38.2 C
Hyderabad
April 28, 2024 21: 22 PM
Slider కవి ప్రపంచం

మన పల్లెటూరు

#MuluguLaxmiMaidhiliSankranthi

పల్లెతల్లి చల్లని ఒడిలోనే

నగరం పురుడు పోసుకుంది

పల్లెటూళ్ళే దేశానికి పట్టుకొమ్మలు

భూమి పుత్రులే.. నగరానికి అన్నదాతలు

పచ్చని పైరులతో అందమైన ప్రకృతి

పల్లెలో రమణీయంగా పల్లవిస్తుంటే

కృత్రిమమైన సోయగాలతో

పట్నం దొరసాని ముస్తాబవుతుంది.

స్వచ్ఛమైనగాలికి ప్రతీక తరువుల వీవెనలు

సమస్తం కాలుష్య భరితమీ నగరం

పుడమితల్లి మట్టి పరిమళాన్ని ఆస్వాదిస్తూ

గ్రామీణుల జానపదాల జాతరతో

ఏరువాక సాగుతుంది..

పల్లెవాసుల శ్రామిక శక్తిని …

పట్టణ యాంత్రీకరణ ఎపుడోమింగేసింది

ఊరువారి మనసుల్లో …

ఆప్యాయతలు…అనురాగాలు..

మంచితనం పువ్వల్లే ..వెల్లివిరిస్తే..

మోసాలు, ద్వేషాలు,వంచనలు ..

బస్తీకి పట్టిన చీడపీడలై బాధిస్తాయి

ఉరుకులు పరుగుల జీవితంలో

మహానగరంలో ఎవరికి వారే..

కష్టమొచ్చినా,గండమొచ్చినా

పల్లెంతా ఒక్కటై ఆత్మీయంగా పలకరిస్తుంది

నాగరికత విషసంస్కృతిలో

మానవసంబంధాలు అంతరించిపోతున్నాయి..

అభివృద్ధి, ఆధునికత ముసుగులో

భూమి తల్లిని మింగేస్తోంది నగరం

నాడు నేలతల్లినివదిలి ధనార్జనే ధ్యేయంగా

యువత నగరబాట పట్టింది…

నేడు కరోనా రక్కసి విసిరిన పంజాతో

జీవనోపాధి కోల్పోయిన

బడుగు జీవులను ..పట్నం పొమ్మంటే

పల్లెటూళ్ళు అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నాయి

కాసులిస్తేకానీ సహకరించని పట్నం కంటే

కాణీ ఖర్చు లేకుండా సహాయమందించే

గ్రామప్రజల గొప్ప మనసులకి తార్కాణం

అందుకేనేమో..ఏ పండగొచ్చినా…

అమ్మ ఒడికి చేరినంత సంతోషంగా..

 పచ్చని ప్రకృతి పాడిపంటల నడుమ

పల్లెవాసుల ఆప్యాయతలతో

తీయని జ్ఞాపకాల సంక్రాంతి సంబరాలకోసం

నగరమంతా పల్లెకు కదులుతుంది..!!

ములుగు లక్ష్మీ మైథిలి, నెల్లూరు, ఫోన్ :9440088482

Related posts

తెలంగాణ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి

Satyam NEWS

Breaking News: ఇళ్లపై కూలిపోయిన విమానం: 98 మంది మృతి

Satyam NEWS

పెంబర్తి వద్ద అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు లారీఢీ

Satyam NEWS

Leave a Comment