26.7 C
Hyderabad
April 27, 2024 07: 39 AM
Slider కవి ప్రపంచం

నడక మళ్ళీ ఇంటి వైపుకే..

#Inampudi Srilaxmi

దేహంలోనూ దేశంలోనూ చక్రాలు తెలిసాకే కదా

జీవన గమనం పరుగులు తీసింది 

వలస అంటే మానవాళి ప్రగతి ప్రస్థానమని అర్ధం అయ్యాకే కదా 

బస్సులు-లారీలు-రైళ్లు- గాలిమోటర్లతో పాటే  

రెక్కలను నమ్ముకున్న నడక మొదలైంది 

చరిత్రకారుడా!  ఇప్పుడు తెలిసిందా?

చేతులు మాత్రమే వైభవ చరిత్రను లిఖించవని 

స్వప్న భగ్న చరిత్రను పాదాలు కూడా  రాయగలవని !

కన్నోళ్లని – కన్న బిడ్డల్ని బొడ్రాయి దగ్గరే వదిలేసి

సాటి మనుష్యులే కదా  అని వచ్చిన నమ్మిన బంట్లు వాళ్ళు  

ఆ కూలీల కురచ కలలిప్పుడు కూలిపోయాయి

ఇంజినీరుడా! ఇప్పుడు తెలిసిందా

ఇటుకలు-సిమెంట్ లు  భవనాల్ని నిర్మిస్తాయి 

కానీ మానవత్వాన్ని మాత్రం  

రక్త మాంసాల బొక్కల గూడులు మాత్రమే నిలబెడతాయని! 

పెదాల ప్రార్థనలన్నీ అదృశ్యం అయ్యాక  

రోడ్డును కొలుస్తున్న ఆడకూలీ ప్రసవంలో శూన్యమే గోచరించాక 

ఆఖరి దిక్కయిన దేవుడే క్వారంటైన్ లో సమాధి అయ్యాక

ప్రబోధకుడా! ఇప్పుడు తెలిసిందా

నువ్వు చెప్పే ఆత్మ 

పుస్తకాల్లో అక్షరాలను మాత్రమే  శాసిస్తుందని 

కానీ ఆకలి జీవితాలను సైతం శపిస్తుందని! 

నగరం నరకానికి బ్రాంచ్ ఆఫీస్ అనీ

యజమానులు అరచేతుల్లో ఎస్టేట్ సృష్టి కర్తలని తెలిసాక  

పుట్టిన గడ్డకే తిరిగి తీసుకెళ్లమని వేడుకుంటూ 

వాళ్ళ పాదాలపై వాళ్ళే  తలవాల్చారు

కార్పోరేటుడా!  రియల్ ఎస్టేట్ దందాకారుడా…

ఇప్పుడైనా తెలిసిందా?

కరెన్సీ వాసన వాళ్ళ రక్తాన్ని నీ వైపు మళ్లిస్తుందేమో 

కానీ కన్నీటి వాన మాత్రం వాళ్ళ గుండెల్ని ఇంటి వైపే నడిపిస్తుందని

నీ పన్నాగాలేవీ ఈ మానవ ప్రవాహాన్ని ఆపలేవని!!

– అయినంపూడి శ్రీలక్ష్మి, 99899 28562

Related posts

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Bhavani

బోన్ క్యాన్సర్ బారినపడిన చదువుల సరస్వతి

Satyam NEWS

నివాస గృహాల మధ్య కరోనా టెస్టింగ్ సెంటర్ పెడితే ఎలా?

Satyam NEWS

Leave a Comment