26.7 C
Hyderabad
April 27, 2024 07: 16 AM
Slider ముఖ్యంశాలు

క్రిమిన‌ల్ చ‌రిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోంది

#venkaiahnaidu

దేశ రాజ‌కీయల్లో మార్పులు రావాలని మాజీ ఉప‌రాష్ట్రప‌తి ఎం. వెంక‌య్య‌నాయుడు చెప్పారు. రాజ‌కీయాల్లో క్రిమిన‌ల్ చ‌రిత్ర ఉన్న వారి సంఖ్య పెరిగిపోతోందని, ఇది స్వ‌చ్ఛ రాజ‌కీయాల‌కు మంచిది కాదన్నారు. ప్ర‌జా ప్ర‌తినిధుల క్రిమిన‌ల్ కేసుల‌పై ప్ర‌త్యేక ట్రిబ్యున‌ళ్లను ఏర్పాటు చేసి, నిర్దిష్ట కాల‌ప‌రిమితిలో వాటి విచార‌ణ‌ను ముగించాలని ఢిల్లీలో జరిగిన విలేకరుల ఇష్టాగోష్ఠీలో వెంకయ్యనాయుడు చెప్పారు. చట్ట స‌భల్లో 33 శాతం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై త్వ‌రిత‌గ‌తిన నిర్ణ‌యం తీసుకోవాలని సూచించారు. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లును వెంటనే ఆమోదించాల్సిన అవ‌స‌రం ఉందని, దీన్ని సాగ‌దీయడం ఎంత‌మాత్రం స‌బ‌బు కాదన్నారు. దేశంలోని రాజ‌కీయ‌, సామాజిక‌, సాంస్కృతిక, జీవన స్థితిగ‌తుల్లో మార్పులు రావాలని వెంకయ్య చెప్పారు. సుదీర్ఘ‌ రాజ‌కీయ‌, ప‌రిపాల‌న అనుభ‌వంతో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌రువాత‌ ఖాళీగా ఉండలేనన్నారు. విద్య‌, మ‌హిళ‌, రాజకీయ‌, భాష‌,.సాంస్కృతిక అంశాల్లాంటివి పదింటిని గుర్తించానని, వాటిపై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. రాజ‌కీయాల గురించి మాట్లాడుతా కానీ రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు.

రాజ‌కీయ నాయ‌కులు వాడే ప‌ద‌జాలం ఆవేద‌న కలిగిస్తోందని, రాజకీయాల్లో అసభ్య ప‌ద‌జాలాన్ని నియంత్రించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. గ‌తంలో రాజ‌కీయాలు బాగుండేవని ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాతృ భాష‌ల‌ను ప‌రిర‌క్షించుకోవాల్సిన అవస‌రం ఉందని, లేక‌పోతే కొన్ని రోజుల‌కు భాష‌లు అంత‌రించిపోయే ప్ర‌మాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని భార‌తీయ భాష‌ల‌కు స‌మాన ప్రాధ‌న్య‌త ల‌భించాలన్నారు. అన‌వ‌స‌ర‌మైన ఉచితాలు కూడా మంచిది కాదని, ప్ర‌జా సంక్షేమం నిర్మాణాత్మ‌కంగా ఉండాలన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లో కూడా కొన్ని మార్పులు రావ‌ల్సిన అవ‌స‌రం ఉందని, ఏళ్ల కొద్దీ కేసులను సాగతీయడం సబబు కాదని వెంకయ్య చెప్పారు.

Related posts

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

డ్రోన్ కెమారాతో పోలింగ్ ను పరిశీలించిన ఎస్పీ..!

Satyam NEWS

మూడో రోజు కొన‌సాగిన విజయనగరం పోలీసుల ఆప‌రేష‌న్ ప‌రివ‌ర్త‌న్

Satyam NEWS

Leave a Comment