26.2 C
Hyderabad
March 26, 2023 10: 46 AM
Slider తెలంగాణ ప్రత్యేకం

ఈటెల లా దూసుకువచ్చిన మాటలు

1457943060-6067

మంత్రి పదవి తనకు ఎవరో వేస్తే వచ్చిన భిక్ష కాదని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ లో చేరికల సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. తన మంత్రి పదవిపై చిల్లర వార్తలు ప్రచారంలో ఉన్నాయనీ.. వాటికి బదులివ్వాల్సిన అవసరం లేదన్నారాయన. తెలంగాణలో చేసిన ఉద్యమమే తనను మంత్రిని చేసిందని చెప్పారు.  ఈటల రాజేందర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చూద్దాం.  “అనామక మనిషిగా వచ్చి… ఈ గడ్డమీద ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం అనేది ఓ చరిత్ర. నా తల్లిదండ్రులు రాజకీయాల్లో లేరు. నాకు నేనుగా నిలబడ్డా. నాకు నేనుగానే నిలబడతా.

ఒక్క హుజూరాబాదే కాదు.. నేను ఆదిలాబాద్ కు పోయినా పదిమంది వచ్చి ఫొటో దిగి పోతరు. నేను మహబూబ్ నగర్ పోయినా.. వ్యాన్ లలో వచ్చి.. పదిమంది ఫొటో దిగి పోతరు. మేం కొన్ని లక్షల మందితో కలిసి తెలంగాణ గడ్డపై ఉద్యమం చేసిన బిడ్డలం మేం. ఒక పత్రిక రాస్తది.. ఈయనకు మంత్రి పదవే రాకపోతుండే.. ఈ మంత్రి పదవే ముఖ్యమా.. కొడకా.. కులంతో కొట్లాట పెట్టలే. తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాడినం. తెలంగాణ తల్లి విముక్తి కోసం కొట్లాడిన తప్ప.. కులంతో వచ్చినవాడిని కాదు నేను. ఈటల రాజేందర్ అనేవాడు.. తెలంగాణ ఉద్యమంలో మూడున్నర కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవ బావుటా ఎగరేసిన బిడ్డ.

ఈ బిడ్డను ఆనాడు జైళ్లలో, పీడీ యాక్టులు పెట్టాలె అని ముఠాలు కట్టిన్రు. నన్ను చంపాలి అని రెక్కీలు నిర్వహించినప్పుడు సంపుతవా నా కొడకా అని ఛాలెంజ్ చేసిన తెలంగాణ బిడ్డను నేను. ఇవాళ పైసల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ పైసలెట్లనో.. ఆనాడు కూడా పైసలుండె.

ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఛాలెంజ్ చేశాను. పార్టీ మాత్రం మారలేదు. ఈ ఈటల రాజేందర్ తెలంగాణ విముక్తి పోరాటం వల్ల గెలిచాడు తప్ప.. నాకు నేనుగా గెలవలేదు అని వైఎస్ కు చెప్పాను. ఉద్యమ పుణ్యాన గెలిచాను తప్ప.. సొంతంగా గెలవలే అని చెప్పాను. నన్ను చంపుతామని ఉద్యమ సమయంలో రెక్కీ నిర్వహించినప్పుడు చంపినా పర్వాలేదు..కానీ తెలంగాణ జెండా మాత్రం వదిలేదు అని నేను కొట్లాడాను” అన్నారు ఈటల.

“చెప్పాలంటే 10 గంటలు చెప్తా. ఒక్కోరోజు 4 , 4 జిల్లాల్లో .. 20, 20 సభల్లో లక్షల మందితో ఇంటరాక్ట్ అయి.. ఉద్యమాన్ని నడిపిన వాళ్లం మేం. ఈ గులాబీ జెండాకు ఓనర్లం మేం. అడుక్కుని వచ్చిన వాళ్లం కాదు మేం. బతుకచ్చినోళ్లం కాదు మేం. అడుక్కునేవాళ్లెవరో రేపు తెలుస్తది. అధికారం అనేది శాశ్వతం కాకపోవచ్చు.. కానీ ధర్మం, న్యాయం శాశ్వతంగా ఉంటుంది. ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప.. నాయకులు కాదనే సత్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. కుసంస్కారం ఉన్న, ఎదగలేని, సొంతంగా తిరగలేని నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలి.

ధర్మంనుంచి అలాంటి నాయకులు తప్పించుకోలేరు. ప్రజాక్షేత్రంలో వారికి శిక్ష తప్పదు. నేను గెలవగలిగే సత్తా ఉన్నోడిని.. అమ్ముడుపోకుండా ఉన్నోడిని నా భుజాలమీద మోసే ప్రయత్నం చేస్తా. ఈ బాధ .. ఇదంతా కూడా నానోటి నుంచే కాదు.. ఎన్నడో ఒకనాడు అదంతా తప్పకుండా బయటకొస్తాయ్. ఎవడు పోయి ద్రోహి అయ్యాడో.. ఎవడు హీరో అయ్యాడో అనేది ఆరోజు తెలుస్తదన్న ఆశతో బతికేవాడిని.

ఈటల రాజేందర్ వెలిగే దీపమే తప్ప.. తెలంగాణ గడ్డమీద ఆత్మగౌరవంతో బతికేవాడే తప్ప ఈ చిల్లరమల్లర వారితో, వార్తలతో భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నా.” అన్నారు ఈటల రాజేందర్.

Related posts

ఆర్యవైశ్య సంఘ నేత మా శెట్టిని అభినందించిన కెప్టెన్ ఉత్తమ్

Satyam NEWS

ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి

Satyam NEWS

భూ వివాదాలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

Bhavani

Leave a Comment

error: Content is protected !!