ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామాలలో రాజకీయం చిచ్చు పెడుతూనే ఉంది. రాజకీయ కక్షలతో అమాయకులైన రైతులను కూడా నష్టపరచిన దారుణం గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో జరిగింది. గుత్తా హనుమంతరావు, గుత్తా వాసు అనే ఇద్దరు రైతులు తమ మిర్చి పంట కోసి ఆరుబయట ఆరబెట్టుకున్నారు.
వారికి రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ నాయకులు దీన్ని గమనించి రాత్రికి రాత్రి మిర్చిపంటను తగులబెట్టేశారు. వైసీపీ నాయకుల దౌర్జన్యానికి మొత్తం 40 క్వింటాలు మిర్చి దగ్ధం అయిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన తమ పంట అగ్నికి ఆహుతి కావడంపై ఆ రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ కారణాలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ ఈ విధంగా పంటలు తగులబెడితే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. సుమారుగా రూ 6 లక్షలు నష్టం జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంఘటన స్థలాన్ని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు నేడు సందర్శించారు.
జరిగిన దారుణాన్ని ఆయన కళ్లారా చూశారు. రాజకీయ కక్షలతో రైతుల పంటలు నాశనం చేయడం తగదని ఇలాంటి పనులకు పాల్పడేవారు సాధించేది ఏమీ ఉండదని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. నష్టపోయి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలలో గూండాలను అదుపు చేయాలని ఆయన కోరారు.