38.2 C
Hyderabad
April 29, 2024 19: 17 PM
Slider ఆంధ్రప్రదేశ్

మా కుల పథకాలకూ మీ పేర్లేనా?

212170-pulivendula

గతంలో ఇందిరాగాంధీ కుటుంబం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలకు గాంధీ పేరే పెట్టేవారు. అలా చాలా కాలం కొనసాగింది. ఇప్పుడు నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం పథకాలను తిరగరాస్తూ గాంధీపేర్లను ఒక పథకం ప్రకారం తొలగిస్తూ వస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు అన్ని పథకాలకూ అన్న ఎన్టీఆర్ పేరు వీలైతే తన పేరూ పెట్టుకుని పరోక్ష ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అన్ని పథకాలనూ తిరగ రాస్తూ రాష్ట్రంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేర్లు మారుస్తున్నది. అన్ని పథకాలకు ముందు వైఎస్ఆర్ పేరు పెట్టేస్తున్నారు.  వైఎస్ఆర్ అనేది ఒక వ్యక్తి పేరు. అదే పేరుతో రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వచ్చింది.

యువజన శ్రామికరైతు పార్టీ అని రాసుకున్నా అది వైఎస్ రాజశేఖరరెడ్డి పేరునే స్పురణకు తెస్తుంది. ఇక్కడ వ్యక్తి పేరు పార్టీ పేరు ఒకటే అవుతున్నది. పథకానికి పెడుతున్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ పేరు పెడుతున్నామని చెబుతున్నా ఇది పరోక్షంగా పార్టీ పేరు పెట్టినట్లే అవుతుంది. ప్రభుత్వ పథకాలకు ఒక పార్టీ పేరు పెట్టవచ్చా అనేది ఇప్పటి ప్రశ్న. సరే ఈ ప్రశ్నను పక్కన పెట్టండి.

అది ప్రభుత్వంలో ఉన్నవారికి చెప్పినా అర్ధం కాదు, వినిపించుకోరు. పైగా మా నాయకుడిని అవమాన పరుస్తారా అంటూ విరుచుకుపడే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఒక పథకం ప్రవేశ పెట్టింది. ఆ పథకం ప్రకారం రాష్ట్రంలోని కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలకు ఆర్థికసాయం అందిస్తారు.

45 ఏళ్లు పైబడిన 60 ఏళ్లలోపు కాపు మహిళల జీవనోపాధికోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తానని పాదయాత్ర సందర్భంగా వై ఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు ఈ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా దాదాపు ఆరు లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారని అంచనా.

ఈ పథకాన్ని వర్తింప చేయడానికి రూపొందించిన నిబంధనలు కూడా ఆమోద యోగ్యంగానే ఉన్నాయి. నిబంధనల విషయంలో ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే వచ్చిన చిక్కల్లా ఈ పథకానికి పెట్టిన పేరే. ఈ పథకానికి వై ఎస్ ఆర్ కాపు నేస్తం అని పేరు పెట్టారు. మహానాయకుడు అయిన వై ఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఈ పథకానికి పెట్టినట్టు చెప్పారు.

సాధారణ ప్రజానీకానికి అమలు చేసే సార్వజనీన పథకాలు వేరు. వాటికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది ఒక కులానికి సంబంధించిన పథకం. ఈ పథకానికి ఆ సామాజిక వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గానికి చెందిన వారి పేరు పెట్టడానికి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. వంగవీటి రంగా లాంటి సామాన్య జనానికి చేరువైన నేతలు కూడా కాపు సామాజిక వర్గంలో ఉన్నారు. అలా కాకుండా వేరే సామాజిక వర్గం వారు ఎంత గొప్ప నాయకుడు అయినా సరే తమ సామాజిక వర్గ పథకానికి పేరు ఎలా పెడతారని కాపు కులస్తులు ప్రశ్నిస్తున్నారు.

కాపు నేస్తం కార్యక్రమానికి వై ఎస్ ఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించింది కాపు జాగృతి. తక్షణమే కాపు కులాని చెందిన వంగవీటి రంగా పేరును ఈ పథకానికి  పెట్టాలని కాపు జాగృతి డిమాండ్ చేసింది.

Related posts

శ్రీ శ్రీ కాళికాంబాదేవి దేవస్థానం లో అన్నదానం

Bhavani

ఆర్టీసీ ఉద్యోగులకు హ్యాండ్ ఇచ్చిన జగన్

Satyam NEWS

మంత్రి ముందు మాజీ ఎమ్మెల్యే అనుచరుల నిరసన

Satyam NEWS

Leave a Comment