ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని రుద్రూర్ సీఐ అశోకర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని పొతంగల్ గ్రామంలో మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆదివారం సందర్శించిన ఆయన పోలీసులు మూసివేసిన సరిహద్దు రహదారులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి, రాష్ట్ర మఖ్యమంత్రి పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు దారులను 24 గంటలపాటు మూసివేశామన్నారు. సోమవారం ఉదయం 6 గంటగలకు రహదారులు తెరుస్తామని తెలిపారు. చైనాలో పుట్టిన కరోనావైరస్ విదేశాల్లో తీవ్రంగా విస్తరించిందని, విదేశాలనుండి వచ్చిన వారివల్ల మన దేశంలో కూడా విస్తరిస్తుందని అన్నారు.
మహారాష్ట్రలోని ముంబాయి, పుణే, నాందేడ్ లలో గల ఏయిర్పోర్టుల నుండి వచ్చిన వారి వల్ల తెలంగాణాలో కరోనా వ్యాపిస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర సరిహద్దు దారులను సీఎం ఆదేశాల మేరకు మూసివేశామని తెలిపారు. కరోనా ను ఎవరూ ఈజీగా తీసుకొని ఇబ్బందులు పడొద్దని ఈ వైరస్ పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిదని అన్నారు. ఆయనతో ఎస్సై మచ్ఛెందర్ రెడ్డి, డాక్టర్ సమత, పోలీసు సిబ్బంది, హెల్త్ సిబ్బంది ఉన్నారు.