33.7 C
Hyderabad
April 29, 2024 02: 18 AM
Slider ప్రత్యేకం

అమరావతే రాజధాని అని బి.జె.పి. స్పష్టంగా చెప్పింది

#PawanKalyan

అమరావతి ఉద్యమానికి సంబంధించి ఏ రోజూ జనసేన పార్టీ వెనుకడుగు వేయలేదనీ, రాజధాని అమరావతి విషయంలో తమ విధానం స్పష్టంగానే ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కోర్టులో అఫిడవిట్  అడిగినప్పుడు పార్టీపక్షాన  వేశామని, రాజధాని వ్యవహారంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అమరావతి జాయింట్ కమిటీతో సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అమరావతి ఉద్యమ కార్యచరణకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఢిల్లీ వెళ్లిన సందర్భంలో కూడా రైతులు, మహిళల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి, ఇక్కడ జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఫోటోలతో సహా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్లాం.

బీజేపీ ఒక ప్రకటన ఇస్తే కట్టుబడి ఉంటుంది

బీజేపీ అగ్రనాయకత్వం కూడా అమరావతినే మేం రాజధానిగా చూస్తున్నామని స్పష్టంగా చెప్పింది. ఢిల్లీ వెళ్లబోయే ముందు రోజు కూడా అమరావతే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అని బి.జె.పి. రాష్ట్ర శాఖ ఒక తీర్మానం చేసింది. గతంలో చిన్న రాష్ట్రాలకు అనుకూలమని స్టాండ్ తీసుకున్న బీజేపీ- రాష్ట్ర విభజనను తప్పుబట్టలేదు కదా.

ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు బీజేపీ నిలబడి ఉంటుంది. ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం దాన్ని ఎంత వరకు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారన్న విషయం మా పార్టీ పరిధిలోని అంశం కాదు. అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం మాకు చెప్పింది. అదే మా పార్టీ స్టాండ్ కూడా.

అందులో భాగంగానే లాంగ్ మార్చ్ చేయాలనుకున్నా దురదృష్టవశాత్తు ముందుకు తీసుకువెళ్లలేకపోయాం. కరోనా వ్యాప్తి మూలంగా మా తరఫు నుంచి ఇంతకు ముందున్నంత వేగంగా ముందుకు వెళ్లలేదు.

ఉద్యమం విషయానికి వస్తే నిన్న పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు. పార్టీ తరఫున ఎలాంటి మద్దతు కావాలో మా ప్రతినిధులకు తెలియపర్చండి. అయితే 365వ రోజు లోపు అయిపోవాలి అన్న డెడ్ లైన్స్ విధించుకోవద్దు.

వైసీపీ ప్రభుత్వం ఈ రోజుకీ అమరావతి రాజధాని కాదు అన్న విషయం ఎక్కడా రికార్డుపరంగా స్పష్టంగా చెప్పడం లేదు. మేం ఇక్కడ నుంచి రాజధానిని తీసేస్తున్నాం అని రాతపూర్వకంగా చెప్పకుండా వైసీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారు.

మూడు రాజధానులు అంటున్నారు. ఇక్కడ ఉండదు అని మాత్రం అనడం లేదు. రాజధాని వ్యవహారంలో మా భాగస్వామ్యపక్షం బీజేపీతో చర్చిస్తాను. రెండు పార్టీల నుంచి ఏం కోరుకుంటున్నారో జేఏసీ తరఫున స్పష్టత ఇవ్వండి. ప్రధాన మంత్రి గారి దగ్గర రాజధాని జె.ఏ.సి. విజ్ఞప్తి మేరకు వారి అపాయింట్మెంట్ వ్యవహారం కూడా కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తాం అని ఆయన అన్నారు

ప్రభుత్వం మారింది కాబట్టి రాజధాని మారుస్తానంటే కుదరదు

విభజన జరగిన తీరు నుంచి రాజధాని రైతులకు జరిగిన అన్యాయం వరకు ప్రతి అంశంలో జనసేన పార్టీ తరఫున చాలా స్పష్టంగా, దూరదృష్టితో మాట్లాడుతూ వస్తున్నాను. మా స్టాండ్ విషయానికి వస్తే ఎప్పుడైనా బలంగానే తీసుకుంటాం. ఎక్కడా వెనుకడుగు వేయం.

అమరావతి రైతులు భూములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారుగాని ఓ పార్టీకి కాదు. ప్రభుత్వం మారింది కాబట్టి మార్చేస్తాం అంటే కుదరదు. మహిళలు ఉద్యమంలో జనసేన పార్టీ భాగస్వామ్యం కావాలని కోరారు. జనసేన పార్టీ కచ్చితంగా ఉద్యమానికి అండగా నిలబడుతుంది.

రాజధాని వల్ల కొద్దిమందికే ప్రయోజనం అన్న వాదనను బలంగా ప్రచారం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్దతు తెలపడానికి కొంత సంకోచిస్తారు. అలాంటి భయాలన్నింటినీ కూడా దాటి రాజధాని వ్యవహారంలో మొదటి రోజు నుంచి జనసేన పార్టీ చాలా స్పష్టతతో ఉంది.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నట్టు రాజధాని కేవలం ఒక కులానికి చెందినది అన్న మాట ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా చెబితే బాగుండేది. ఆ రోజు అందరూ ఒప్పుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మనసు మార్చుకోవడం కుదరదు.

ఇలాంటి ధోరణులను జనసేన పార్టీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నేను కూడా తెలివిగా చొక్కా నలగకుండా మాట్లాడగలను. కానీ అమరావతి కోసం నేను చెప్పులు తెగినా, పోలీసు కంచెలు దాటకుని మరీ రోడ్డు మీదకు నడుస్తూ వచ్చాను. ఇంట్లో సంసారాలు మోసే ఆడపడుచులు రోడ్డు మీదకు వచ్చిన తీరు నన్ను కలచి వేసింది. వారి బాధలకు మద్దతు ఇద్దామని బయటకు వచ్చాను.

రాజధానికి రమ్మని పిలిచింది దళిత రైతులే

ఆ రోజు నన్ను రాజధానికి రమ్మని పిలిచింది దళిత రైతులే. ఉద్దండరాయునిపాలెం దళిత రైతులతో మాట్లాడుతూ మీరు భూముల్ని ఇష్టపడి ఇస్తున్నారా అని అడిగితే ‘మా ఆంధ్రప్రదేశ్ కోసం ఇస్తున్నామ’ని చెప్పారు. పరిహారం పెంచమని అడిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఇప్పించాం.

ఉద్యమకారులపై వైకాపా నేతల వ్యాఖ్యలు సరికాదు. బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా? ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే ఉండాలా? ఉద్యమం అంటే చిరిగిన బట్టలతో… హోరెత్తే నినాదాల మధ్య చేయాలనే ధోరణితో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.

దేశంలో రాజకీయ నాయకులు చెప్పిన దానికి బ్యూరోక్రసీ తల ఊపేసే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో గొంతెత్తే ఓ బలమైన పౌర సమాజం కావాలని నేను కోరుకుంటాను. తప్పులు జరిగినప్పుడు ఆ సమాజం ముందుకు వచ్చి ప్రశ్నించాలి.. ఉద్యమాన్ని లీడ్ చేయాలి” పవన్ కల్యాణ్ అన్నారు.

Related posts

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

ఈడి కేసులో హైకోర్ట్ కు నామా

Murali Krishna

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment