ఇంకా ఖరారు కాలేదు కానీ తన చిరకాల ప్రత్యర్థి అయిన శివసేనను మట్టుపెట్టేందుకు మరాఠా యోధుడు శరద్ పవార్ రచించిన కుట్ర కారణంగానే మహారాష్ట్ర లో అనూహ్య రాజకీయ పరిణామాలు సంభవించాయని అంటున్నారు. ఎన్ సి పి, కాంగ్రెస్, శివసేన మధ్య రాజకీయ ఒప్పందం కుదిరిందని, రాబోయే ఐదేళ్ల కాలానికి శివసేన అధినేత ఉద్దావ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉంటారని శరద్ పవర్ బహిరంగంగా ప్రకటించిన ఆరు గంటలలో ఈ అనూహ్య రాజకీయ మార్పులు జరిగాయి.
శరద్ పవర్ పార్టీ ఎన్ సి పి మహారాష్ట్రలో బతికి బట్టకట్టాలంటే శివసేన రాజకీయంగా బలపడకూడదు. అందుకు అనుగుణంగా శరద్ పవర్ కు అవకాశం చేజేతులా శివసేనే ఇచ్చింది. రాజకీయంగా అంతగా వ్యూహాలు రచించలేని ఉద్ధావ్ థాకరే వెళ్లి వెళ్లి శరద్ పవర్ చేతిలో చిక్కుకున్నారు. శరద్ పవర్ చెప్పిన కారణంగానే కాంగ్రెస్ పార్టీ తన మద్దతును ప్రకటించడంలో వ్యూహాత్మక జాప్యం చేసింది. మహారాష్ట్రంలో అధికారం పంచుకునే స్థాయికి రావడం కాంగ్రెస్ పార్టీ ఊహించని వ్యవహారం.
దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోతున్న తరుణంలో మహారాష్ట్రంలో అధికారం పంచుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కాదనుకోవడం వెనక శరద్ పవర్ వ్యూహం ఉంది. కాంగ్రెస్ పార్టీతో తాను మంతనాలు జరుపుతున్నట్లు శరద్ పవార్ చెబుతూ వచ్చారు. చివరకు తన మాటపై కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందనే విషయాన్ని బహిర్గతం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా శివసేనతో తాము కలవడం ఇష్టం లేదని అయితే శరద్ పవర్ వత్తిడి కారణంగా తాము వ్యూహాత్మక మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. ఈ విధమైన రాజకీయాలు జరుగుతుండగానే శరద్ పవార్ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు.
అంతకు ముందు రోజు నరేంద్ర మోడీ పార్లమెంటులో ఎన్ సి పి క్రమశిక్షణ గల పార్టీ అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు. ఇన్ని జరుగుతున్నా కూడా శివసేన ముంబయి దాటి బయట ప్రపంచంలో ఏమౌతున్నదో ఆలోచించలేకపోయింది. ఇది శరద్ పవర్ కు కలిసి వచ్చిన అంశం. ఈ రాజకీయాన్ని ఏ మాత్రం అనుభవం ఉన్నా కూడా శివసేన ముందుగానే పసిగట్టి ఉండాల్సింది. ఎన్ సి పి లో చీలిక వచ్చిందనే వార్తలు కూడా ఉదయం నుంచి గుప్పు మంటున్నాయి. అయితే ప్రాధమిక సమాచారం బట్టి అలాంటిదేం లేదనే విషయం స్పష్టం అవుతున్నది. ఎన్ సిపిలో శరద్ పవర్ కు తెలియకుండా వ్యవహారాలు జరిగే అవకాశమే లేదు. ఎన్ సి పి చీలిపోవడం, బిజెపి అధికారంలో కొనసాగడం ఈ రెండు జరగాలంటే దాదాపు 38 మంది ఎం ఎల్ ఏల మద్దతు అవసరం. అంత మంది శరద్ పవర్ అనుమతి లేకుండా అజిత్ వెంట వెళ్లే అవకాశం లేదు. అందుకోసమే ఇది కచ్చితంగా శరద్ పవర్ శివసేన పట్ల చేసిన కుట్రగానే అభివర్ణించవచ్చు.