అయ్యా, పోలీసు కమిషనర్ గారూ, మహిళలపై హింసకు సంబంధించి ఇటీవలే నా చుట్టూ జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగం చేసుకుంటున్న నాకు బయటకు వెళ్లాలంటే భయమేస్తున్నది. ఉద్యోగం కోసం నేను ప్రతి రోజూ వరంగల్ నుంచి ఖమ్మంకు వంటరిగా ప్రయాణిస్తాను. తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరితే తిరిగి వచ్చే సరికి రాత్రి అవుతుంది.
ఈ నెల 28న మానస హత్య జరిగిన ప్రాంతం హంటర్ రోడ్డులోని విష్ణుప్రియ గార్డెన్స్ ప్రాంతం దగ్గరలోనే మా ఇల్లు ఉంటుంది. నేను ప్రతి రోజూ అదే మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. ఈ సంఘటనలు చూసినప్పటి నుంచి నేను ఇంటికి సురక్షితంగా వస్తానా అన్న భయం ప్రతి రోజూ వెంటాడుతున్నది. హైదరాబాద్ లో ప్రియాంకారెడ్డి, వరంగల్ లో మానస కు జరిగింది రేపు ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు.
అత్యవసర పరిస్థితుల్లో 100 కు ఫోన్ చేసినా మొబైల్ యాప్ ద్వారా తక్షణ సహకారం కోరిన వెంటనే క్షణాల్లో ప్రత్యక్షమై పోలీసులు రక్షిస్తారని నేను నమ్మడం లేదు. పోలీసు శాఖపై నమ్మకం లేక ఇలా చెప్పడం లేదు. పోలీసింగ్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాలుగా పేరు పొందిన ఇంగ్లాండ్, కెనడా, నెదర్లాండ్స్ దేశాల్లోనే ఫోన్ చేసిన వెంటనే వచ్చి కాపాడటం సాధ్యంకావడం లేదు.
అలాంటప్పుడు వరంగల్ లో సాధ్యం అవుతుందని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఆపదలో నన్ను నేను కాపాడుకోలేనప్పుడు నా ఉన్నత చదువులకు రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కుకు ఇక విలువ ఏముంటుంది? మానవ మృగాల మధ్యలో ఉంటూ ప్రతి క్షణం నన్ను నేను కాపాడుకోవాలంటే రివాల్వర్ కలిగి ఉండటమే ఏకైక సురక్షిత మార్గమని నేను నమ్ముతున్నాను.
మీరు రివాల్వర్ లైసెన్సు నిరాకరిస్తే సురక్షితంగా ఉండాలంటే ఉద్యోగం వదిలేసి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందేమో. దయచేసి నా ఆత్మరక్షణ కోసం నాకు రివాల్వర్ లైసెన్సు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఇలా ఒక మహిళ వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ కు లేఖ రాసింది.
The Arms Act 1959 and Rules ప్రకారం ఆత్మరక్షణకు రివాల్వర్ లైసెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది. భద్రత దృష్ట్యా ఆమె పేరు ఇక్కడ చెప్పడం లేదు. తెలంగాణ లో భయానక పరిస్థితులు ఈ లేఖ ద్వారా ప్రతిబింబిస్తున్నాయి. ఈ మహిళకు రివాల్వర్ లైసెన్సు మంజూరు చేస్తారా?
లేక ఈ లేఖను సవాల్ గా తీసుకుని వరంగల్ పోలీసులు, వారితో బాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ బలగాలను మరింత సమర్ధంగా పని చేసేలా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాల్సిన అంశం.
సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యం న్యూస్