28.7 C
Hyderabad
April 27, 2024 04: 28 AM
Slider సంపాదకీయం

ఆంధ్రా బిజెపి వర్సెస్ తెలంగాణ బిజెపి

ap ts bjp

తెలంగాణ రాష్ట్రంలో బిజెపి దూసుకుపోతుంటే ఆంధ్రప్రదేశ్ లో చతికిలపడి కూర్చున్నది. తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యమ పంథాలో పార్టీ నిర్మాణానికి నడుంకట్టారు. అధికార టీఆర్ఎస్ పార్టీని అనునిత్యం సవాల్ చేస్తూ దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీని విజయ పథాన నడిపారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో అనూహ్య ఫలితాలు సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. కార్యకర్తలకు ఉత్సాహం పంచడం నుంచి సాటి నాయకులను కలుపుకొని వెళ్లడంలో బండి సంజయ్ తన దైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇటీవలి కాలంలో బిజెపి సాధిస్తున్న విజయాలు చూసి ఇతర పార్టీ ల నుంచి పెద్ద ఎత్తున బిజెపి వైపు ఆకర్షితులవుతున్నారు.

అదే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బిజెపి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉండిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి తిరుపతి పార్లమెంటు స్థానానికి సంబంధించి జరగబోయే ఎన్నికల వరకూ క్లారిటీ లేని రాజకీయాలలో ఏపి బిజెపి తలమునకలై ఉంది. ఏపి బిజెపికి సోము వీర్రాజు అధ్యక్షుడుగా నియమితులైన తర్వాత బిజెపిలోని ఒక బలమైన వర్గం నిశ్శబ్దంగా మారిపోయింది. బలమైన నాయకులను కలుపుకొని వెళ్లడంలో సోము వీర్రాజు చొరవ చూపకపోగా వారిని శత్రువుల్లా చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార వైసీపీపై పోరాటం చేయడంలో ఏపి బిజెపి అధ్యక్షుడుగా కన్నా లక్ష్మీనారాయణ ఎంతో తెగింపు చూపేవారు. అయితే ప్రస్తుతం ఆ చొరవ కనిపించడం లేద‌నే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలపై దాడులు జరుగుతున్నవిషయాన్నిహిందూ ధార్మిక సంస్థలు గొంతెత్తి చాటుతున్నాబిజెపి పట్టించుకోకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తున్నది. అంతర్వేదిలో రథం తగలబెట్టిన సంఘటనకు సంబంధించి మొక్కుబడిగా ఆందోళనా కార్యక్రమం చేపట్టిన బిజెపి ఆ తర్వాత ఆ విషయమే పట్టించుకోవడం మానేసింది. అదే విధంగా చాలా దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ఆ విషయాలను బిజెపి నామ మాత్రంగానే ప్రతిఘటిస్తున్నది.

అదే విధంగా అమరావతి నుంచి రాజధానిని తరలించడం పై కూడా క్లారిటీ లేకుండా వ్యవహరిస్తున్నబిజెపి తాజాగా అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రకటించింది. గతంలో ఇదే విషయాన్నిచెప్పిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయాన్నిబిజెపి నాయకులు పలువురు గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడిని పక్కన పెట్టుకుని కూడా ఆంధ్రప్రదేశ్ బిజెపి క్రియాశీలంగా ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌డం లేదో అన్న‌ది మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది.

Related posts

ప్రజా రవాణా శాఖ కు ఆర్టీసీ సిబ్బంది

Satyam NEWS

సూర్యలంక తీరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

Satyam NEWS

కొల్లాపూర్ పట్టణ చరిత్రను చెరిపేస్తున్నది ఎవరు?

Satyam NEWS

Leave a Comment