కరోనా ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 2480 వాహనాలను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 45,46 జీవోల ప్రకారం అత్యవసర సర్వీసులు తప్ప సాధారణ వ్యక్తులు వాహనాలపై తిరగడం నిషేధం. అంతే కాకుండా ద్విచక్ర వాహనంపై ఒక్కరు, కారులో ఇద్దరు తప్ప ప్రయాణించేందుకు వీలు లేదు.
నివాసానికి రెండు మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. నగరంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడుపుతున్నందున పోలీసులు వీరి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని 25 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 73 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలలో 1058 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. 948 ఆటోలు, 429 కార్లు, ఇతర వాహనాలు 45 పోలీసులు సీజ్ చేశారు.
పోలీసు నిబంధనలను అతిక్రమించిన వారిపై ఐపిసీ 188 సెక్షన్ కింద కేసులు పెట్టి వాహనాన్ని సీజ్ చేస్తారు. రాత్రి 7 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకూ ఎలాంటి ట్రాఫిక్ ను పోలీసులు రోడ్లపైకి అనుమతించేది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.