28.7 C
Hyderabad
April 26, 2024 10: 40 AM
Slider ఆధ్యాత్మికం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రాల సమర్పణ

#TirumalaHills

తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా శుక్ర‌వారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసి, తెలియక జ‌రిగిన‌ దోషాల నివార‌ణ‌కు ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న‌ట్టు తెలిపారు.

తిరుమలలో 15వ‌ శతాబ్దం వరకు పవిత్రోత్సవాలు జరిగినట్టు ఆధారాలున్నాయ‌ని, 1962వ సంవత్సరం నుంచి టిటిడి ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందని వివ‌రించారు. ప‌విత్రోత్స‌వాల‌లో భాగంగా మొద‌టి రోజు గురువారం ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు.

రెండ‌వ రోజైన‌ శుక్ర‌వారం ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ శాస్త్రోక్తంగా నిర్వ‌హించార‌న్నారు. మూడ‌వ రోజైన‌ శ‌ని‌వారం పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ ఉత్స‌వాల‌లో భాగంగా మూడు రోజుల పాటు ఉదయం స్నపనతిరుమంజనం నిర్వ‌హిస్తున్నామ‌ని, సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని రంగ‌నాయ‌కుల మండ‌పంలో వేంచేపు చేస్తామ‌న్నారు.

ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలి

శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ప్ర‌పంచంలోని ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌ చ‌ర్య‌ల‌లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌యంలో మూడు రోజుల పాటు ఏకాంతంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు ఈవో తెలిపారు. ప‌విత్రోత్స‌వాల్లో రెండో రోజు ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు.

ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళామాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులువారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామివారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలల‌ సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. 

అనంతరం సాయంత్రం 6.00 నుంచి రాత్రి 7.00 గంటల వరకు ప్రత్యేక‌ అలంకర‌ణ‌తో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని ఆల‌యంలోని రంగ‌నాయ‌క మండ‌పంలో వేంచేపు చేస్తారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి,  అద‌న‌పు ఈవో ఏ.వి.ధ‌ర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

నమస్తే తెలంగాణ ఫోటో గ్రాఫర్ కి జాతీయ అవార్డు

Satyam NEWS

వరద సహాయ కేంద్రంలో మాస్కుల పంపిణీ

Satyam NEWS

సంక్రాంతి సంబరాలు సంప్రదాయానికి ఆనవాలు

Bhavani

Leave a Comment