29.7 C
Hyderabad
April 29, 2024 10: 20 AM
Slider ప్రత్యేకం

నీటి వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం

#katragadda prasuna

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కృష్ణాజలాల పంపిణీ విషయంలో, ఈ జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్టులు అక్రమమంటూ రెండు రాష్ట్రాలు రచ్చకెక్కాయి. రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిపోయి వీటికి రాజకీయ రంగు పులిమి ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.

కృష్ణా జలాలను బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811టీఎంసీలు, కర్ణాటకకు 734టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీల నీటిని కేటాయించింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ కృష్ణా జలాలను మొత్తం 2130 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పంచితే, బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ 65శాతం నీటి లభ్యత ఆధారంగా 2,578 టీఎంసీల నీటిని పంచింది. 2010 సం॥లో వెలువడిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. 118 సంవత్సరాల నీటి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరిగితే.. మిగులు జలాలే ఉండవన్న ఆంధ్రా అభ్యర్థనను తోసిపుచ్చి 47సంవత్సరాల సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకొని సగటు నీటి లభ్యత 2578 టీఎంసీలను పంచడంతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. ఎక్కువ నీటి లభ్యతను అంచనా వేయటంతో బచావత్‌ పంపిణీ చేసినదానికి అదనంగా కర్నాటకకు 177టీఎంసీలు, మహారాష్ట్రకు 81టీఎంసీలు, ఆంధ్రాకు 190టీఎంసీలు కేటాయించింది. దీని వలన ఎగువ రాష్ట్రాలు ఎక్కువ నీటిని నిల్వచేసుకోవటం వల్ల దిగువ రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయి.

ఒప్పందం ప్రకారమే జరుగుతున్న నీటిపంపకం

బచావత్‌ కేటాయింపుల్లో ఆంధ్రాకు 512టీఎంసీలు, తెలంగాణకు 299టీఎంసీలు జలాలు ఉన్నాయి. మిగులు జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులను పునర్‌విభజన చట్టంలోని 11వ షెడ్యూల్‌లో చేర్చి పూర్తి చేయాలని కేంద్రం పేర్కొంది. పైన పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల మధ్య ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జలవనరులశాఖ మంత్రిత్వ కార్యాలయంలో జూన్‌,2, 2015లో 15 అంశాలపై ఒప్పందం కుదిరింది. దీనిలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొని ఆంధ్రాకు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల వాటాతో ఒప్పందం చేసుకున్నారు. గత 7 సంవత్సరాలుగా ఇదేవిధంగా నీటి పంపిణీ జరుగుతోంది.

ఈ ఒప్పందం ప్రకారం కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ కృష్ణా యాజమాన్య పరిధి బోర్డులోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల నీటి విడుదల ప్రోటోకాల్‌ కూడా బోర్డు పరిధిలోకి వస్తుంది. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు కృష్ణా బోర్డు మెంబర్‌ సెక్రటరీ అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఎస్‌ఈలతో వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చెయ్యాలి. ఈ విధంగా ఒప్పందం చేసుకొని దానికి విరుద్ధంగా బోర్డు అనుమతి లేకుండా విద్యుత్‌ ఉత్పత్తి కోసం తెలంగాణ ఏకపక్షంగా నీటిని విడుదల చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ విమర్శిస్తోంది.

పోతిరెడ్డిపాడుకు వచ్చిన కష్టాలు

ప్రాజెక్టులు నిండకముందే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నింటి నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని తెలంగాణ చేపట్టటంతో ఈ నీరు అంతా ప్రకాశం బ్యారేజీలోకి వెళ్లి అక్కడి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లిపోతున్నాయని ఆంధ్రా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శ్రీశైలంలో 854 అడుగులకు పైగా ఉంటే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించటానికి ఆంధ్రాకు వీలుపడదు.

ప్రస్తుతం తెలంగాణ వచ్చిన నీటిని వచ్చినట్లుగా విద్యుత్‌ ఉత్పత్తి చేసి కిందకి వదిలివేయటంతో పోతిరెడ్డిపాడుకు నీరు తరలించటానికి ఆంధ్రాకు వీలు కావటం లేదు. పోతిరెడ్డిపాడును 40 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు పెంచి సంగమేశ్వర ప్రాజెక్టుకు  అక్రమంగా తరలించటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ పేర్కొంటోంది. ఈ విధంగా మీది అక్రమమంటే మీది అక్రమమని రెండు రాష్ట్రాలు ప్రతిరోజూ తీవ్రంగా విమర్శిస్తూ రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా వేడిని పెంచుతున్నాయి. సంగమేశ్వరం ప్రాజెక్టు అక్రమమని తెలంగాణకు చెందిన రైతు నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో ఫిర్యాదు చేయగా, తెలంగాణ అక్రమంగా విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని విడుదల చేయటం కోసం ఇచ్చిన జీవో 34ను వ్యతిరేకిస్తూ, ఆంధ్రాకి చెందిన రైతులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

భేషజాలూ బేసిన్లూ లేవని చెప్పుకున్నారుగా….

గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌లు హైదరాబాద్‌లో సమావేశమై ఇరు రాష్ట్రాలు స్నేహపూర్వకంగా పనిచేస్తాయని ప్రకటించారు. ‘‘ భేషజాలు లేవు, బేసిన్‌ల గొడవ లేదు, అపోహలు లేవు, వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్లు ఇవ్వలేం. కేసీఆర్‌, జగన్‌ వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజల కోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత.

రెండు రాష్ట్రాలూ కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఏపీ సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలు మావారే అన్న భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వీరిద్దరూ మరోముందడుగు వేసి గోదావరిపై బ్యారేజీ నిర్మించి ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్లి నాగార్జునసాగర్‌లో పోసి ఇరు రాష్ట్రాలు సస్యశ్యామలం చేస్తామని అట్టహాసంగా ప్రకటించారు.

గోదావరి మళ్లింపు ఏమైందో ఎవరికీ తెలీదు..

ఈ విషయంపై ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు పలు ధపాలు భేటీలు నిర్వహించి లక్షన్నర కోట్లతో గోదావరిపై రాంపూర్‌ వద్ద దిగువన బ్యారేజీ నిర్మించి రోజుకు 2 నుంచి 3 టీఎంసీల చొప్పున నీటిని నాగార్జునసాగర్‌కు తరలిస్తామని అందుకు సంబంధించిన ప్రాజెక్టు డిజైన్‌ను కూడా రెండేళ్ల క్రితం విడుదల చేసి రంగుల సినిమా చూపించారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టు ఎటుపోయిందో ఎవరికీ తెలియదు.

ఇదేగాక, రాష్ట్ర విభజన నాటి నుంచి ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, ఉద్యోగుల పంపిణీ వంటి అనేక విషయాలు పెండిరగ్‌లో  ఉన్నాయి.  ఇంకా తెలంగాణ డిస్కమ్‌లు ఆంధ్రాకు రూ.5700కోట్లు బకాయిలు పడ్డాయి. కనుక ఈ విషయాలన్నీ తేలేదాక హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ఆస్తులు తెలంగాణకు అప్పగించేదిలేదని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తెలిపారు. కానీ ముఖ్యమంత్రి జగన్‌ పెండిరగ్‌ విషయాలేవీ తేలకముందే సెక్రటేరియట్‌ భవనాలు, అసెంబ్లీ భవనాలు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు కేసీఆర్‌కు రాసిచ్చారు. విద్యుత్‌ బకాయిలకు నీళ్లు వదిలారు. అవన్నీ చేజిక్కించుకొని కేసీఆర్‌ ఇప్పుడు నీళ్ల పేచీకి దిగారు.

ఇరు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధుల కొరత తీవ్రంగా ఉంది. ఆంధ్రా పోతిరెడ్డిపాడు ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని, దీనిని అడ్డుకోవడం కోసం తెలంగాణ సైతం జోగులాంబ ప్రాజెక్టును కడతామని చెబుతున్నది. కానీ, ఇప్పటికే కృష్ణాపై అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌సాగర్‌ పనులు పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు నీరందుతుందని రైతులు పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కాళేశ్వరంపైనే ప్రభుత్వానికి శ్రద్ధ

ఉన్న నిధులు మొత్తం ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే కేటాయించటం వల్ల మిగిలిన ప్రాజెక్టులు పూర్తి కావటం లేదు. తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో 33 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటిపై  కేవలం 41వేల కోట్లు ఖర్చు చేస్తే అవన్నీ పూర్తయ్యేవి. ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించకుండా ఒక్క కాళేశ్వరానికి దాదాపు 80వేల కోట్లు ఖర్చు చేశారు. దీని కారణంగా కృష్ణాపై ప్రాజెక్టులు పెండింగ్‌లో పడిపోయాయి.

ఆ ప్రాజెక్టులు పూర్తయ్యి ఉంటే కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రాజెక్టుల కోసం రూ.1.17లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఇందులో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు కేవలం రూ.30వేల కోట్లలోపే ఖర్చు చేశారు. కృష్ణాపై కొత్తగా 35`45 టీఎంసీలతో  కృష్ణా, తుంగభద్ర నదుల సంగమానికి ఎగువన వెలటూరు గ్రామం వద్ద జోగులాంబ ప్రాజెక్టును నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, ప్రస్తుతం తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10,660కోట్లు బిల్లులు చెల్లించాల్సి ఉంది.

ఈ బిల్లులు చెల్లించటానికే డబ్బులు లేనప్పుడు కొత్త ప్రాజెక్టు కట్టడానికి నిధులు ఎక్కడినుంచి వస్తాయనేదానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టును ఏడాదిలోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప్రాజెక్టును ఈ సంవత్సరం పూర్తి చేయాలంటే రూ.30వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. కానీ బడ్జెట్‌లో రూ.960కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించింది.

దీనిని బట్టి ఈ ప్రాజెక్టు ఎన్ని సంవత్సరాలకు పూర్తవుతుందో తెలియదు. తెలంగాణ ఏర్పడిన తరువాత పూర్తిగా అప్పులపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి నీటి పారుదల ప్రాజెక్టులపై ఖర్చు పెడుతున్నది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు కార్పొరేషన్‌ల ద్వారా రూ.1.19లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. ఇందులో రూ.53,789 కోట్లు ఖర్చు చేశారు.

రోడ్డెక్కి కొట్లాడుకుంటే ఎలా….?

రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి సమస్యలను పరిష్కరించుకోకుండా ఈ విధంగా రోడ్డెక్కి కొట్టుకోవటంతో తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆల్మట్టి ఎత్తు పెంచుకోవటానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ అనుమతించింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును కేంద్రం నోటిఫై చేయకముందే కర్నాటక ఆల్మట్టి నుంచి అదనంగా 130టీఎంసీల నీటి వినియోగానికి ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా 14.95లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను గత ఫిబ్రవరిలో కేంద్రానికి పంపింది.

దీనిలో ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్ల ఎత్తు పెంచటానికి ప్రణాళిక రచించింది. ఇదేగాక, తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ సామర్థ్యం తగ్గిందని చెబుతూ, దానిని పూడ్చుకొనేందుకు 31.5టీఎంసీల సామర్థ్యంతో నవాలి వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలని కర్నాటక నిర్ణయించింది. దానిపై ఇంకో మూడు రిజర్వాయర్లను నిర్మించి మొత్తం 52 టీఎంసీల వినియోగానికి ప్రతిపాదించింది.

ఇవి పూర్తయితే తెలంగాణలో ఆర్డీఎస్‌ ఆయకట్టు 87,500 ఎకరాలు ప్రమాదంలో పడతాయి. ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌ఎల్‌సీ, కేసీ కెనాల్‌ కింద తీవ్రంగా నీటి కొరత ఏర్పడుతుంది. ఇవేగాక, శ్రీశైలం, సాగర్‌కు ప్రవాహాలు పూర్తిగా తగ్గిపోతాయి. కనుక రెండు తెలుగు రాష్ట్రాలు తమ మధ్య విభేదాలు మాని కర్నాటక అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై ముందు పోరాటం చేయాలి. లేకపోతే పై నుంచి నీటి ప్రవాహాలు ఆగిపోతే వీరిరువురూ పోరాడుకొని ప్రయోజనం ఏముంటుంది?

ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక ప్రాజెక్టులు నిండిన తరువాత ఆగస్టులో కానీ మనకు జలాలు రావటం లేదు. ఈ లోపల వానాకాలం పంటలు ప్రమాదంలో పడుతున్నాయి. కనుక రెండు రాష్ట్రాలు ముందు ఈ విషయంపై దృష్టి సారించాలి. రాష్ట్రాల పేర్లు వేరైనా రెండు చోట్లా ఉన్నది రైతులే. వారి సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. అంతేతప్ప మీ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను బలిచేయొద్దు.

సాక్షి పత్రిక ద్వంద్వ వైఖరి

రెండు రాష్ట్రాల నీటి వివాదం రేగిన నేపథ్యంలో కేసీఆర్‌ స్పందిస్తూ ‘‘ ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతున్న కృష్ణా జలాల పంపిణీ సరికాదని ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాలి’’ అని కోరారు. దీనిపై జగన్‌కు చెందిన సాక్షి పత్రికలో అర్థభాగం అసంబద్ధం అంటూ తాటికాయంత అక్షరాలతో మొదటి పేజీలో ఆంధ్రా ఎడిషన్‌లో వార్తలు ప్రచురించారు.

