26.7 C
Hyderabad
April 27, 2024 07: 41 AM
Slider ప్రత్యేకం

ఓపెన్ లెటర్: వివేకవంతుడైన ఒక ముస్లిం ఆవేదన

muslim

నిజంగా గుండెలపై చేతులు వేసుకొని చెప్పండి. గత కొద్ది రోజులగా మీడియాలో ఊదర గొడుతున్నట్టుగా ఇండియాలో కరోనా కు కారణం “నిజాముద్దీన్” యాత్ర చేసి వచ్చిన వాళ్లతోనే అని! ఎవ్వరూ తమ అంతరాత్మ చంపుకొని “అవును” అనలేరు.

అలాగే…. నిజాముద్దిన్ యాత్రచేసి వచ్చిన తరువాత కరోనా కల్లోలం వ్యాపించి ఎక్కువ పాజిటివ్ కేసులు నిజాముద్దిన్ యాత్రతోనే లింక్ అయి ఉన్నయని తెలిసీ స్వచ్చందంగా ముందుకు రాకుండా ఇంట్లొనే కూర్చుని తమ కుటుంబ సభ్యులనే కాకుండా తన ఇరుగుపొరుగు వారి కి కూడా ప్రమాదకర పరిస్థితులను సృష్టిస్తున్న తబ్లిగ్ జమాత్ సభ్యులు కూడా ఒకసారి తమ గుండెలపై చేయివేసుకొని చెప్పండి….మీరు చేస్తున్న పని సమాజానికి హితమేనా?

తప్పకుండా మీ అంతరాత్మ కచ్చితంగా మీరు చేస్తుంది “తప్పు” అని చెపుతుంది. ఇలా సిగ్గుపడుతోనో …భయపడుతోనో… రాలేక పోతున్నారేమోనని మీ మీద జాలిపడదామంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యుల జీవితాలను కూడ రిస్క్ లో పెట్టటం చూస్తుంటె మీలో అమాయకత్వం కంటే క్రూరత్వమే ఎక్కువగా ఉన్నట్టుకనపడుతుంది.

మీలాటి వారి కోసం మొత్తం ముస్లిం సమాజం సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది. మీకు సహయం చేయటానికి వచ్చే హెల్త్ కేర్ స్టాఫ్ మీద మీడియాలో వైరల్ వైరల్ అవుతున్నట్లు దాడి చెయ్యటం నిజమయితే …క్వారంటైన్ సెంటర్లలో సామూహిక నమాజ్ లు నిర్వహిస్తూండటం నిజమయితే …

డాక్టర్ల మీద ఉమ్మివేయటం లాటివి నిజమయితే ..తబ్లిగ్ జమాత్ గ్రూపులకు నిజముద్దీన్ తీసుకువెళ్ళటానికి నాయకత్వం వహించిన మౌలానాలు ఇంటువంటి సమయం లో వారంతట వారు ముందుకి వచ్చి తమ గ్రూపులకు సంబంధించిన వారిని దగ్గిరుండి తీసుకువెళ్లి ప్రభుత్వానికి సహాయం చెయ్యవలసింది పొయి,

రానివారి సమాచారాన్ని ఇవ్వవలసింది పోయి.. దాక్కోవటమే నిజమయితే… మీ అందరినీ ముస్లిం సమాజం వెనుకేసుకు రావలసిన అవసరంవుందా…? మీలాటి అతితక్కువ మంది మూర్ఖత్వం కలిగిన వారివల్ల ముస్లిం సమాజాన్ని మొత్తనికి కరొనా జిహాదీలుగా లేబుల్ తగిలిస్తున్న ముస్లిం ద్వేషులకు ఆయుధాలు ఇవ్వటం కాదా ఇది?

 మీలాటి వారి చేష్టలకు ముస్లిం అంటే అభిమానమున్న మిగతా ధర్మాలకు చెందినవారు కూడా విసుగెత్తి పొతున్నారు గమనిస్తున్నారా? గడ్డాలు, మీసాలు ,టొపీలు, పెట్టి, చేతిలో ఖురాను హదీసులు పట్టుకొని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ చివరికి నేర్చుకునే ఙ్ఞానం .. ఇతరుల చేత చెప్పించుకోవటమా?

ఇప్పుడు మన మీద మీడియా రూపంగా .. మన తప్పులేకపోయినా మనపై జరుగుగుతున్న దాడికి రోజు రోజు కు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల లోకి మిగతా ముస్లింస్ జారిపోతున్నారు. ఈ వైరస్ కల్లోల పరిస్థితులలో మసీదులలో సామూహిక ప్రార్థనలు చేయకూడదని తెలిసీ సామూహిక నమాజులకు ప్రోత్సహించే వారిని ఏమందాము?

