డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం పై హౌసింగ్ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఈరోజు ప్రగతి భవన్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నదని, ముఖ్యంగా లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంగా జిహెచ్ఎంసి పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని హౌసింగ్ శాఖ అధికారులు మంత్రులకు తెలియజేశారు.
హైదరాబాద్ నగరంలో 70 శాతానికిపైగా పూర్తయ్యాయని, మిగిలినచోట్ల పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని, తాగునీరు, ఇతర కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న ఇన్సిసిట్యూ(మురికివాడల్లో నిర్మాణాలు జరుగుతున్న) ప్రాంతాల్లోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వెంటనే పూర్తి చేసి ఇప్పటికే ఆ ప్రాంతాల కోసం స్థలాలు ఇచ్చిన పేదలకు అప్పగించాలని కోరారు.
హైదరాబాద్ నగర పరిధిలోని జెయన్ యన్ యుఅర్ యం (JNNURM), వాంబే ఇళ్ల నిర్మాణాలు పూర్తయినందున వాటి లబ్ధిదారుల ఎంపికను ఒక నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి పనుల పురోగతి కూడా మంత్రులు చర్చించారు. ముఖ్యంగా లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించాలని, ఇందుకోసం ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాల మేరకు ఒక నిర్దిష్టమైన ప్రక్రియను వెంటనే తయారుచేయాలని హౌసింగ్ శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్లకు మంత్రులు ఆదేశించారు.
జిహెచ్ఎంసి పరిధిలో హైదరాబాద్ బాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. జిహెచ్ఎంసి నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయని, వీటికి అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం క్షేత్రస్థాయిలో పర్యటించి ఒక నివేదిక తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు, హౌసింగ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి యండి దాన కిషోర్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.