గోదావరి ఉగ్ర రూపం దూరం నుంచి చూస్తేనే భయం పుడుతుంది. దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేసే వీలు ఉండదు. అలాంటిది గోదావరి ఉగ్ర రూపం దాల్చినప్పుడు కూడా అత్యంత సాహసం ప్రదర్శించారు అక్కడి గిరిజనులు. అక్కడి లోతు 300 అడుగుల పైనే ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి గజ ఈతగాడికైనా ప్రాణాలు నీట కలిసిపోతాయి. కానీ ఆ గిరిజనులు గోదావరి సుడిని, లోతును చూసుకోలేదు. కళ్లెదుట మునిగిపోతోన్న బోటు, అందులో ఆర్తనాదాలు చేస్తున్న పర్యాటకులు మాత్రమే వారికి కనిపించారు. ఆ క్షణాన వారికి వేరే ఏమీ గుర్తుకు రాలేదు. అందరిదీ ఒకటే లక్ష్యం. బోటులో మునిగిపోతున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడం. అనుకున్నదే తడువుగా కచ్చులూరు గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు మూడు బోట్లలో ఒక్క ఉదుటున గోదావరి వడిని లెక్క చేయకుండా ముందుకు కదిలారు. మునిగిపోతున్న రాయల్ వశిష్ట పున్నమి బోటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే నదిలో పడిపోయి కొట్టుకుపోతోన్న వారిని ఒడిసి పట్టుకుని బోట్లలో వేసుకుని ఒడ్డుకు చేర్చారు. ఒక్కో బోటులో ఆరుగురు వంతున మూడు బోట్లలో వెళ్లిన పద్దెనిమిది మంది గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, చేతికి అందినవారిని అందినట్లుగా బయటకు తీసుకువచ్చారు. అలా మొత్తం 24 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడారు. వీరూ నిజమైన హీరోలు. ity
previous post
next post