నేను చెప్తే ఒక్క ఉద్యోగి వినరు. నన్ను కనీసం పట్టించుకునే వారు కూడా లేరు. ఈఓ నుంచి మొదలు ఇక్కడ పనిచేసే నాలుగవ తరగతి ఉద్యోగి కూడా కనీసం నామాట వినని పరిస్థితి ఉంది. అసలు అమ్మవారి దగ్గర ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఈమాటలు అన్నది ఎవరో కాదు తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన ఏడుపాయల దుర్గాభవాని ఆలయ ఛైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి. గత కొద్దిరోజులుగా ఆలయ ఛైర్మెన్ కు డైరెక్టర్లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఛైర్మెన్ కు, ఈఓకు సైతం పడడం లేదని ఛైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డినే స్వయంగా మీడియా ముందు తన ఆవేదన వెళ్లగక్కారు. ఆదివారం నాడు విలేకరుల సమావేశం నిర్వహించిన విష్ణువర్ధన్ రెడ్డి ఏడుపాయల్లో జరుగుతున్న పలు విషయాలపై మాట్లాడారు. ఆలయ ఛైర్మెన్ అయిన తనకు తెలియకుండానే ఇక్కడ నిర్ణయాలు జరిగిపోతున్నాయని, ఈఓ మోహన్ రెడ్డి తనకు, డైరెక్టర్లకు మధ్య తగాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఒకే మండలానికి చెందిన మామధ్య విభేదాలు సృష్టిస్తోంది ఆయనే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓ ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తనకు తెలియదని, ఈ 18 నెలల కాలంలో ఒక్కసారి కూడా తన ఫోన్ లిఫ్ట్ చేయలేదని, కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవన్నారు. ఆయన వస్తేనే ఉద్యోగులు వస్తారని లేదంటే రారని ఛైర్మెన్ చెప్పడం గమనార్హం. ఇక్కడ ఎవరూ తమమాట వినరని, తాను ఛైర్మెన్ గా ఉన్నా పట్టించుకునే వారేలేరని వాపోయారు. అమ్మవారి ఆవరణలో ఉన్న శివాలయాన్నీ స్వాధీనం చేసుకోవాలని గతంలో ధర్మకర్తల మండలి తీర్మానం చేసినా ఈఓ ఇప్పటి వరకు పట్టించుకోలేదని, అక్కడ ఓ ఉద్యోగిని పెట్టి జీతాలు మాత్రం ఇస్తున్నారని అన్నారు. అనుమతులు లేకుండా సుమారు 20 మంది చిరు వ్యాపారులు డబ్బాలు పెట్టుకున్నారని వారందరిని తొలగించాలని పాలకమండలి నిర్ణయిస్తే, ఈఓ మాత్రం కేవలం మూడు డబ్బాలను మాత్రమే తొలగించడం వెనక ఆంతర్యం ఏంటో ఆయనే చెప్పాలని ఛైర్మెన్ డిమాండ్ చేశారు. ఈఓకు డబ్బులు ముడుతున్న కారణంగానే మిగతా వారిని ఉపేక్షిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. అమ్మవారి దగ్గర ఇప్పటివరకు తాను ఒక్క విషయంలోనూ సొంత నిర్ణయం తీసుకోలేదని, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఏది చెబితే అదే చేశానని చెప్పుకున్నారు. డైరెక్టర్ల మధ్య విబేధాలు సృష్టిస్తున్న ఈఓ మోహన్ రెడ్డిని తొలగించాలని, ఏడుపాయలకు ప్రత్యేకంగా ఈఓను నియమించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులు ఇకపై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఉపేక్షించబోమన్నారు. అమ్మవారి చెంత ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వబోమన్నారు. ఏడుపాయల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తామని ఛైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అయితే ఈ సమావేశంలో కేవలం విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కరే పాల్గొనడం గమనార్హం.