40.2 C
Hyderabad
April 26, 2024 14: 31 PM
Slider ప్రత్యేకం

నవ నవోన్మేష ప్రతిభా స్వరూపం నందమూరి

#ntramarao

నేడు ఎన్టీఆర్ శతజయంతి. ఈ సందర్భంలో, మహాకవి శ్రీశ్రీ మాటలు గుర్తుకొస్తున్నాయి. “ఈ శతాబ్దం నాది’’ అన్నాడు ఆ మహాకవి. కేవలం ఒక శతాబ్దం కాదు,శతాధిక శకాలు శ్రీశ్రీ మిగిలే ఉంటాడు. అట్లే,ఎన్టీఆర్ కూడా. కాలాతీత వ్యక్తుల కోవలో మిగిలిపోయే తెలుగు మహనీయుల్లో ఎన్టీఆర్ తప్పకుండా నిలుస్తారు. తన భక్తిరచనలు తనవి కాన, అని ‘కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ చెప్పినట్లుగా,నేడు ప్రపంచమంతా ఎన్టీఆర్ పై వివిధ రూపాల్లో ఎవరికివారు తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. పుస్తకాలు,వ్యాసాల రూపంలో అక్షరార్చన కూడా చేస్తున్నారు.

నటుడుగా,నిర్మాతగా, దర్శకుడుగా,పరిపాలకుడుగా ఎన్టీఆర్ స్థానం ప్రత్యేకమైంది, విశిష్టమైంది,విలక్షణమైంది. చిత్రజగతిలోనూ, చిత్రవిచిత్రమైన రాజకీయ రణస్థలిలోనూ రాణకెక్కిన రాణ్మౌళి,చారిత్రక పురుషుడు నందమూరి తారకరామారావు. పౌరుషత్వం కలిగిన పురుషుడుగా సినిమా – రాజకీయం ఇరుపక్కలా తన మగటిమను చూపించాడు. సరస సమ్మోహన రూపం,నవ నవోన్మేష ప్రతిభా  స్వరూపం నందమూరి తారకరామ నామధేయం. ఆయన జీవితం సమున్నత ధ్యేయానికి  కట్టుబడిన అధ్యాయం.

నటుడు,నిర్మాత,  దర్శకుడు,నాయకుడు, ప్రతినాయకుడు, ప్రతిపక్షనాయకుడు, మహానాయకుడు, చిత్రకారుడు కూడా. చిత్రజీవితంలోనే కాదు, నిజజీవితంలోనూ అన్ని పాత్రలు పోషించి,శాసించి,భాసించినవారు ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ లేరు. సామాన్యుడిగా మొదలైనా, అసామాన్యుడిగా నిలిచి,గెలిచిన నందమూరి తారకరామారావు జన్మదినం మే 28 తెలుగువారికి పండుగరోజు. ఆకర్షణకు మరోపేరు అన్నగారు. స్ఫురద్రూపం, స్ఫుట వాచకం ఆయన ప్రత్యేకం.

ప్రతి అక్షరం,ప్రతి అచ్చు అచ్చంగా  పలుకుతాయి. ఆ కంచుకంఠంలో స్వరవిన్యాసం,నటవిన్యాసం ఏకకాలంలో  ప్రస్ఫుటంగా ప్రకటితమవుతాయి. ప్రతి రసం సంపూర్ణంగా సహజంగా చిలుకుతుంది. ఎన్టీఆర్ ధరించే ఆభరణాలు కూడా ధ్వనిస్తూ, నటిస్తాయి. భారత చలన చిత్ర జగతిలోనే ఇది అపూర్వం, అసంభవం. నటన ఒక ఎత్తు. నడక మరో ఎత్తు. బృహన్నలగా,అర్జునుడుగా, సుయోధనుడుగా (దుర్యోధనుడు అనే మాట ఎన్టీఆర్ కు పెద్దగా ఇష్టం ఉండదని చెబుతారు),

శ్రీరాముడుగా, రావణుడుగా,శ్రీకృష్ణుడుగా ఆన్నీ ఆయనే. అప్పటి వరకూ బృహన్నలగా ఉండి,అర్జునుడిగా మారిన వెనువెంటనే వాచక  రూపక స్వరూపాలు చకచకా మారిపోతాయి. ఈ వైనం నందమూరికే సాధ్యం. శ్రీకృష్ణుడి వాచకం పరమ సాత్వికం, సుయోధనుడిది ధీర వీర గంభీరం. ఈ రెండు పాత్రలనూ ఒక్కడే పోషించడం,పండించడం, అమ్మకచెల్ల! అన్నకే చెల్లు.

నడి వయస్సులో ముదుసలి బడిపంతులు పాత్ర పోషించడం ఎంత సాహసమో? కోడె వయస్సులో ముదిమి భీష్మ పాత్ర వెయ్యడం అంతకు మించిన సాహసం! పౌరాణిక పాత్రలకోసమే ఈయన పుట్టాడో,లేక,ఆ పౌరాణిక పాత్రలే ఈయనగా పుట్టాయో?  పుట్టించునోడికే ఎరుక! దాదాపు ఐదు దశాబ్దాలపాటు తెలుగుసినిమా సామ్రాజ్యానికి సార్వభౌముడుగా వెలిగాడు.

