36.2 C
Hyderabad
April 27, 2024 21: 32 PM
Slider నిజామాబాద్

సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబి లోకి నెట్టిన్రు

kodandaram

సంక్షేమ పథకాల పేరుతో తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబి లోకి నెట్టారని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో కోటగిరి మండల కేంద్రంలోని సొసైటీ పరిధిలో టీజేఎస్ పార్టీ తరపున గెలిచిన శ్యాంసుందర్ దేశ్ పాండే, శ్రీధర్‌‌లకు సన్మాన కార్యక్రమాన్ని గురువారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణా జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1200 మంది అమర వీరుల ప్రాణ త్యాగాలు, జేఏసీ  చేసిన సమ్మెలు, పోరాటాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రాన్ని కేసీఆర్ అండ్ టీం సంక్షేమ పథకాల పేరుతో అప్పుల ఊబి లోకి నెట్టిందని మండి పడ్డారు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు  ఉద్యమం కోసం పనిచేసి వారందరినీ విస్మరించి  ఆనాటి రాష్ట్ర వ్యతిరేకులను నేడు కేసీఆర్ అందలమెక్కించారన్నారు. ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డాక రాష్ట్రం అభివృద్ది చెందుతుందని మన నీళ్లు, మన నిధులు,మన నియామకాలు మనకే దక్కుతాయని భావించిన ప్రతి తెలంగాణా  బిడ్డకు నిరాశే మిగిలిందన్నారు.

సంక్షేమ పథకాల  పేరుతో ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఆరు సంవత్సరాల్లో దాదాపూ 3 లక్షల కోట్ల రూపాలయ అప్పు చేసిన ఘనత కేసీఆర్‌‌దేని అన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక బడ్జెట్ పూర్తిగా పడిపోయిందని లక్షా ఎనభైవేల కోట్ల బడ్జెట్ లక్షా ముప్పైఆరువేలకు పడిపోయిందని అన్నారు. ప్రస్తుతం ప్రవేశ పెట్టనున్న లక్షా ముప్పై ఆరువేల కోట్ల బడ్జెట్‌లో 20 వేల కోట్లు అప్పుల వడ్డీలకు పోగా  ఒకలక్షా ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరముంటుందని అన్నారు.

ఇక బడ్జెట్‌లో మిగిలిన 11 వేల కోట్ల రూపాయలతో ప్రజలకు ఏయే సంక్షేమ పథకాలు అందిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని  ప్రశ్నించారు. ఈ పదకొండు వేలకోట్లతో నిరుద్యోగ భృతి, 57 ఏండ్లకు పెన్షన్, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్ మెంట్  అస్సలు సాధ్యం కాదని తెలిపారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణా అభివృద్ది పక్కన పెడితే కేసీఆర్ ఆస్తి  మాత్రం దినదినాభివృద్ది చెందిందన్నారు.

2004 నుండి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన అఫిడవిట్ చూస్తే ఆయన ఆస్తి ఎంతగా పెరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవచ్చని అన్నారు. భూ ప్రక్షాళన పేరుతో  రైతులకు లేని పోని కష్టాలు తెచ్చిపెట్టిన కేసీఆర్ ఇప్పటికీ 20 శాతం రైతులకు సరైన పత్రాలున్నప్పటికీ పట్టాలు ఇవ్వలేదని అన్నారు.

మిషన్ భగీరథ పేరుతో 55 వేల కోట్లు వృధా చేశారని ఇప్పటి వరకూ ఒక్క చోట కూడా నీరు ఇచ్చిన ధాఖలాలులేవన్నారు. అవే డబ్బులు జిల్లాల్లో ఖర్చుచేస్తే తెలంగాణా అభివృద్ది తారాస్థాయిలో ఉండేదన్నారు. బీసీలకు,ఎస్సీ,ఎస్టీ ల కార్పొరేషన్‌లకు నిధులు భారీగా కేటాయించినా  నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతుందన్నారు.

కార్పోరేషన్‌లోన్‌లు ఇవ్వటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆ నిధులను వేరే పనులకు వాడి ఆయా కార్పోరేషన్‌ల పరిధిలోని లబ్దిదారులైన  నిరుద్యోగులకు చేయూతను ఇవ్వక వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. తెలంగాణా కోసం అమరులైన వారి కుటుంబాలను కీసీఆర్ పూర్తి గా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్ని చేస్తూ టీఆరెస్ ప్రభుత్వం ఎన్నికలు రాగానే మందు,మనీతో ఓటర్లను మభ్యపెట్టి అధికారాన్ని చేజిక్కుంచుకుంటున్నారని విమర్శించారు. కోటగిరి  ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు.డబ్బు మద్యం జోరుగా పంచుతున్న పార్టీలు ఉన్న దగ్గర ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని శ్యాంసుందర్ దేశ్ పాండే గెలవటం టీఆరెస్, బీజేపీలకు చెంపపెట్టులాంటిదన్నారు.

మద్యం ఏరులై ప్రవహిస్తున్న తరుణంలో కోటగిరి రైతులు మార్పు కోరుకోవటం అభినందనీయమన్నారు. ఈ మార్పు ఇక్కడ మొదలై ఎక్కడా ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు రావాలన్నారు. రాజకీయాల్లో పెను మార్పు అవసరమన్నారు. ప్రజలు గెలింపించన తరువాత ధనార్జన కోసం కాకుండా ప్రజలకు సేవా భావంతో పని చేసే వారు రాజకీయాల్లో  రాణించాలన్నారు.  ఈ కార్యక్రమంలో టీజేఎస్  రాష్ట్ర నాయకులు డాక్టర్ శంకర్, జిల్లా జేఏసీ చైర్మెన్ భాస్కర్, కో చైర్మెన్ మోహన్, కో కన్వీనర్ మాధవ యాదవ్, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కాసుల బాలరాజ్, మాజీ జడ్పీటీసీ పుప్పాల శంకర్, ఎంపీటీసీ మనోహర్, మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్, జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కొత్త కష్టాల్లో చిక్కుకున్న డోనాల్డ్ ట్రంప్

Satyam NEWS

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ 10 న క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా

Satyam NEWS

ప్రైవేట్ ఆస్పత్రిలో మూడేళ్ళ చిన్నారి మృతి

Satyam NEWS

Leave a Comment