42.2 C
Hyderabad
April 26, 2024 15: 10 PM
Slider జాతీయం

సాంకేతిక అంతరాలు తొలగిస్తేనే అందరికీ విద్య

#Venkaiahnaidu

విద్యావ్యవస్థలోని సాంకేతిక అంతరాలను తొలగించడం ద్వారా సార్వత్రిక ప్రాథమిక విద్య లక్ష్యాలను చేరుకోవడంతోపాటు అందరికీ సెకండరీ, ఉన్నతవిద్యను అందించేందుకు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఉపరాష్ట్రపతి భవన్‌లోని సర్దార్ పటేల్ సమావేశ ప్రాంగణంలో ఐసీటీ అకాడెమీ రూపొందించిన ‘ఫ్యూచర్ ఎడ్యుకేషన్-నైన్ మెగాట్రెండ్స్’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ.. ‘పెరుగుతున్న సాంకేతికత కొత్త అవకాశాలను అందిస్తుండటంతోపాటు మన సమాజంలోని సాంకేతిక అంతరాన్ని మనకు గుర్తుచేస్తుంది’ అని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తూ.. ‘ఎందరోమంది చిన్నారులకు సాంకేతిక ఉపకరణాల వినియోగం తెలియదు. ఇందుకు చాలా కారణాలున్నాయి.

ఈ అంతరాన్ని తగ్గించడం ద్వారా.. అలాంటి వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి.. తద్వారా మారుతున్న సాంకేతికతను వారు వినియోగించుకునే దిశగా మనమంతా కృషిచేయాలి’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో విద్యార్ధులు

‘లాక్‌డౌన్ కారణంగా చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. సాంకేతిక ఉపకరణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్ విద్యావిధానంలో భాగమయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వీరందరు ఆన్‌లైన్ విధానంలో విద్యనభ్యసించేందుకు సరైన శిక్షణను అందించాల్సిన అవసరముంది’ అని ఆయన అన్నారు.

భారతదేశంలోని చాలా మంది తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఆధునిక పద్ధతిలో విద్యనభ్యసించేందుకు అవసరమైన ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటి సాంకేతిక ఉపకరణాల ఖర్చును భరించలేరని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక అంతరాన్ని తగ్గించే విషయంలో ప్రభుత్వాలు మాత్రమే పనిచేస్తే సరిపోదు.

ప్రైవేటు రంగం కూడా ముఖ్యంగా విద్యారంగంలోని సాంకేతిక సంస్థలు తమ ఉత్పాదనలు, ఉపకరణాలను విద్యార్థులకు అందుబాటు ధరల్లోకి తీసుకొచ్చేందుకు కృషిచేయాలని సూచించారు. ‘మన బంగారు భవిష్యత్తు అయిన చిన్నారులను మరింత ప్రోత్సహిస్తూ.. వారిని దేశాభివృద్ధిలో భాగస్వాములు చేయడంలో మనవంతు పాత్రను పోషించాల్సిన సమయమిది’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.

కరోనా నేపథ్యంలో విద్యకు ఆటంకం కలుగరాదు

కరోనా మహమ్మారి నేపథ్యంలో.. విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా విద్యాసంస్థలు డిజిటల్ క్లాసులు నిర్వహించడం, క్లౌడ్ ఆధారిత వేదికల ద్వారా విద్యార్థులతో అనుసంధానమై విద్యాబోధనతోపాటు పరీక్షలు కూడా ఆన్‌లైన్లోనే నిర్వహిస్తున్నారన్నారని ఇది ఆహ్వానించదగిన పరిణామమన్నారు. రానున్న రోజుల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), వర్చువల్ రియాలిటీ, అగుమెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానంతోనే తరగతుల నిర్వహణ జరుగుతుందన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా కొత్త పద్ధతులను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ‘ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు అనుసంధానకర్తగా, మార్గదర్శిగా, సలహాదారుడిగా, గురువుగా, పలు సందర్భాల్లో ఓ స్నేహితుడిగా సరికొత్త పాత్రను పోషించాల్సి వస్తుంది’ అని అన్నారు.

వినూత్న విధానాలతోనే అందరికి విద్య

రాష్ట్రప్రభుత్వాలు.. అందరికీ అన్ని స్థాయిల్లో సరైన విద్యను అందించేందుకు అవసరమైన వినూత్న పరిష్కారాలకోసం ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు.

‘భారతదేశంలోని యువశక్తి మన బలం. మనకున్న గొప్ప అవకాశం కూడా. దీన్ని సద్వినియోగపరచుకోవాలి. భారత యువతలో శక్తి సామర్థ్యాలకు కొదువలేదు. వీరికి సాంకేతికతను అందించి నైపుణ్యానికి సానబెట్టాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

సాంకేతిక విద్యతోపాటు విలువలతో కూడిన భారతీయ విద్యావిధానాన్ని కూడా భవిష్యత్ తరానికి అందించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. విద్యార్థుల్లో సాంస్కృతిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలను పెపొందించడాన్ని విద్యాసంస్థలు బాధ్యతగా తీసుకోవాలన్నారు.

Related posts

ఏపీ నూతన సీఎస్ గా ఆదిత్యానాథ్ దాస్

Satyam NEWS

మరో ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

వ‌సంత మండ‌పంలో విష్ణుసాల‌గ్రామ పూజ‌

Sub Editor

Leave a Comment