ప్రపంచ అవసరాలకు అనుగుణంగా మనం పంటలు పండించాలి అప్పుడే మనకు లాభసాటిగా ఉంటుంది అని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నాంపల్లి రెడ్ హిల్స్ లో తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో సుగంధ ద్రవ్యాల పంటల సాగుపై నేడు రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన ప్రసంగించారు. సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రైతు గొప్పగా బతికినప్పుడే దేశానికి సార్ధకత అని అందుకే రైతు కోసం ఎంతయినా ఖర్చు భరిస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటారని మంత్రి అన్నారు. రాబోయే రోజులలో రైతులకు మేలు చేసే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఆయన అన్నారు. ప్రపంచం ఇప్పుడు సేంద్రీయ పంటల సాగు వైపు పోతుందని అందుకు అనుగుణంగానే రైతులు మారాలని ఆయన కోరారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటలు పండించాలని ఆయన రైతులను కోరారు. అన్ని దేశాల్లో అన్ని పంటలు పండవు, మన రాష్ట్రంలో పండే పంటలు మనం పండించాలి అప్పుడు ప్రపంచంలో ఎక్కడకు అయిన ఎగుమతి చేయవచ్చునని మంత్రి అన్నారు. సుగంధ ద్రవ్యాలు సమశీతోష్ణ ప్రాంతాలలో మాత్రమే పండుతాయని, ఆసియా ఖండంలో ఎక్కువగా ఇలాంటి పంటలు సాగు అవుతాయని అందువల్ల రైతులు సుగంధ ద్రవ్య పంటల సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. పంట పండించిన తరువాత పంటను మార్కెట్ చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఎరువులు, ఇతర ముడి సరుకులు సబ్సిడీపై ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పత్తి పంట లో అంతర పంట గా కొత్తిమీర వేస్తే ఒక్క ఎకరం లో 60 వేల రూపాయల ఆదాయం వచ్చింది అని ఇక్కడ రైతు చెప్పడం గొప్పగా అనిపించింది. ప్రతి ఒక్క రైతు ఊరు కోళ్లను పెంచుకోవాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సీడ్ స్పైస్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్ లాల్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్, వికారాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల రైతులు హాజరయ్యారు
previous post