మేఘాలను రథంలా చేసి
సంజయుడివై పోతావ్
కవితా మహాభారతo తో
రమణీయమైన యుద్ధం
చేస్తావ్…
సాహిత్యాన్ని శంఖoలా ఊదుతూ
అద్భుతఅక్షర సృష్టికై
అక్షరారావం చేస్తావ్.
నువ్వంతే….
గోదావరి లా నవ్వుతావ్
కృష్ణ లా పొంగుతావ్
గుండెలోని రక్తంతో
పదాలను తడుపుతావ్
మనసులోని ఆర్ద్రత తో
మౌనాలను తాకుతావ్
కరుణరసంతో కన్నీళ్ళు పెట్టిస్తావ్
వీరరసంతో పౌరుషం
తెప్పిస్తావ్
భూమి ఆకాశాలను
ఏకం చేసే రాగం కడతావ్
విశ్వాన్ని ఓ అశ్వoగా చేసి
అధిరోహిస్తావ్..
వాలే బ్రతుకుల
తలరాతలు మార్చాలని
చూస్తావ్
చీకటి నిండిన జీవితాలలో
వెలుగు చుక్కయి ప్రకాశిస్తావ్. .
కాలే కడుపుల నీడకై
కవితల మల్లెల పందిరివేస్తావ్
పూచే పువ్వులపిల్లల కోసం
నవ్వుల తోటను నిర్మిస్తావ్
నువ్వంతే….
అమ్మ ఒడిలో మధురాల
బొమ్మలా నిద్రిస్తావ్
కొమ్మ కొమ్మన పూచే
ఆకులకలలు కంటావ్
వెన్నెలతో సహచర్యము చేస్తావ్
జాబిలితో నేస్తం కడతావ్
వర్షాన్ని పదాలతో కురిపిస్తూ
మయూరమై నర్తిస్తావ్….
నువ్వంతే…..
విరహాలను ఎగదోస్తూ
చలిమంటలు పెంచుతావ్
ప్రణయాల నావలో
పల్లవులు పాడిస్తావ్
నీవంతే…
మెరుపులు మోసుకుంటూ
కలలను కంటావ్
ఉరుములతో కలిసి
నాట్యం చేస్తావ్
సూర్యుడి ని
పడమట ఉదయించే లా చేస్తావ్
చంద్రుడికి అమవాస్య
లేకుండా చేస్తావ్…
ఆకాశoతో కుస్తీ చేస్తావ్
చుక్కలతో దోస్తీ కడతావ్
గాలిలో పూలతావిలా
ప్రయాణిస్తావ్
నేలతో మమేకం అవుతావు
నీవంతే….
నీ
అక్షరాలే కన్నీళ్ళు…
ఆరని అగ్నిగోళాలు
నీవొక అపూర్వ కర్మ.
అనంత అక్షర బ్రహ్మ
నీవొక ఉషస్సు
కవితా యశస్సు..
సంధ్యారాణి, మిచ్చిగాన్, అమెరికా