28.2 C
Hyderabad
April 30, 2025 06: 08 AM
Slider తెలంగాణ

సోమవారం లోపు జీతాలు ఇచ్చేయండి

HY13HIGHCOURT

సమ్మె కారణంగా నిలిపివేసిన గత నెల వేతనాన్ని ఆర్టీసీ సిబ్బందికి వెంటనే చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెల జీతాలు తమకు చెల్లించకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే జీతాలు చెల్లించే విధంగా ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించాలని టీఎంయూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఆర్టీసీ యాజమాన్యాన్ని కోర్టు వివరణ కోరగా సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో జీతాలు ఇచ్చేందుకు సిబ్బంది లేరని కోర్టుకు విన్నవించింది. అయితే సోమవారం నాటికి జీతాలు చెల్లిస్తామని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సోమవారం లోపు కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో గత 12 రోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది. కోర్టు తీర్పుపై ఆర్టీసీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె విరమించాలని, వారితో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం మంగళవారం సూచించిన విషయం తెలిసిందే. ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టీఎన్‌ జీవో, టీజీవో సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ హెచ్చరించింది. ప్రతి నెలా ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు ఆర్టీసీ యాజమాన్యం కావాలనే తొక్కిపెట్టిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. చేసిన పనికి వేతనం ఇవ్వకపోవడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ దుర్మార్గానికి హైకోర్టు ఫుల్‌స్టాప్‌ పెట్టిందని పేర్కొన్నారు. ఆర్టీసీపై ప్రభుత్వం వైఖరికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని సిఎం కేసీఆర్ నియంతృత్వ పోకడలు మానుకోవాలని వారు అన్నారు.

Related posts

ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీ: ఒకరి పరిస్థితి విషమం

Satyam NEWS

టీటీడీ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య: నిలిచిన టికెట్ల బుకింగ్‌

Satyam NEWS

తాగి వాహనం నడిపినా పోలీసులు వాహనాన్ని ఇక సీజ్ చేయలేరు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!