శ్రీవారి ఆలయానికి జనవరి 6 వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. ఈ క్రమంలో టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదివారం సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ గజరావు భూపాల్ తో కలిసి క్యూలైన్లను పరిశీలించారు.
ఏటీసీ కార్ పార్కింగ్, నారాయణగిరి ఉద్యానవనాలు, కళ్యాణ వేదిక నుండి శ్రీవారి సేవా సదనం భవనాల వరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూలైన్లను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందేలా చూడాలని, క్యూలైన్లకు అనుబంధంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
భక్తుల భద్రత, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సివిఎస్వో, అర్బన్ ఎస్పీతో చర్చించారు. అదనపు ఈఓ వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ రామచంద్రారెడ్డి, ఎస్ఇ-2 నాగేశ్వరరావు, విఎస్వోలు మనోహర్, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.