33.7 C
Hyderabad
April 30, 2024 00: 39 AM
Slider ప్రత్యేకం

వైయస్ వివేకా హత్య కు సూత్రధారులు జగన్ రెడ్డి, భారతి: రఘు రామ కృష్ణంరాజు

#raghurama

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డిల  ప్రమేయం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు  రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో  చెప్పని నిజం ఇదేనేమోనని తెలిపారు.

ఈ హత్య వెనుక  జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలు  ఉన్నారని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను. సిబిఐ విచారణ పూర్తి అయితే, ప్రస్తుతానికి సూత్రధారి గా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా, పాత్రధారిగా మారుతారన్నారు. వైఎస్ వివేకా హత్యకు ప్రస్తుతానికి సూత్రధారిగా అవినాష్ రెడ్డి, పాత్రధారులుగా అప్రూవర్ గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ లు గుర్తించడం జరిగిందన్నారు. నా దృష్టిలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి లు కూడా పాత్రధారులేనని  తెలిపారు.

మహేష్ బాబు హీరోగా నటించిన అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో వచ్చిన అర్జున్ సినిమాలో ప్రకాష్ రాజ్, సరిత దంపతులు చాలా పవిత్రంగా ఉంటున్నట్టు నటిస్తూ, హత్యలు చేయిస్తుంటారన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలను అర్జున్ సినిమాలోని ప్రకాష్ రాజ్, సరిత జోడితో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తరచూ పోలుస్తూ ఉంటారని తెలిపారు. ఆదినారాయణ రెడ్డి అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నానని, నాకు కూడా అలాగే అనిపిస్తుంటుందని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి తనపై మోపబడిన ఈ అభియోగాన్ని  ఖండించాలనుకుంటే, సిబిఐ ఎంక్వయిరీ  పూర్తిచేయాలని కోరాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  అజయ్ కల్లం రెడ్డి వేసిన  పిటిషన్ విచారణ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైయస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని రక, రకాలుగా సాక్షి దినపత్రికలో తప్పుడు కథనాలను రాస్తూ, డైవర్షన్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారన్నారు.

2019 ఎన్నికలకు ముందు ఈ హత్యోదంతం పై మాట్లాడకుండా, జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానం నుండి గ్యాగ్ ఆర్డర్ తీసుకువచ్చారని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ బృందం (సిట్ ) దర్యాప్తుపై మాకు నమ్మకం లేదని, సిబిఐ విచారణకు డిమాండ్ చేశారని  గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, సిబిఐ విచారణ ముందుకు సాగకుండా అనేక అడ్డంకులు కల్పించారన్న ఆయన, ఈ కేసులో దూకుడుగా ముందుకు వెళ్తున్న అభిషేక్ మహంతి  రాష్ట్రం విడిచి పారిపోయేలా ఇబ్బందులకు గురి చేశారన్నారు.

హత్యోదంతానికి ముందు జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్లు వివరించిన  డాక్టర్ సునీతా రెడ్డి

వివేకానంద రెడ్డి హత్యోదంతానికి ముందు జరిగిన సంఘటనలను ఆయన కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి మీడియా ప్రతినిధులకు కళ్లకు కట్టినట్లు వివరించారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. 2019 మార్చి 15వ తేదీకి ముందు నెల రోజుల క్రితం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ఎవరు ఎలా పథక రచన చేశారో చెప్పారన్నారు. నేను కూడా  మీడియా సమావేశంలో సునీతారెడ్డి చెప్పిన అంశాలను  చెవులు, కళ్ళు పెద్దవి చేసుకొని వినటం, చూడడం జరిగిందన్నారు. మంగమ్మ ముని మనవడే  మన కథానాయకుడని, రెండవ పెళ్లి అంటే  కయి, కైమని అరిచే జగన్మోహన్ రెడ్డికి  ఆయన పుట్టుకనే నచ్చదేమో మనకు తెలియదన్నారు.

వైఎస్  కుటుంబ వంశవృక్షం గురించి  డాక్టర్ సునీతా రెడ్డి తెలియజేస్తూ, చిన్న కొండారెడ్డి కి ఏడు మంది మగసంతానం, నలుగురు ఆడ సంతానమని  తెలిపారు అన్నారు. అందులో భాస్కర్ రెడ్డి ఆరవ వాడైతే, ఆయన కుమారుడే అవినాష్ రెడ్డి అని తెలియజేసిందన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరి కుమార్తెనే వైయస్ భారతి రెడ్డి  అని డాక్టర్ సునీతారెడ్డి పేర్కొన్నారన్నారు. మంగమ్మ నాలుగోవ కుమారుడైన రాజారెడ్డికి రెండవ సంతానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మూడవ సంతానంగా వైఎస్ వివేకానంద రెడ్డి  జన్మించారని డాక్టర్ సునీతా రెడ్డి వివరించారన్నారు. వైఎస్ రాజారెడ్డి మొదటి కుమారుడైన జార్జి రెడ్డి మృతి చెందారని ఆయన కుమారుడే గడ్డం అనిల్ రెడ్డి అని తెలియజేశారన్నారు.

