హైదరాబాద్ తో పాటు తెలంగాణాలోని చిన్న పట్టణాలలో సైతం ఐటి విస్తరణ చేపట్టామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె టి ఆర్ తెలిపారు. ఇప్పటికే కరీంనగర్ లో ఐటి టవర్ నిర్మాణం పూర్తయిందని, అక్టోబర్ లో దీనిని ప్రారంభిస్తామని వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో భాగంగా జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చెప్పాలని సభ్యులు అడిగిప ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, గడిచిన ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.52వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయలకు చేరిందన్నారు. ఇది తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు. ఐటీ పరిశ్రమలో అద్భుతమైన పురోగతిని సాధించామని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా ఐటీని విస్తరించామన్నారు. మహబూబ్‌నగర్ ఐటీ టవర్‌కు టెండర్ పూర్తయిందని, 50 ఎకరాల స్థల సేకరణ జరిగిందని వివరించారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ బీపీవో సంస్థలు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఐటీఐఆర్ లో 8శాతం వృద్ధి ఉందన్న కేటీఆర్ తెలంగాణలో 17శాతానికిపైగా నమోదైందన్నారు.
previous post