Slider తెలంగాణ సంపాదకీయం

ప్రకృతి మాతను చెరబట్టే యురేనియం తవ్వకాలు

Nallamala

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటి వరకూ కొన్ని సామాజిక చైతన్య సంస్థలకే పరిమితం అయిన ఈ ఉద్యమం ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మహా ఉద్యమంగా రూపుదాల్చుకుంటున్న అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు తెలిసిన నాటి నుంచి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్ను ఇక్కడే ఉంది. అత్యంత దట్టమైన ఈ అటవీ ప్రాంతం ప్రకృతి ప్రసాదించిన వరం. అలాంటి నల్లమల అడవిని కొల్లగొట్టేందుకు యురేనియం కార్పొరేషన్ దొంగ ప్రయత్నాలు ప్రారంభించడం అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది.

నల్లమల అటవీ ప్రాంతంలో ఈ దేశంలోనే అరుదైన చెంచు జాతి ప్రజలు నివశిస్తుంటారు. అంతరించి పోతున్నఈ జాతి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. చెంచు జాతిని కాపాడుకోవడానికి మానవులుగా పుట్టిన వారంతా ఏకం కావాల్సిన అసరం ఉంది. మనకెందుకులే అని ఊరుకుంటే ఈనాడు చెంచు జాతి అంతరించిపోయినట్లే మనమూ ఒక నాటికి అంతరించిపోతాం. ఇప్పుడు యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు చెబుతున్న ప్రాంతం అంతా కూడా టైగర్ శాంక్చురీ.

అంతరించిపోతున్న పులులు గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలె ఎంతో ఆవేదన వ్యక్తంచేశారు. పులులను అంతరించకుండా చూడాలని ఆయన అందరిని కోరారు. మరి నల్లమల అడవిలో యురేనియం కార్పొరేషన్ చేస్తున్నది ఏమిటి? యురేనియం తవ్వకాలు మొదలు పెడితే అక్కడి టైగర్ శాంక్చురీ ఏం కావాలి? యురేనియం నిక్షేపాలను వెలికి తీసే ప్రాంతం అంతా కూడా కృష్ణా నది పరీవాహక ప్రాంతమే. నల్లమల అడవులను అంతం చేసే ఈ యురేనియం తవ్వకాలతో ఆ ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది. అక్కడ యురేనియం నిక్షేపాలు బయటకు తీస్తే కృష్ణానది పూర్తిగా రేడియేషన్ తో నిండిపోతుంది.

రేడియేషన్ కారణంగా సకల జీవరాసులు ఇబ్బంది పడతాయి. కృష్ణా నది నీటినే ఇప్పుడు మనం తాగు నీటి అవసరాల కోసం వాడుకుంటున్నాం. హైదరాబాద్ జంట నగరాలకు కృష్ణానది నీరే శరణ్యం. ఇప్పుడు అక్కడ యురేనియం తవ్వకాలు మొదలు పెడితే కృష్ణ నీరు కలుషితం అయి రేడియేషన్ కు గురి అయితే జంటనగరాల ప్రజలు ఏం కావాలి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలూ కూడా కృష్ణ నీటిపైనే ఆధారపడి మనుగడ సాగిస్తున్నాయి. అన్ని రకాలుగా జన జీవనాన్ని అస్తవ్యస్థం చేసే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది.

పార్టీలకు అతీతంగా మానవత్వాన్ని బతికించే ప్రయత్నం అందరూ చేయాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ గళం విప్పుతున్నారు. సినీ, రాజకీయ, ప్రజా సంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన కేటీఆర్ సీఎం కేసీఆర్‌తో మాట్లాడతానని ట్విటర్‌లో పేర్కొన్నారు. మంత్రి చేసిన ఆ ట్వీట్‌పై మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ట్విటర్ వేదికగా నిప్పులు చెరిగారు. కేటిఆర్ గారు ,”సురభి” నాటకాలు కట్టిపెట్టండి.యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యండి. అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. యురేనియం తవ్వకాలపై రాజకీయ వర్గాలతో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దర్శకుడు శేఖర్ కమ్ముల సేవ్ నల్లమల అంటూ సపోర్ట్ తెలియజేసారు.

ఆ తర్వాత పవన్ కల్యాణ్, విజయ దేవరకొండ, సాయి ధరమ్ తేజ్, అనసూయ, సమంత, రామ్ సైతం సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. యురేనియం తవ్వకాలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా.. అది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related posts

నూతన డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

రాజధాని రైతులకు 51 క్వింటాళ్ల బియ్యం విరాళం

Satyam NEWS

బాధితులకు భరోసా కల్పించడమే ధ్యేయంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment