ఆర్టీసీని, ఆర్టీసీ ఆస్తులను, ఆర్టీసీ ఉద్యోగులను కాపాడుకోవడానికి మాత్రమే సమ్మె చేస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వర్ధామరెడ్డి స్పష్టం చేశారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్ లో టీఎన్జీవో, టిజిఓ నాయకులతో ఆర్టీసీ జేఏసీ నాయకులు నేడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అశ్వర్ధామరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలు అందరూ తమకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు. తమ సమస్యలను నెరవేర్చుకోవడానికి సమ్మె నోటీసులు ఇచ్చినం అయిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేసిందని, కార్మికులు ఎంత కష్ట పడ్డ దానికి ఫలితం జీతం రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఊరూరికి బస్సులు తిప్పుతాం అనుకున్నాం కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం నుండి రావాలని అయితే వాటిని ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఇద్దరు కార్మికులు చనిపోయిన సంఘటన తమను ఎంతో కలసి వేసిందని ఈ సందర్భాంగా టిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు కారం రవిందర్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలవాలని తమను కోరారని, క్రింది స్థాయి వరకూ అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యోగులతో సమానంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇచ్చిందని ఆయన అన్నారు. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో జరిగిన సమావేశం వల్ల చాలా మంది కి ఎన్నో అపోహలు తలెత్తాయని అయితే తాము ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసినా సమస్యల సాధన కోసమే కలిశామని ఆయన అన్నారు. రేపు సీఎస్ ను కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు
previous post