్షం. బిల్వ పత్రానికి గల మూడు ఆకులు త్రిగుణాలు. కాడేమో మనస్సు. కామక్రోధాదులే ముండ్లు. జీవాత్మ సంసార బిల్వ వృక్షమెక్కిన ‘అంకిలుడు’ అనే వేటగాడు. ఇంద్రియ రూప బాణంతో, విషయరూప పక్షి జంతువును వేటాడటం ఇతని ప్రవృత్తి.

ఈ ప్రాకృత జీవుడు శుద్ధ జీవుడై తన సమస్త కర్మను, కర్మ ఫలాలను భగవంతునికి అర్పించినప్పుడే మోక్షం చేకూరుతుంది. కనుక దేహమనే బిల్వ వృక్షం ఎక్కి త్రిగుణాలనే బిల్వ పత్రాలను కోసి, గుణాతీతుడైన పరమేశ్వరుని శిరస్సుపై అర్పించడమే వేటగాడు చేసిన పుణ్యకార్యం.

ధర్మ, భక్తి,  జ్ఞాన, వైరాగ్యాలే అతనిని ప్రబోధించిన జింకలు. బోయను భయపెట్టిన క్రూరమృగాలే కామాదులు. కానీ అతని ప్రారబ్ద కర్మ ఆనాటితో తీరడం వల్ల అవేవీ  ఏమీ చేయలేకపోయాయి. బిల్వార్పణంతో అతనికి కైవల్యం లభించింది. ఈ కథలోని ఆధ్యాత్మిక తత్వ రహస్యాన్ని గుర్తించి శివరాత్రి వ్రతమాచరించరించడంతో భక్తులకు కలిగే ఫలం, మహాఫలం. వర్ణనాతీతం.

యామిజాల జగదీశ్

Related posts

దొంగతనాలపై కొల్లాపూర్ సిఐ ప్రత్యేక చర్యలు: ప్రజలకు సూచనలు

Satyam NEWS

విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ర్యాలీ

Bhavani

సర్పంచ్ లు ఇక విద్యుత్ బిల్లులు చెల్లించవద్దు

Satyam NEWS

Leave a Comment