సాంఘిక,చారిత్రక,పౌరాణిక, జానపద పాత్రల్లో జీవించి,తరించాడు. కరిగిపోని,తరిగిపోని రసానుభూతుల్ని కోట్లాది మందికి పంచాడు.’మనదేశం’ సినిమాతో మొదలైన మహానటప్రస్థానం  ‘మేజర్ చంద్రకాంత్’ వరకూ  జగజ్జేగీయమానంగా సాగింది. జీవనసంధ్యలో, తన ఆరాధ్య శ్రీనాథ కవిసార్వభౌమ పాత్ర కూడా పోషించి, నిర్మించి, ఋషిఋణం, కవిఋణం తీర్చుకున్నాడు. నిడుమోలులో ఓనమాలు నేర్పిన తొలి గురువు వల్లూరి సుబ్బారావు, విజయవాడలో నటప్రస్థానానికి తొలితిలకం దిద్దిన కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణల శిష్యరత్నంగా తెలుగు భాషాభిమానాన్ని, తెలుగు ఆత్మగౌరవాన్ని నరనరాన  చాటుకున్న నగధీరుడు నందమూరి.

నటవిరాట్ స్వరూపంగా సకల సౌభాగ్య  సంపదలన్నీ అందుకున్నాడు. కోట్లాదిమంది ప్రజల నుంచి పొందిన అభిమాన ధనానికి ప్రతిగా ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. సగటు మనిషి కోసం  నిలవాలని నిశ్చయించుకున్నాడు. ప్రతిపౌరుని ఋణం తీర్చుకోవాలని సంకల్పం చేసుకొన్నాడు. తెలుగుప్రజ కోసం ‘తెలుగుదేశం’ పార్టీ స్థాపించాడు.

స్థాపించిన తొమ్మిది నెలల్లోనే జయకేతనం ఎగురవేశాడు. ఢిల్లీపీఠాలను గజగజ వణికించాడు. తెలుగు ప్రజల్లో రాజకీయ చైతన్యం నింపాడు. యువతను,విద్యావంతులను, ఆడపడుచులను, వెనుకబడిన వర్గాలను నాయకులుగా, మంత్రులుగా మలిచాడు. రాజకీయ యవనికలోనూ మహానాయకుడిగా నిలిచాడు. తెలుగువాడి ఆత్మగౌరవ బావుటాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించాడు. పేదల కోసం,మహిళల కోసం అహరహం తపించాడు.

‘భారతదేశం’ పేరుతో పార్టీ స్థాపించి,దేశాన్నీ ఏలాలని మరో సంకల్పం చేసుకున్నాడు. అది ఒక్కటే సాధించలేక పోయాడు. అది తప్ప ఆన్నీ సాధించాడు. తాను ప్రధానమంత్రి కాలేకపోయినా,వి.పి.సింగ్ ను ప్రధానిగా కూర్చోబెట్టాడు. కింగ్ మేకర్ అయ్యాడు. దేశంలోని కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒక్కచోటకు చేర్చి, ‘నేషనల్ ఫ్రంట్’ స్థాపించి, దానికి కన్వీనర్ గా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. ఏడు సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  రాజిల్లాడు.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొట్టమొదటగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి సరికొత్త చరిత్రకెక్కాడు. తన పరిపాలనా కాలంలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఎన్నో ప్రయోజక పధకాలు తెచ్చాడు. రాజకీయ జీవితంలో సంచలనాలు,సంచలన విజయాలు,  సవాళ్లు,ప్రతి సవాళ్లు  చూశాడు. రాజకీయాల్లో అమేయంగా గెలిచాడు. నిబద్ధత,నిజాయితీ, నిర్భీతి,నిక్కచ్చితనం ఎన్ టి ఆర్ బలాలుగా చెప్పుకోవాలి. అహం,ఆవేశం, అతివిశ్వాసం  ఆయన బలహీనతలనే చెప్పాలి.

మొండితనం ఆయన కండ. పట్టుదల ఆయన గుండె. మానవత్వం,కృతజ్ఞత నింపుకున్న మనిషిగా ప్రజలకోసం ప్రతిక్షణం  శ్రమించాడు. అనంతమైన, అనితర సాధ్యమైన,అభేద్యమైన ప్రజాభిమానమే ఆయన ధనం. ఆత్మాభిమానం ఆయన  ఇంధనం. ఈ బలాలు,ఈ ధనాలే ఎన్.టి.రామారావును విజేతగా నిలబెట్టాయి. అవినీతిరహిత పాలన ఆయన ముద్ర.ప్రజాధనం వృధాకాకుండా చూడడం ఆయన ప్రత్యేకం.

