30.7 C
Hyderabad
April 29, 2024 05: 04 AM
Slider ఖమ్మం

పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది.. ప్రజలు ఆందోళన చెందవద్దు

#Minister Puvwada Ajay Kumar

ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.

వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి పువ్వాడ ఆదేశించారు.

ప్రస్తుత సమయంలో ఎవరు కూడా సెలవుల్లో వెళ్లకుండా, పూర్తి అప్రమత్తతో విధులు నిర్వర్తించేలా జిల్లా కలెక్టర్ కు సూచించారు. జిల్లా వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యల గురించి జిల్లా కలెక్టర్ గౌతం ను ఆరా తీస్తూ, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పక్కాగా వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని, అనవసరంగా ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరించకూడదని హితవు పలికారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరద ప్రభావంతో వ్యాధులు ప్రభలకుండా ముందస్తుగానే అప్రమత్తతో కూడిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అన్ని పీ.హెచ్.సీలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి సారిస్తూ, ఆశా వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు సమర్ధవంతంగా ప్రజలకు సేవలందించేలా అప్రమత్తం చేయాలన్నారు.

కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లకు వర్ష ప్రభావిత ప్రాంతాల నుండి ఏదైనా సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని మంత్రి అధికారులకు హితవు పలికారు.

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తతతో కూడిన చర్యలు సమర్ధవంతంగా చేపడుతోందని, మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ తమ కార్యస్థానంలోనే ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ముఖ్యంగా పురాతన కాలం నాటి ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి భోజన వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రభుత్వ సలహాలు సూచనలు పాటించాలన్నారు.

Related posts

ఇద్దరు ఛోటా దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS

వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఆశ్రా సేవలు అభినందనీయం

Bhavani

అర్ధ రాత్రి అయినా కొనసాగుతున్న అమరావతి రైతు ధర్నా

Satyam NEWS

Leave a Comment