వైయస్ వివేకా హత్యకు నెలరోజుల ముందు  సునీల్ యాదవ్, జయప్రకాశ్ రెడ్డి, గంగిరెడ్డి కలిసిమెలిసి అన్యోన్యంగా, ఆప్యాయంగా,  ఆహ్లాదకరమైన సమయంలో తీసుకున్న ఫోటోలను  డాక్టర్ సునీతారెడ్డి, ప్రెస్ మీట్ లో ప్రదర్శించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. వైయస్ వివేకా హత్యకు వారం రోజుల ముందు దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య  జరిగిన సంభాషణను  సిబిఐ సేకరించింది. తాము పంపుకున్న  మెసేజ్ లన్నీ గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుస్తాయని తెలియక సాక్షి దినపత్రిక  బాధితులనే, నిందితులుగా మార్చే విధంగా కథనాలు, హత్యకు గురైన వ్యక్తికి  అక్రమ సంబంధాలను అంటగడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో, యజమాని చెబితే రాశారో, చెప్పకపోయినా రాశారో తెలియదు కానీ సాక్షి దినపత్రికలో అద్భుతంగా అబద్దాలను వండడం జరిగిందన్నారు. రేపో, మా పో మళ్లీ అబద్ధాల కథనాలను  వండివారుస్తారని  రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

అవినాష్ ఫోన్ నుంచి హత్య జరిగిన రోజే  రాత్రి రెండున్నర గంటల నుంచి పలు నెంబర్లకు  వాట్సాప్  కాల్స్

వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రాత్రి రెండు గంటల తరువాత అనేక ఫోన్లకు వాట్సాప్ కాల్స్ వెళ్లాయని  ఆధారాలతో సహా డాక్టర్ సునీతా రెడ్డి వివరించారని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు..  వాట్సాప్ ను ఫేస్ బుక్ టేకోవర్ చేసిన తర్వాత ఫలానా ఫోన్ నుంచి, అవతలి వ్యక్తి కి వాట్సాప్ కాల్ వెళ్లిందని గుర్తించవచ్చునన్నారు. ఆ సమయంలో ఎవరికి ఫోన్ కాల్ వెళ్ళింది  అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారని, తెలుసుకున్నారని కూడా చెప్పారు.

అయితే ఆ విషయంలో అదృశ్య శక్తులు పని చేయడంతో, పూర్తి సమాచారాన్ని చార్జిషీట్లో  సిబిఐ పొందుపరచలేక పోయిందన్నారు. అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారు జాము వరకు నిరంతరాయంగా వాట్సాప్ కాల్స్ ద్వారా ఫోన్ సంభాషణ  కొనసాగిందన్నారు. ఫేస్బుక్ వద్ద అవినాష్ రెడ్డి ఎన్ని గంటల పాటు, ఎన్ని నిమిషాల పాటు, ఎన్ని సెకండ్ల పాటు  మాట్లాడారో పూర్తి డేటా ఉందన్న రఘురామ కృష్ణంరాజు, ఇదే విషయాన్ని  అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి తడబడ్డారన్నారు. అప్పటికి ఇంకా ఎన్నికల  హడావిడి మొదలు కాలేదని, అభ్యర్థులను కూడా ఖరారు చేయలేదన్నారు.

అదేదో తెల్లారి పోలింగ్ అంటే  ఏజెంట్లతో మాట్లాడారంటే అర్థం ఉందని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే, ఎన్నికల కోసం మాట్లాడానని చెప్పడం అర్థరహితమన్నారు. హైదరాబాదులో రాష్ట్ర ప్రజలను ఎలా మోసగించాలన్నదానిపై జగన్మోహన్ రెడ్డి  మేనిఫెస్టో రూపకల్పన కోసం లబ్ద ప్రతిష్టులైన వ్యక్తులతో  సమావేశమయ్యారన్నారు. ఆ సమావేశం కొనసాగుతుండగానే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ కాల్ వచ్చినట్లు పైనుంచి  పిలుపు రావడంతో, ఆయన అర్ధాంతరంగా  సమావేశం నుంచి పై అంతస్తుకు  వెళ్లి, తిరిగి సమావేశం జరుగుతున్న  ప్రదేశానికి వచ్చి, బాబాయి ఇకలేరు… చనిపోయారని అప్పుడే తనకు తెలిసినట్లుగా  జగన్మోహన్ రెడ్డి  చెప్పడంతో, అందరూ నిర్గాంత పోయి సమావేశాన్ని వాయిదా వేసుకుని, ఎవరి దారిలో వారు వెళ్లిపోయారన్నారు.

ఈ విషయాన్ని సిబిఐ అధికారులకు  అజయ్ కల్లం రెడ్డి  పూసగుచ్చినట్లు వివరించారు. కానీ సిబిఐ అధికారులు తన వాంగ్మూలాన్ని నమోదు చేశారని ఆయన భావించలేదు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ సంఘటనకు సంబంధించి కథనం వెలువడిన తర్వాత, తన మాటలను వక్రీకరించారని కోర్టును ఆశ్రయించారని తెలిపారు. అయితే , సిబిఐ అధికారులు తాము రికార్డు చేసిన అజయ్ కల్లం రెడ్డి వాంగ్మూలం  ఆడియోను న్యాయస్థానం ముందు ఉంచారు. కేసు వేసిన వారే, విచారణకు వచ్చినప్పుడల్లా వాయిదాలను కోరుతున్నారంటే  దొంగ ఎవరు… హంతకులు ఎవరో తెలిసి పోలేదా?  అని రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు.

Related posts

ఎనాలసిస్: సారూ ఇంకా ఉంచుతారా? ఇక ఎత్తుతారా?

Satyam NEWS

కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది…

Satyam NEWS

కరోనా నిబంధనలు పాటించని మండల విద్యాధికారి

Satyam NEWS

Leave a Comment