పటేల్,పట్వారి వ్యవస్థ నిర్మూలనం,శాసనమండలి రద్దు,  మండలాల స్థాపన ద్వారా పరిపాలనా వికేంద్రీకరణ, రాయలసీమ క్షేమం కోసం తెలుగుగంగ నిర్మాణం, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు, కిలో రెండురూపాయల బియ్యం, విద్యుత్ చార్జీల తగ్గింపు, కార్పొరేషన్ పదవుల సంఖ్య కుదింపు మొదలైనవన్నీ ఎన్.టి.ఆర్ తెచ్చిన సంస్కరణలు. ఏకపక్ష నిర్ణయాలు,ప్రజాప్రతినిధుల పాత్రను విస్మరించడం, ఒకేసారి కేబినెట్ మొత్తాన్ని రద్దు చెయ్యడం,తన మీద తనకు అతివిశ్వాసం, తను నమ్మినవారిపట్లా అదే అతివిశ్వాసంగా ఉండడం, చుట్టూ జరుగుతున్న కుట్ర, కుతంత్రాలను,తప్పులను  గమనించకపోవడం,గమనించినా లెక్కచేయకుండా ఉండడం మొదలైనవి ఎన్టీఆర్ రాజకీయజీవితంలోని చేదు పార్శ్వాలు.

తెలుగు రాష్ట్రం లోనే కాక, భారతదేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థలను నిర్మించిన ధీశాలి. గుంటూరు,విజయవాడ ప్రాంతాలకు ఎప్పుడు వెళ్లినా? తన చిన్ననాటి స్నేహితులను కలువకుండా ఉండడు. గుంటూరు శేషేంద్రశర్మ, సోమరాజు శ్రీహరిరావు (ఆంజనేయపంతులుగారి కుమారుడు),జగ్గయ్య మొదలైనవారు ఎన్టీఆర్ సహాధ్యాయులు. ముక్కామల,రాజనాల మొదలగు మహానటులంతా ఎన్టీఆర్ స్థాపించిన ‘నేషనల్ ఆర్ట్ ధియేటర్’ లో తొలినాళ్ళల్లో  నటించినవారే. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆ సంస్థ స్థాపించాడు.

తర్వాత అదే బ్యానర్ పై అద్భుతమైన అనేక గొప్ప సినిమాలు నిర్మించాడు. ఉద్యోగపర్వం నుంచి అధికార పర్వం వరకూ అవినీతికి ఆమడ దూరంగానే ఉన్నారు. సబ్ రిజిస్ట్రార్ గా తొలిప్రభుత్వ ఉద్యోగం చేశారు.అవినీతిని భరించలేక మూడు వారాల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అట్లా,అవినీతి వ్యతిరేక పోరాటం ఆనాడే ప్రారంభించాడని చెప్పాలి. ఎక్కడో కృష్ణాజిల్లాలోని మారుమూల పల్లె నిమ్మకూరు. అక్కడి నుంచి నింగిహద్దుగా ఎగసిన,ఎదిగిన తేజోమయమూర్తి. అంతటి విజయస్వరూపుడైన ఎన్టీఆర్ జీవితం వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ విషాదాంతమైంది.

అదే విషాదం! నందమూరి తారకరామారావు పేరున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థాపించిన పురస్కారాలు ప్రతి సంవత్సరం తప్పకుండా  ప్రదానం చెయ్యాలి. భారతప్రభుత్వం ఎన్టీఆర్ కు ‘భారతరత్న’ తప్పక ప్రదానం చెయ్యాలి. రాజకీయాలకు అతీతంగా,అన్ని పార్టీలు ఈ దిశగా కలిసి సాగాలి. తన ఐశ్వర్యం,కీర్తి,వైభవం అన్నీ ఆయన రెక్కల కష్టం, ధర్మార్జితం. జీవిత చరమాంకంలో సొంత ఊరు నిమ్మకూరులో నివసిద్దామనుకున్నారు. 85 ఏళ్ళు జీవిస్తానని, సహస్ర చంద్రదర్శనం చేసుకుంటాననే విశ్వాసం ఉండేది. 73 ఏళ్లకే అర్ధాంతరంగా వెళ్లిపోయారు. భౌతికంగా ముందే మనల్ని విడిచివెళ్లినా, మన జ్ఞాపకాలలో, చరిత్ర పుటల్లో కీర్తికాయుడుగా ఎన్నటికీ ఎన్టీఆర్ మిగిలేవుంటారు. ఆ అఖండజ్యోతి కోటి ప్రభలతో వెలుగుతూనే ఉంటుంది.

మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

భారత్ జపాన్ ల మధ్య సైనిక సహాకార ఒప్పందం

Satyam NEWS

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కుటుంబం

Satyam NEWS

హై హాండెడ్ నెస్: దివీస్ కంపెనీ దౌర్జన్యం పై మంత్రికి ఫిర్యాదు

Satyam NEWS

Leave a Comment