33.7 C
Hyderabad
April 29, 2024 01: 44 AM
Slider సంపాదకీయం

ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు

jagan elections

ఎన్నికల అధికారులు నిర్వర్తించే విధులు ఏమిటి? వారికి ఉండే అధికారాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుని మసలుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ఇక ఎందుకు అని ప్రశ్నించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తున్నది.

70 స్థానాలలో 67 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడి లెఫ్టెనెంట్ గవర్నర్ ను కాదని ఏం చేయలేకపోయారు. లెఫ్టెనెంట్ గవర్నర్ కేంద్రం నియమించిన వ్యక్తి, నేను 67 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రిని అని మొత్తుకున్నా ఎవరూ వినలేదు.

వినరు కూడా. విన్నా ఫలితం లేదు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను ఎవరూ ఏమీ చేయలేరు. 151 స్థానాలు వచ్చినంత మాత్రాన ఎన్నికల కమిషనర్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా నిర్వహించలేరు కదా? స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉండే అంశం కాదు.

ఎన్నికల సంఘం ఆదేశాలను ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు అందరూ పాటించాల్సిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు 151 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రి అయినా 175కు 175 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రి అయినా పరిపాలనాయంత్రాంగంపై అజమాయిషీ చేయలేడు. ఎన్నికల కమిషనర్ ను నియమించేదే రాష్ట్ర ప్రభుత్వం.

అసలు ఇలా ఎన్నికల కమిషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడమే తగదని, ఇలా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి నిష్పక్ష పాతంగా ఉండడని అందువల్ల ఎన్నికల కమిషనర్లను నేరుగా కేంద్ర ప్రభుత్వం నియమించాలని లేదా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు అయిన విధంగా రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.

73,74 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. అది వేరే విషయం. ఎన్నికల కమిషనర్ ను చంద్రబాబు పెట్టాడు అనడం అత్యంత దారుణం. చంద్రబాబు పెట్టినా సూరిబాబు పెట్టినా అప్పటి ముఖ్యమంత్రి హోదాలో నియామకం జరిగింది కాబట్టి అతనికి చట్ట ప్రకారం ఉన్న అధికారాలన్నీ దఖలు పడతాయి.

ఇది బేసిక్ రూల్. ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన కొత్తలో అసెంబ్లీ స్పీకర్ గా జీ నారాయణ రావు ఉండేవారు. ఆయన చెప్పినట్లు ఎన్టీరామారావు సభలో నడుచుకోవాల్సి వచ్చేది. ఇది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా పార్టీ గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తిని నేను స్పీకర్ గా చేస్తే ఆయన చెప్పింది నేను వినాలా నేను చెప్పింది ఆయన వినాలా అని ఎన్టీరామారావు ప్రశ్నించారు.

స్పీకర్ గా ఎంపిక చేసే వరకే మీ నిర్ణయం ఆ తర్వాత ఆయన చెప్పినట్లే అసెంబ్లీ నడుస్తుంది అని అధికారులు వివరించి చెప్పారు. అలానా అంటూ ఎన్టీరామారావు ఆ నాటి నుంచి అసెంబ్లీ లో స్పీకర్ చెప్పినట్లే నడుచుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ తప్పదు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా టీ ఎన్ శేషన్ ఉండేవారు. ఆయన ఎన్నికల నిర్వహణలో ఎన్నోసంస్కరణలు తీసుకువచ్చారు. చట్టంలో ఉన్న అన్ని లొసుగులను సవరించారు. చట్టంలో ఉన్న అన్ని ప్రొవిజన్స్ ను వాడుకున్నారు. ఎన్నికలను క్రమబద్ధీకరించారు. ఆయన ధాటిని అప్పటికే అధికార పార్టీలు తట్టుకోలేకపోయేవి.

తిరుగులేని అధికారాలు ఉండే శేషన్ ను ఎలా వదిలించుకోవాలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే పెద్ద పెద్ద వారికి కూడా అర్ధం కాలేదు. అప్పటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగా ఆలోచించారు. చివరకు పరిష్కారం కనుగొన్నారు. దాన్ని ప్రజాస్వామ్యయుతంగా అమలు చేశారు. శేషన్ ‘‘నిరంకుశత్వం’’ తగ్గించారు.

 అదేమిటంటే చట్ట సవరణ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ముగ్గుర్ని నియమించారు. అందులో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉంటారు. అయితే నిర్ణయాలు మాత్రం మెజారిటీ ప్రకారం తీసుకోవాలి. దాంతో మిగిలిన ఇద్దరూ శేషన్ దూకుడుకు అడ్డుగా నిలిచారు. ప్రజాస్వామ్య యుతంగా  కాంగ్రెస్ ఆడిన గేమ్ పారింది.

లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చి సలహాదారులను పెట్టుకోవడం కాదు. తలఊపే అధికారులను చుట్టూ పెట్టుకోవడం కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏం చేయాలో తెలుసుకోవాలి. తెలియకపోతే తెలివితేటలు ఉన్న సలహాదారులను పెట్టుకోవాలి. వారు చెప్పింది వినాలి.

లేకపోతే కులాలను తిట్టుకుంటూ, వ్యవస్థలను అస్థిర పరచుకుంటూ మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది. తొమ్మిది నెలల ముందే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత ఆక్రోశానికి లోను కావాల్సిన అవసరం ఉండేది కాదు. దాన్నే పరిపాలనా అనుభవం అంటారు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

అమానుషం…దారుణం… ఎలా చెప్పాలి ఈ మూగజీవులు

Satyam NEWS

మరింత కఠినంగా రెండో దశ లాక్ డౌన్ నిబంధనలు

Satyam NEWS

అక్రమ సంబంధం పెట్టుకుని భార్యకు వేధింపులు

Satyam NEWS

Leave a Comment