దీనికి ఫత్వాలు జారీచేయాలా? నమాజ్ తప్పకుండా చేసేవారికి నమాజ్ ఎక్కడ ఆగుతుంది. ప్రస్తుతం మసీదులు తాత్కాలికంగా మూతబడి ఉండవచ్చు.. మక్కా తలపులు మూతబడి ఉండవచ్చు.. నమాజ్ చేసేవారికి మాత్రం కాబా దిక్కు మూతబడలేదు ..

మనసులో విశ్వాసం మూతబడలేదు .. కానీ కాబా దిక్కున నిలబడి మనముండే ప్రదేశం నుండి నమాజ్ ఆచరించే అవకాశం మన నుండి ఎవరూ దూరం చేయలేరుగా ..!! అల్లహ్ కరుణ చూపే వరకు ఈ విధంగా నమాజ్ చేయటానికి అల్లహ్ యే ఈ అవకాశం కల్పించాడు కదా !!

మరెందుకు నమాజ్ గురించి బెంగ. నిజాముద్దిన్ వెళ్లిరావటంలో మన తప్పు ఒక్కశాతం తప్పులేకపోయినా .. ఆ తరువాతి పరిణామాలకు, మన ప్రభుత్వ విజ్ఞప్తులను కొంత మంది పెడచెవిన పెట్టటం మూలన ఏదో తప్పంతా మనదే అయినట్టు, తలవంచుకుని నిలబడేటట్టు చెయ్యటానికి మీడియాకు, ముస్లిం ద్వేషులకు అవకాశమిచ్చిన వారమయ్యాము.

చివరకు.. ప్రపంచానికి కరోనా చైనా ద్వారా వచ్చిందని చెప్పుకుంటుంటే ఇండియాకి మాత్రం అచ్చం ముస్లింస్ ద్వారా మాత్రమే వచ్చిందనే ట్రాన్స్ లొకి తీసుకు వెళ్లిపోతున్నారు కావలసిన వారు. దీనికి మనలో కొంతమంది చేష్టలు చర్యలు ఊతమిస్తున్నాయి.

ఇప్పటికయినా మనం ఏదో ఆకాశం నుంచి ఊడి పడినవారం అన్నట్లు కాకుండగా ఈ దేశంలో ఒక సాధారణ పౌరులుగా ఆలోచించటం , ప్రవర్తించటం మంచిది. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఏ వ్యవస్థ అయినా రాత్రి పగలు ప్రతి పౌరుని సంక్షేమం కొరకు పనిచేస్తుంది …

వారిని ఇబ్బంది పెట్టకుండా వేరే వారి కంటే ఎక్కువగా సహకరించి .. ఇప్పుడు ముస్లింస్ అంటే ఉన్న నెగిటివ్ ఇమేజ్ ని మార్చుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. చాదస్తంగా ఆలోచించటం మాని అనవసర విమర్శలమీద ద్వేషపూరితంగా స్పందించటం , రెచ్చగొట్టె విధంగా మాట్లాడటం మాని సంయమనం పాటించటం ముఖ్యం.

ఇప్పుడు మాటల రూపం లోగాని ప్రచార రూపంలో గాని వారిని ఎదుర్కునే స్థానంలో లేము . చేతల రూపంగా మాత్రమే ఎదుర్కొనగలం. ప్రభుత్వ సూచనలు పాటించటం , ప్రభుత్వానికి సహకరించటం ముఖ్యం . ప్రభుత్వo ద్వారానే మన మంచితనాన్ని చాటించేటట్లు చెయ్యటం ద్వారానే మనపై రాళ్లు విసురుతున్న వారికి సమాధానం ఇవ్వగలం.

నేను ఇప్పుడు చెపుతున్నది అందరు ముస్లింస్ గురించి కాదు … అవివేకంతో అందరు ముస్లిమ్స్ ని తలవంచుకునేట్లు చేస్తున్న అతికొద్ది మంది ముస్లింస్ గురించి మాత్రమే .. నొచ్చుకుంటే మాత్రం క్షమాపణలు. (ఒక మిత్రుడు పంపిన ఈ అంశాలను యధాతధంగా ఇస్తున్నాం. రాసిన వ్యక్తి పేరు కూడా పంపాడు కానీ దాన్ని గోప్యంగా ఉంచుతున్నాం)

Related posts

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

ప్రేక్షకుల అభినందనల్లో మునిగితేలిన ఐశ్వరరాయ్

Satyam NEWS

కాకినాడ జిల్లాలో గుండాట శిబిరాలపై దాడులు

Bhavani

Leave a Comment