ఈ విషయాన్ని చెప్పింది తెలంగాణ ముఖ్యమంత్రి. దీని వ్యతిరేకిస్తూ మీరు వార్త రాసింది ఆంధ్రాలో. తెలంగాణ ముఖ్యమంత్రికి మీరు నిరసన తెలపాలనుకున్నప్పుడు తెలంగాణలో ఈ వార్త రాయకుండా ఆంధ్రా ఎడిషన్‌లో రాశారంటే దాని అర్థం ఏమిటి? ఆంధ్రా ప్రజలను మభ్యపెట్టడానికి తప్ప మరెందుకు పనికివస్తుంది? తెలంగాణలో ఈ వార్త రాస్తే మీ ఇద్దరి స్నేహం ఎక్కడ చెడుతుందోననే భయమా?

ఇదేగాక జగన్‌, వైఎస్‌ ఇద్దరూ నరరూప రాక్షసులు, దుర్మార్గులు, తెలంగాణ నీటిని అక్రమంగా తరలిస్తున్నారని తెలంగాణ మంత్రులు ఎంత తిట్టినా జగన్‌ కానీ, వారి మంత్రులు కానీ కనీసం స్పందించటం లేదు. అదే ఆంధ్రాలో ప్రతిపక్షంపై ఇష్టానుసారంగా నోటికివచ్చిన తిట్లన్ని తిడుతూ తోడేళ్ల మాదిరిగా విరుచుకుపడుతుంటారు. ఆంధ్రా ప్రజల హక్కులను కాపాడటంలో ఈ మీ ప్రతాపం ఎక్కడికి పోయింది? పక్క రాష్ట్రానికి చెందిన నాయకులపై మీ పౌరుషాన్ని ఎందుకు చూపించటం లేదు. తెలంగాణలో మీకు ఉన్న ఆస్తులను కాపాడుకోవటానికి కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారా? లేక గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ పార్టీ గెలవటానికి కేసీఆర్‌ పూర్తి సహాయ సహకారాలు అందించారు, కనుక నోరెత్తటానికి జంకుతున్నారా? అని ప్రజలు సందేహపడుతున్నారు.

ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులూ ఆడుతున్న నాటకం

తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి ఆప్త మిత్రులైన జగన్‌, కేసీఆర్‌లు ఆడుతున్న నీళ్ల నాటకమిది. నీళ్లు అక్రమంగా తరలిస్తుంటే దానిని చట్టప్రకారం అడ్డుకోవాలే గానీ పోలీసుల బలప్రయోగంతో అడ్డుకోవాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం. ఇదేమైనా చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు యుద్ధమా? జల వివాదాలను పోలీసులను ఉపయోగించి బలప్రయోగం ద్వారా పరిష్కరించుకోవాలని ఏ చట్టంలో ఉందో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలి. పోలీసులను ఉపయోగించటానికి నీటి వివాదం శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యా..? ప్రభుత్వాలే ఈవిధంగా చట్టవిరుద్ధమైన పనులు చేయవచ్చా?

కృష్ణా ట్రిబ్యునల్‌, కేంద్ర ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టులను ఆశ్రయించి ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ప్రకారం ఎవరికి కేటాయించిన నీటిని వారు వాడుకుంటే సరిపోతుంది. లేదా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై సమస్యకు పరిష్కారం కనుగొనాలి.

అంతేగానీ బలప్రయోగంతో ఉద్రిక్తతలు మరింత పెరగటమే తప్ప సమస్యకు పరిష్కారం ఏవిధంగా దొరుకుతుంది. ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టుల వద్ద మోహరించిన పోలీసు బలగాలను తక్షణం  ఉపసంహరించి, జల వివాదాన్ని కృష్ణా ట్రిబ్యునల్‌కు అప్పగించి వారిచ్చిన తీర్పును అమలు చేయాలి. మంత్రులు బాధ్యతారాహిత్యంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం మానుకోవాలి. విడిపోయి కలిసుందామని రాష్ట్ర విభజన సందర్భంగా చెప్పిన మాటలకు నాయకులు కట్టుబడి ఉండాలి.

కాట్రగడ్డ ప్రసూన, మాజీ ఎమ్మెల్యే, ఉపాధ్యక్షురాలు, టీడీపీ టీఎస్‌

Related posts

రికార్డు బ్రేక్ : ఒక్కయూపీలోనే 50వేల ముస్లింయేతర వలసదారులు

Satyam NEWS

దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

Satyam NEWS

అభివృద్ధి కోసం గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ వరకు పోరాడతాం

Satyam NEWS

Leave a Comment