29.7 C
Hyderabad
April 29, 2024 10: 30 AM
Slider సంపాదకీయం

మంత్రుల్లో ఎవరు గెలుస్తారు?

#ministers

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత మంత్రులు అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని మంత్రుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ జోరు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, జగదీష్ రెడ్డి, శ్రీనివాసగౌడ్, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రత్యర్థుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు.

ఈ మంత్రులే కాకుండా పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన, తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు కంచుకోటలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఎగసినపడిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన నేతగా ఎర్రబెల్లి దయాకర్ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే ఆయన పోటీ చేస్తున్న పాలకుర్తిలో తిరుగు ఉండదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఈ సారి అంత గొప్పగా లేదని నియోజకవర్గంలో పరిస్థితులు అంచనా వేస్తే స్పష్టమవుతోంది. ఎన్నారై కుటుంబం కాంగ్రెస్ తరపున ఆయనపై పోరాడుతోంది.

ఝాన్సిరెడ్డి అనే ఎన్నారై గత ఏడాది నుంచి పాలకుర్తి కాంగ్రెస్‌కు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అయితే ఆమెకు పౌరసత్వ సమస్యలు రావడంతో ఆమె కోడలు యశస్విని రెడ్డిని అభ్యర్థిగా బరిలోకి దించారు. ఎర్రబెల్లిని ఓడించిన తర్వాతనే తాను అమెరికా వెళ్తానని ఝాన్సీరెడ్డి సవాల్ చేసి రాజకీయం చేస్తున్నారు. ఝాన్సీ రెడ్డి రాజకీయం ప్రారంభించినప్పటి నుండి పాలకుర్తిలో రాజకీయాలు క్రమంగా మారిపోయాయి. ఎర్రబెల్లిని ఓడించగలరు అనే నమ్మకాన్ని ముందు ప్రజల్లో ఏర్పరిచారు.

ఏ కార్యక్రమం నిర్వహించినా భారీగా చేపడతారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టి ఝాన్సీ రెడ్డి బలైన నేతగా ఎదిగారు. బలమైన ప్రత్యర్థి ఉంటే ఎర్రబెల్లి దయాకర్ రావుకు గట్టి పోటీ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఉంది. పైగా ఎర్రబెల్లి మంత్రి అయ్యాక క్యాడర్ కు దూరమయ్యారు. అందరి ఆశలు తీర్చలేకపోయారు. దీంతో మండల స్థాయిలో చాలామంది నేతలు దూరమయ్యారు. వారందర్నీ ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ లో చేర్చగలిగారు. ఆమె ఎర్రబెల్లితో పాటు జనాల్ని ఆకర్షించగలిగే స్థితికి చేరారు పరిస్థితిని వెంటనే గమనించి దిద్దుబాటు చర్యలు తీసుకున్న ఎర్రబెల్లి… నియోజకవర్గంలోనే ఎక్కువ సేపు గడిపారు.

అడిగిన వారందరికీ కాదనకుండా ఆర్థిక సాయంచేశారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి గందరగోళంలో ఉంది. నియోజకవర్గంలో 26 ఏళ్ల యశస్విని రెడ్డి గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఈ పరిస్థితి గమనించిన ఎర్రబెల్లి.. ఆమె గెలిచినా ఇక్కడ ఉండరని..అమెరికా వెళ్లిపోతారని… ప్రచారం చేస్తున్నారు. తాను అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. పాలకుర్తి ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటే.. ఎర్రబెల్లి తన రాజకీయ జీవితంలో అతిపెద్ద దెబ్బ తింటారు.

కరీంనగర్ లో పోటీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ చేతిలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి పొన్నం ప్రభాకర్ అంతగా ప్రభావం చూపడం లేదు. పోటీ తీవ్రంగా ఉన్నందున, బండి సంజయ్ పై సానుభూతి ఎక్కువగా ఉన్నందున ఈ సారి గంగుల కమలాకర్ గట్టెక్కడం కష్టమేనని అంటున్నారు.

బండి సంజయ్ సీఎం అభ్యర్ధిగా బీజేపీ పరోక్షంగా చెప్పడంతో ఆయనకు క్రేజ్ ఏర్పడింది. బండి సంజయ్ ప్రస్తుతం ఎంపిగా ఉన్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. స్థానికంగా బలంగా ఉన్న బండి సంజయ్ ఈ సారి తన ప్రభావం ఎక్కువగా చూపిస్తుండటం అధికార బీఆర్ఎస్ పార్టీకి మింగుడుపడటం లేదు.

అదే విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

Related posts

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Satyam NEWS

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన ఆర్థిక శాఖ కార్యదర్శి

Bhavani

కుటుంబ సభ్యులే వైయస్ వివేకానంద రెడ్డిని దారుణంగా చంపేశారు

Satyam NEWS

Leave a Comment