ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం కొత్త తేదీలను ప్రకటించింది ఈసీ. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2020 జరుగుతోంది. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరే యువతీయువకులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30 వరకు ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. డిసెంబర్ 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. వివరాలు: జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, ఓటర్ల వివరాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణకు నవంబర్ 30 తుది గడువు, డిసెంబర్ 16న ఓటర్ల జాబితా మూసాయిదా ప్రచురణ, 2020 జనవరి 15వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులకు స్వీకరణ, 2020 జనవరి 27 సమస్యల పరిష్కారానికి తుదిగడువు, 2020 ఫిబ్రవరి 4వ తేదీ ఓటర్ల జాబితా అనుబంధాల తయారీ గడువు, 2020 ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితాల ప్రకటన. ఓటర్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ప్రతి ఇంటికి తిరిగి ఓటర్ల జాబితాలో పేర్లు, ఇతర వివరాలను నిర్ధారించుకుంటారు. ఓటరు జాబితాలో పేర్ల ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, రేషన్‌కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంకు పాసుపుస్తకాలు, రైతు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసిన స్మార్ట్ కార్డు, తాజాగా తీసుకున్న నల్లా, టెలిఫోన్, గ్యాస్ కనెక్షన్ బిల్లుల్లో ఏదో ఒక పత్రాన్ని బీఎల్‌ఓలకు అందజేయాలి. ఓటర్లు www.nvsp.in లేదా www.ceotelangana.nic.in లలో తమ రుజువులకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేసి ఓటు హక్కును నిర్ధారించుకోవచ్చని అధికారులు తెలిపారు.
previous post