26.7 C
Hyderabad
April 27, 2024 10: 32 AM
Slider ఆధ్యాత్మికం

ఆదౌ పూజ్యో గణాధిపః

#GaneshPuja

తొలి పూజ గణపతితో ప్రారంభించాలని శాస్త్ర వచనం. కారణం ప్రమద గణములకు అధిపతి గణనాథుడు. విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా| సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్య న జాయతే|| ఏకార్యం ప్రారంభించాలన్నా, విఘ్నేశ్వరుని పూజించటం ద్వారా ఆటంకాలు రాకుండా, లేకుండా చేసే పని సాఫీగా సాగిపోతున్న నమ్మకం.

కనుకనే “గణపతిని”పూజించటం మన సంస్కృతి, సంప్రదాయం. వినాయక చవితి పండుగను మనం భాద్రపద శుద్ధ చవితి తిథినాడు జరుపుకుంటాం. హిందూ దేశంలో జరుపుకునే పండుగలలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ వినాయక చవితి పండుగ.

ప్రకృతిని పూజించటం ముఖ్య ఉద్దేశం

ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని పూజించటం, ఆరాధించటం, జీవులను ప్రేమతో ఆదరించటం అనేది దీని ముఖ్య సారాంశం అని మన పెద్దలు చెప్పారు. కాలక్రమేణా ఈ పండుగ ఆంతర్యం మరుగునపడి వివిధ రకాల రంగులు పులుముకుంది. భక్తితో కాకుండా గొప్పగా, వైభవంగా చేసుకోవడంగా మార్పు చెందింది. 

గణనాధుని ప్రతిమలు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్పగా భావించే రోజులుగా మారాయి. కరోనా ఒక విధంగా చెప్పాలంటే ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు మంచి మార్గాన్ని చూపింది అనే  చెప్పాలి. ఈ సంవత్సరం ప్రతి ఇంటిలో ఎవరికి వారుగా కుటుంబ సభ్యులందరితో కలిసి సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవటానికి మంచి అవకాశం కలిగింది.

 విఘ్నేశ్వరుని విగ్రహాన్ని నిశితంగా పరిశీలించినట్లయితే ఆయనది  మానవ శరీరం, ఏనుగు తల, యజ్ఞోపవీతముగా నాగుపాము, వాహనంగా అనింద్యుడు పేరు కలిగిన ఎలుక, ఆయనకు పూజాద్రవ్యాలుగా ఆకులు, అలములు, వివిధ రకాల పళ్ళు, పూలతో అలంకరించి, పూజించటం కనిపిస్తూ ఉంటాయి.

మొదటిగా స్వామిని నిశితంగా పరిశీలిస్తే  లంబోదరుడు, గజవదన ముతో దర్శనమిస్తాడు. ఈ స్వామి జననము పార్వతీదేవి తన నలుగు పిండితో బొమ్మను చేసి ప్రాణం పోసి కాపలాగా ఉంచగా పరమేశ్వరుడిని తన గృహము లోనికి రాకుండా అడ్డుకోగా శివుని కి కోపం వచ్చి తన త్రిశూల ఆయుధంతో బాలుని సంహరించగా అట్టి విషయం తెలుసుకున్న పార్వతి కోపోద్రిక్తురాలైనది.

అది గమనించిన ఈశ్వరుడు ఉత్తర దిక్కుగా శిరస్సు పెట్టి శయనించు జంతువు యొక్క శిరస్సును తెమ్మని అట్టి శిరస్సును ఆ బాలునికి అతికించి ప్రాణము పోసిరి. పార్వతి దేవి గారాల పట్టి వినాయకునికి అగ్ర తాంబూలం ఇచ్చి దేవతాగణములకు అధిపతిని చేసిరి.

