30.7 C
Hyderabad
April 29, 2024 06: 45 AM
Slider ఆధ్యాత్మికం

సూర్యప్రభ వాహనంపై ధ‌న్వంత‌రి శ్రీ క‌ల్యాణ శ్రీనివాసుడు

mangapuram

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై ధ‌న్వంత‌రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.

వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

 బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజు ఉదయం కల్యాణ సూర్యనారాయణుడు సూర్యప్రభామధ్యస్తుడై దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ భక్తులను ఆరోగ్యవంతులను చేస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిస్తాడు. సూర్యుడు సకలరోగ నివారకుడు. ఆరోగ్యకారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, పండే పంటలు, ఓషధీపతి అయిన చంద్రుడు సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాయి.

ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ. సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే కల్యాణ సూర్యనారాయణుడిని దర్శించే భక్తులకు ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతానసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వాహన సేవ అనంతరం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.

ఇందులో పాలు, పెరుగు, తేనె, ప‌సుపు, చందనం, కొబరి నీళ్ళతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు దర్శనమిచ్చి తన చల్లని అమృత కిరణాలతో భక్తులను అమృతస్వరూపులను చేస్తారు. నక్షత్రాలకు చంద్రుడు అధిపతి అయితే శ్రీవారు సమస్త విశ్వానికీ అధిపతి. వాహనం చంద్రుడు ఆహ్లాదకారి.

శ్రీవారు చంద్రమండల మధ్యస్థుడై పరమాహ్లాదకారి అయ్యాడు. సర్వకళాసమాహారాత్మకుడైన ఆదినారాయణుడు తన కళల నుండి 16 కళలు చంద్రునిపై ప్రసరింపజేసినందున చంద్రుడు కళానిధి అయ్యాడు. చంద్రదర్శనంతో సముద్రం ఉప్పొంగినట్టు, చంద్రప్రభామధ్యస్థుడైన శ్రీకల్యాణచంద్రుణ్ణి దర్శించడంతో భక్తుల హృదయ క్షీరసాగరాలు ఉత్తుంగప్రమోద తరంగాలతో పొంగి ఆనందిస్తాయి.

చంద్రప్రభ వాహనంలో శ్రీవారిని దర్శించడం సకలతాపహరం. పాపహరం. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో ఎల్ల‌ప్ప, ఏఈవో ధ‌నంజ‌యుడు, ప్రధాన అర్చ‌కులు బాలాజీ రంగాచార్యులు, సూప‌రింటెండెంట్ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.    

Related posts

డ్రైంకెన్ డ్రైవ్ లో పట్టుపడ్డ ముగ్గురు యువకులు హల్ చల్

Satyam NEWS

కార్పోరేట్ సంస్థల కోసమే ఈ కొత్త వ్యవసాయ చట్టాలు

Satyam NEWS

ఎమ్మెల్యే గోపిరెడ్డి చొరవతో డాక్టర్ భాస్కరరావు కి రూ.కోటి సాయం

Satyam NEWS

Leave a Comment