28.7 C
Hyderabad
April 27, 2024 03: 51 AM
Slider ముఖ్యంశాలు

లింగ నిర్ధారణ పరీక్షలు నేరం, అతిక్రమిస్తే కఠిన చర్యలు

#sexdeterminationtest

గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు చట్ట విరుద్ధమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమోదైన కేంద్రాలు మాత్రమే వైద్యపరంగా అత్యవసర సమయాల్లో మాత్రమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

రిజిస్టర్‌ కాని కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తే 1994 ప్రకారం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే మొదటిసారి మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.10 వేల వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుందన్నారు. రెండోసారి ఇదే తప్పు కొనసాగితే ఎక్కువ శిక్ష ఉంటుందని తెలిపారు. బాలికల జనాభా తగ్గరాదనే ఉద్దేశంతో ఈ చట్టం చేయడమైందని చెప్పారు.

ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్తల వద్ద గర్భిణుల వివరాలు ఉండాలని తద్వారా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. కుటుంబ, సమాజ పరిస్థితుల రీత్యా కొన్ని ప్రాంతాల్లో బాలిక భారం అనే భావంతో ఉండే అవకాశం ఉండవచ్చని, ప్రభుత్వం కల్పించే సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. స్కానింగ్‌ కేంద్రాల్లో పనిచేసే ప్రతిఒక్కరూ విశ్వసనీయత కలిగి ఉండాలన్నారు.

అన్ని స్కానింగ్‌ కేంద్రాలను ఎప్పటికప్పుడు విధిగా తనిఖీ చేయాలని కలెక్టర్‌ వైద్యశాఖ ను ఆదేశించారు. ప్రోగ్రాం అధికారులకు ఇచ్చిన లక్ష్యాల మేరకు విధిగా తనిఖీలు చేయాలన్నారు. నెలవారీ నివేదికను నిర్దేశించిన సమయంలో సమర్పించాలని చెప్పారు.

నివేదికలు సమర్పించని కేంద్రాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. పురుష, మహిళా నిష్పత్తి ప్రమాదకర భవిష్యత్‌ను సూచిస్తున్నాయన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు.

లింగపరంగా అసమతుల్య స్థితి ఉంటే సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని అన్నారు. వైద్య కేంద్రాలు సమాజంలో మంచి మార్పు కోసం పారదర్శకంగా, బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఆస్పత్రిలోనే లింగ నిర్ధారణపై అవగాహన ప్రారంభం కావాలని సూచించారు.

జిల్లాలో 52 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో  6 సంవత్సరాల వయసు ఆడ మగ నిష్పత్తి ప్రకారం 59,539 మంది మగపిల్లలు,54,446 మంది ఆడపిల్లలు ఉన్నారని 914% ఉందన్నారు. బల్మూర్, లింగాల, కోడేర్, తిమ్మాజిపేట మండలాల్లో ఆడ మగ పిల్లల నిష్పత్తి అత్యల్పంగా ఉందన్నారు.

కల్వకుర్తి, తాడూరు, ఉప్పునుంతల, ఉరుకొండ మండలాల్లో నిష్పత్తి స్థాయి ఆశాజనకంగా ఉందన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్, ప్రోగ్రామ్ ఆఫీసర్ భరత్ రెడ్డి, డాక్టర్ ప్రేమ, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం డి.ఎస్.పి మోహన్ రెడ్డి, అదనపు డి ఎం హెచ్ ఓ వెంకటదాసు, డాక్టర్ రమేష్, జిల్లా సంక్షేమ అధికారి ని వెంకటలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

గంజాయి నిర్మూలనపై పోలీసుల ఉక్కు పాదం

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో విద్యాసంస్థలు, థియేటర్లు మూసివేత

Satyam NEWS

భద్రాచలం ఉద్యమకారుడి సైకిల్ యాత్ర

Murali Krishna

Leave a Comment