తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సమ్మె ప్రారంభమై రెండు వారాలు అవుతున్నా ఎందుకు ఆపలేకపోయారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మరికొంత మంది ఆర్టీసీకి మద్దతు తెలిపితే ఆందోళనను ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని వారు తిరగబడితే ప్రభుత్వంలోని వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించింది. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా కొత్త ఎండీనీ నియమించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆర్టీసీకి సమర్థవంతమైన ఇన్ ఛార్జి ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. ఆయన సమర్థవంతుడు అయినప్పుడు ఆయననే ఎండీగా నియమించవచ్చు కదా అని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ యూనియన్లు చేస్తున్న 45 డిమాండ్లలో 20 డిమాండ్లు సులువుగా పరిష్కారమయ్యేవేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే రెండు వారాలుగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకపోతే ఎలా అని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయకపోతే ఇతర డిమాండ్లపై చర్చే లేదని యూనియన్ నేతలు పట్టుబట్టారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
previous post