26.7 C
Hyderabad
April 27, 2024 07: 07 AM
Slider ప్రత్యేకం

మన దేశానికి దేవుడు ఇచ్చిన సేవకుడు

#SonuSood

అతడు వృత్తిరీత్యా సినీనటుడు… ప్రవృత్తి పరంగా సమాజసేవకుడు… ఈ పంజాబీ యువకుడు కరోనా కష్టకాలంలో అష్టకష్టాలు పడుతున్న అనేక మందికి సహాయపడుతున్న మనసున్న మంచి మనిషి.

సంక్లిష్ట పరిస్థితులలో ప్రజలను ఆదుకోవాల్సిన  ప్రజా ప్రభుత్వాలు అచేతనమైతే తానున్నానని  ముందుకువచ్చి ఇప్పటికీ తన సహృదయతను చాటుకుంటున్న మహోన్నత వ్యక్తి. అతనే… బహుభాషా నటుడు సోనూ సూద్. కరోనా విజృంభణ నేపథ్యంలో రోడ్డునపడ్డ వేలాది వలస కార్మికులు సొంత ఊళ్ళకు వెళ్ళడానికి సొంత ఖర్చుతో రైలు, బస్సు రవాణా వసతి చేకూర్చిన ఉపకారి.

కరోనా విలయానికి బతుకులు ఛిద్రమైన వారికి ఆపన్నహస్తం అందిస్తూ ప్రజల మన్నన పొందుతున్న మనవతామూర్తి సోనూ సూద్. సినీరంగంలో ఉన్న ఎంతోమంది పెద్దలకు ఆదర్శంగా నిలిచాడు.

అమితాబ్, అక్షయ్ కుమార్ లు కూడా…

బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ , అక్షయ్ కుమార్ వంటి ఇతర ప్రముఖులు కూడా సామాజిక బాధ్యతను స్వీకరించడానికి ముందుకురావడానికి ఒక విధంగా సోనూ సూద్ చూపిస్తున్న ఔదార్యమని పరిశీలకుల భావన.

 అర్ధించిన వారికి లేదనకుండా సాయం చేస్తున్న గొప్ప దాతగా లోకం ప్రశంసిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కన్న కూతుళ్ళతో కలిసి పోలం దున్నుతున్న ఒక వ్యక్తికి ట్రాక్టర్ పంపించడం, మహారాష్ట్ర లోని మారుమూల కొండప్రాంతంలో ఎంబిబిఎస్ పరీక్షలు రాస్తున్న విద్యార్థినికి వైఫై సౌకర్యం కల్పించడం వంటి ఉదాహరణలు ఎన్నో మాథ్యమాల ద్వారా వెలుగుచూస్తున్నాయి.

ఢిల్లీ దగ్గర నోయిడాలో సుమారు 20 వేల మందికి ఆశ్రయం కల్పించడం, ప్రవాసీ రోజ్ గార్ కార్యక్రమం ద్వారా వేలాది యువతకు ఉపాథి కల్పించడం వంటి అసాధారణ విషయాలు సోనూ సూద్ విశాలహృదయానికి మెచ్చుతునకలు. సాయం అందించాలని దేశం నలుమూలనుంచి సుమారు 31 వేల అభ్యర్థనలు సోనూ సూద్ వ్యక్తిగత సోషల్ మీడియాకు  అందినట్లు సమాచారం.

వీలయినంత మందికి మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఆయన ప్రజల దృష్టిలో నిజమైన “హీరో” గా కీర్తి సంపాదించుకోవడం విశేషం.

సాలూరు సమీపంలో కొండప్రాతంలో నివసిస్తున్న ఆదివాసులు శ్రమదానంతో 4 కి.మీ. మేర రోడ్డు నిర్మించుకున్న అంశంపై కూడా  స్పందించి, త్వరలో వారిని కలుస్తానని చెప్పడం ఆయనకున్న సామాజిక స్పృహను తెలుపుతోంది.

 తాజాగా తన తల్లి దివంగత ప్రొ. సరోజ్ సూద్ పేరుతో స్కాలర్ షిప్ ప్రకటించి, అర్హులైన యువతకు ఆర్థిక సాయం, వసతి, పౌష్టికాహారం అందించాలని కార్యప్రణాళిక ప్రకటించారు. కుల, మత, ప్రాంత,వర్గ భేదా లకతీతంగా చదువులో ప్రతిభచూపించేవారిని ప్రోత్సాహించాలనే సదాశయంతో స్కాలర్ షిప్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

తన తల్లి ఆశయసాధన కోసం చేయవలసింది ఇంకా ఉందని వినయంగా చెప్పడం సోనూ సూద్ సంస్కారానికి అద్దం పడుతోంది. సాధ్యమైనంత మేరకు అసహాయులకు సాయం చెయ్యడమే తన లక్ష్యమంటున్న ఈ ‘ రియల్ హీరో ‘ మరికొంతమంది నటీనటులకు ఆదర్శంకావాలని సినీరంగ విశ్లేషకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

డ్రగ్స్ కలకలం మొత్తం సినీరంగాన్ని కుదిపేస్తున్న సమయంలో సోనూసూద్ తనదైన విలక్షణ వ్యక్తిత్వంతో ఊహించనంత ఎత్తులో ఉన్నాడు. ” ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న ” అనే విజ్ఞులమాటను సినిమాలలో విలన్ పాత్రధారి,నటుడు  సోనూసూద్ ఆచరించి చూపుతున్న తీరు బహుధా ప్రశంసనీయం.

పొలమరశెట్టి కృష్ణారావు

Related posts

దేశంలో యెల్లో ఫంగస్ :ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లో గుర్తింపు

Satyam NEWS

జగన్ చేసిన మరో మోసం బట్టబయలు

Satyam NEWS

గుడ్ వర్క్: టీఎన్జీవో సంఘాల ప్రతినిధుల రక్తదానం

Satyam NEWS

Leave a Comment