హైదరాబాదు లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 70వ బ్యాచ్ ఐపిఎస్ ప్రొబేషనర్స్ పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ లు పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా ప్రొబేషనర్స్ కవాతును పరిశీలించి, ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి బహుమతి ప్రదానం చేశారు. మొత్తం 103 మంది అధికారులలో 15 మంది మహిళా అధికారులు, 6 గురు రాయల్ భూటాన్ పోలీసులు, 5 గురు నేపాల్ పోలీస్ సర్వీస్ అధికారులు ఉన్నారు. హైదరాబాద్ సంస్థానంను భారత్ లోకి విలీనం చేసేందుకు తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు అమిత్ షా. ఎప్పటి నుంచో సమస్యగా మారిన జమ్ము, కశ్మీర్ కు నరేంద్ర మోదీ సర్కార్ విముక్తి కల్పించిందని అమిత్ షా గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి అక్కడి అభివృద్ధికి తమ ప్రభుత్వం బాటలు వేస్తోందని చెప్పారు. ఐపిఎస్ సాధించడంతోనే ఆశయం నెరవేరినట్లు కాదని, నిజాయితీగా పని చేసి దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలని చెప్పారు. దేశ రక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణాలు ఇచ్చారని, వారి త్యాగాలను మరచిపోరాదని అమిత్ షా అన్నారు. రాజకీయ నాయకులు కేవలం ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారని, అదే పోలీసులు దాదాపు 30 ఏళ్ల పాటు సర్వీసులో ఉంటారని అమిత్ షా అన్నారు. మనసు చెప్పినట్లుగా నడుచుకోవాలని చెప్పిన అమిత్ షా, ఎక్కడైనా కానీ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా వ్యవహరించాలని చెప్పారు.
previous post