తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణీకులకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. సంస్థాగత విషయాలపై ట్రాన్స్పోర్ట్ భవన్‌లో బుధవారం మేనేజింగ్ డైరెక్టర్, టి.ఆర్.అండ్ బి ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో సమీక్షించారు.
మరీ ముఖ్యంగా సిబ్బంది ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యల్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించిన విధంగా TSRTC బలోపేతంతో పాటు ఉద్యోగుల సంక్షేమం దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి చెప్పారు.
ఈ క్రమంలోనే ఉద్యోగ భద్రత విధివిధానాలను వారం రోజుల్లోగా తయారు చేసి అందించనున్నట్లు సంబంధిత ఇ.డిలు మంత్రికి తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రాధాన్యతనివ్వాలని, ప్రతి మంగళవారం ఉద్యోగుల సమస్యల వినతుల పరిష్కారానికై దృష్టి సారించాలని సూచించారు.
అధికారులు వారి వారి పరిధిలో సమస్యలను పరిష్కరించాలని, అలా కాకుండా ఉద్యోగులను వేదనకు గురిచేయడం తగదని మంత్రి అన్నారు. ఒ.డి, మెడికల్ గ్రౌండ్, సెలవుల కోసం వచ్చే వినతులపై మానవతా దృక్ఫథంతో వ్యవహరించాల్సి ఉంటుందని, ఉద్యోగుల వినతుల్ని మూడు విభాగాలుగా క్రోడీకరించి వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
బస్సుల్లో బాధ్యతగా టికెట్ తీసుకునే ప్రత్యేక విధానంపై ప్రయాణీకులకు అవగాహన కల్పించాలని చెబుతూ ఒ.ఆర్ పెంపు కోసం కృషి చేయాల్సి ఉందన్నారు. సిఎం ఆశించిన తీరుగా సంస్థను అభ్యున్నతి వైపు తీసుకెళ్లడానికి అందరూ ప్రయత్నించాలన్నారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం పాల్గొన్నారు. ఇంకా ఇ.డి (ఇ) వినోద్ కుమార్, ఇ.డి(ఎ) టి.వి.రావు, ఇ.డి (ఒ) యాదగిరి, ఇ.డి (జి.హెచ్.జడ్) వెంకటేశ్వర్లు, ఎఫ్.ఎ రమేశ్, ఎస్.ఎల్.ఒ శ్రీలత, సి.పి.ఎం సూర్య కిరణ్, సీనియర్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ జి.ఆర్.కిరణ్ తదితర అధికారులు కూడా పాల్గొన్నారు.