28.7 C
Hyderabad
April 26, 2024 07: 50 AM
కవి ప్రపంచం

రేకుల ఇల్లు

#Rajeswararao Ledalla

దారికి దగ్గరగా, ఊరికి కొంచెం దూరంగా వెలిసిందో రేకుల ఇల్లు

పొందికగా తనని చూసి తానే మురిసి పోయేలా

పచ్చని పొలాల వెచ్చని వాసనల్ని పీలుస్తూ

చల్లని సాయంత్రాల మధుర వీచికల గ్రోలుతూ

రేకుల ఇల్లు.

వేసవి మధ్యాహ్నాలు సంకోచించిన గాలి రేకుల మధ్య చప్పుడు చేస్తూ

వర్షపు చిటపటల ఆహ్లాదపు

హోరుననుభవింప చేస్తూ

మండుటెండల భగభగల ఉక్కిరిబిక్కిరౌతూ

శీతలపు రాత్రుల ముసుగుతన్ని

రేకుల ఇల్లు.

పంచభూతాల మధ్య తపస్సు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది అప్పుడప్పుడూ.

అయినా ఆనందాలను పంచే జ్ఞాపకాల పూదోట అది

పట్టణీకరణ బహుళ అంతస్తుల భవనాలై విస్తరించినప్పుడు

ఒక్కొక్క ఇటుక వరుసలో పేర్చబడి వొణికే చేతుల కష్టాన్ని కూడగట్టుకొని

కదిలే ప్రాణుల

కాస్తంత సంతోషం కోసం

ఇంకా నిలబడే ఉంది

రేకుల ఇల్లు

తనను అందంగా నిర్మించ లేదనో

ఆకర్షణీయంగా తీర్చిదిద్దలేదనో

ఏనాడూ ఆక్రోశించక

గిట్టని వాళ్ళ వెక్కిరింతల్ని కూడా  క్షమించేసి

ఆప్యాయంగా నవ్వుతుంది

నెర్రెలువారిన

గోడ ముఖంతో

రేకుల ఇల్లు

చిన్నబోయి తలొంచుకున్నట్లు కనిపిస్తుంది కొందరికది

కానీ

తలెత్తుకుని జీవించే సగర్వపు మనుషుల రక్షణకవచమది

రాజేశ్వరరావు లేదాళ్ళ

Related posts

శ్రమశక్తే నిజమైన ధీశక్తి

Satyam NEWS

ధీరుడితడు

Satyam NEWS

వయ్యారి నెరజాన

Satyam NEWS

Leave a Comment