29.7 C
Hyderabad
April 29, 2024 10: 01 AM
Slider ప్రత్యేకం

బీజేపీ ప్రతిపాదనలకు నో చెప్పిన పవన్ కల్యాణ్?

#pavankalyan

బీజేపీ వేస్తున్న ఎత్తుగడలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊ అంటారా ఊహూ అంటారా? ఈ ప్రశ్న ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. పవన్ కల్యాణ్ ను ఢిల్లీ రావాల్సిందిగా కబురు పెట్టిన బీజేపీ పెద్దలు రెండు మూడు విషయాలలో పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.

అయితే పవన్ కల్యాణ్ ఏ విషయంలోనూ మెత్తపడకపోవడంతో బీజేపీ అగ్ర నాయకులు తదుపరి చర్యలకు సమాయాత్తం అవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో జరిగిన సమావేశం వివరాలు చూస్తే ఆసక్తి కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండటం తమకు ఇష్టం లేదని జెపి నడ్డా పవన్ కల్యాణ్ తో స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

జనసేన బిజేపి కలిసి పోటీ చేయడం ద్వారా అద్భుత ఫలితాలు రాబట్టవచ్చునని జెపి నడ్డా పవన్ కల్యాణ్ ను అనునయించేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చతికిలబడిపోతే భవిష్యత్తు బిజెపి, జనసేన పార్టీలదే ఉంటుందని నేరుగా పవన్ కల్యాణ్ తో ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. వైసీపీని మళ్లీ గెలిచేలా చేయమని చెబుతున్నారా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించినట్లు తెలిసింది.

వైసీపీ మళ్లీ గెలిస్తే ఎలా ఉంటుందో తనకు తెలుసునని పవన్ కల్యాణ్ నడ్డాకు వివరించినట్లు చెబుతున్నారు. తాము అలా అనడం లేదని, బీజేపీ, జనసేన కలిసి ఉండాలని మాత్రమే కోరుతున్నామని, అందువల్ల భవిష్యత్తు తమకు అనుకూలంగా ఉంటుందని మాత్రమే అంటున్నామని నడ్డా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీనికి ఏ మాత్రం అంగీకరించని పవన్ కల్యాణ్, తనకు తన పార్టీ భవిష్యత్తు తో బాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎంతో ముఖ్యమని వివరించినట్లు తెలిసింది.

మళ్లీ వైసీపీ గెలిస్తే రాష్ట్రానికి ఏమౌతుందో అందరికి తెలుసునని, తాను తెలిసి తెలిసీ అందుకు సహకరించలేనని కుండబద్దలు కొట్టినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో జెపి నడ్డా ఆ విషయం ప్రధాని మోదీకి, హోమ్ మంత్రి అమిత్ షాకు చెబుతానని దాటవేస్తూ కర్నాటక ఎన్నికలలో ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరినట్లు తెలిసింది.

కర్నాటకలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఎదురీదుతున్నది. అక్కడ కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగువారు ఎక్కువగా ఉండే 32 నియోజకవర్గాలలో పవన్ కల్యాణ్ ప్రచారం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని బీజేపీ అంచనా వేస్తున్నది. దాంతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేసే విషయాన్ని పరిశీలించాల్సిందిగా జెపి నడ్డా పవన్ కల్యాణ్ ను కోరినట్లు చెబుతున్నారు.

అయితే ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల విషయం తేలకుండా తాను బీజేపీకి ప్రచారం చేయలేనని పవన్ కల్యాణ్ వివరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాంతో ఆ విషయంపై కూడా ‘‘పెద్దలతో’’ మాట్లాడుకోవాలని నడ్డా సూచించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు విషయంలో పవన్ కల్యాణ్ ఇంత పట్టుదలతో ఉంటారని ఊహించని జెపి నడ్డా షాక్ తిన్నట్లు చెబుతున్నారు.

జెపి నడ్డా ప్రతిపాదనలను రుచించని పవన్ కల్యాణ్ వెనుదిరగడంతో ప్రధాని కార్యాలయం నుంచి, అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు ఇక్కడి జనసేన నాయకులకు సమాచారం అందింది. పవన్ కల్యాణ్ తమ ప్రతిపాదనకు వెంటనే అంగీకరిస్తారని భావించిన బీజేపీ నేతలు ఆయన పట్టుదల చూసి షాక్ తిన్నారు. వైసీపీతో ఎంతో సఖ్యతగా ఉంటున్న రాష్ట్ర బీజేపీ నాయకుల ప్రతిపాదన మేరకే నడ్డా ఈ విధంగా పవన్ కల్యాణ్ తో మాట్లాడినట్లు జనసేన నాయకులు ఒక అంచనాకు వచ్చారు.

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పవన్ కల్యాణ్ తో మరే విషయాలు ప్రస్తావిస్తారో, అందుకు పవన్ కల్యాణ్ అంగీకరిస్తారో లేదో అనే ఉత్కంఠలో జనసేన నాయకులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తేనే తమకు భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్న జనసేన నేతలు, వైసీపీ బీజేపీ మైండ్ గేమ్ కు పవన్ కల్యాణ్ తలొగ్గకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయం స్పష్టంగా తెలిసిన పవన్ కల్యాణ్ ఏ మాత్రం మెత్తపడటం లేదని అంటున్నారు.

Related posts

విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Bhavani

సమ్మక్క జాతరకు రూ.111 కోట్లు కేటాయించాలి: సీతక్క

Satyam NEWS

మంత్రి పువ్వాడ ను కలిసిన ట్రైనీ ఐ‌పి‌ఎస్

Murali Krishna

Leave a Comment