నాటినుండి గణాధిపతియై దేవతలకు, మానవులకు తనను పూజించిన వారికి ఎటువంటి విఘ్నములు రాకుండా కాపాడుతూ ఉంటాడు అనుటలో అతిశయోక్తి లేదు. ఈ పండుగలో మరో కోణం ఆకులు, అలములు, వీటి ద్వారా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఆగష్టు, సెప్టెంబర్ కాలంలో ఎక్కువగా వర్షం కురుస్తున్నాయి.

వర్షంతో చిత్తడి నేల క్రిమికీటకాల ప్రభావం మనిషిపై అనేక రుగ్మతలకు కారణభూతం అవుతాయి. వాటిని నివారించడానికి ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెట్లు ద్వారా వచ్చే వాయువులు వాటి రసాయన  చర్య వల్ల ఈ వ్యాధులు సమసిపోయే అవకాశం ఉన్నందున వాటిని తెలుసుకుని మొక్కల పేర్లను గుర్తించే విధంగా ఉండేందుకు వినాయక చవితి రోజున 21 రకాల మొక్కల యొక్క పత్రాలతో ,పుష్పాలతో విఘ్నేశ్వరుని పూజించడం జరుగుతుంది.

ఈ 21  రకముల యొక్క పత్రములు, పుష్పాలు మానవుని ఆయుర్దాయం పెంచే విధంగా, వివిధ రకాలైన రుగ్మతలు తొలగి పోయే విధంగా ఉపయోగపడతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వరసిద్ధి వినాయక స్వామి వారిని పూజలో పూజించే 21 రకాల పత్రాలు.

ఏకవింశతి పత్రాలు

01.మాచీపత్రం, 02.బృహతీపత్రం, 03.బిల్వపత్రం, 04.దూర్వాయుగ్మం[గరిక], 05.దత్తూరపత్రం[ఉమ్మెత్త], 06.బదరీపత్రం[రేగు], 07.తులసీపత్రం, 08.అపామార్గపత్రం[ఉత్తరేణి], 09.చూతపత్రం[మామిడి], 10.కరివీరపత్రం[గన్నెరు], 11.విష్ణుక్రాంత[హరిపత్రం],

12.దాడిమీపత్రం[దానిమ్మ], 13.దేవదారుపత్రం, 14.మరువకపత్రం[మరువం], 15.సింధూవారపత్రం[వావిలి], 16.జాజీపత్రం, 17.గండకీపత్రం[కామంచి], 18.శమీపత్రం[జమ్మి], 19.అశ్వస్థపత్రం[రావి], 20.అర్జునపత్రం[మద్ది], 21.అర్కపత్రం[జిల్లేడు].

ఇంత ప్రత్యేకత సామాజిక స్పృహతో  ఉన్న పండుగ  మనం మన భావి తరాలకు, ముఖ్యంగా నేటి తరానికి పురాణాలపై, మన సంస్కృతి సంప్రదాయాలపై చక్కని అవగాహన ఏర్పడే విధంగా, అర్థమయ్యే విధంగా వారు ఆచరించే విధంగా చెప్పాలి.

ఈ బాధ్యత పెద్దలమైన మన మీద ఉందని, భావించి మనందరం కుటుంబ సభ్యులందరితో కలిసి విఘ్నాలను తొలగించే వినాయకుని పూజను భక్తిశ్రద్ధలతో మన గృహాలలోనే జరుపుకొని ఆడంబరం కాదు, ఆచరణ,భక్తి ప్రధానమని భావితరాలకు నేర్పుదాము. చాటి చెపుదాం. మన భారతీయ ఆయుర్వేదాన్ని గౌరవిద్దాం ఆచరిద్దాం.

“సర్వేజనా సుఖినోభవంతు”

బాచిమంచి చంద్రశేఖర్ శర్మ, హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా.

Related posts

సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

చక్రిపురం లడ్డూను కైవసం చేసుకున్న వెంకటేశ్వర్ రావు

Satyam NEWS

కాణిపాకంలో సత్యదేవుడు ముందు ప్రమాణం చేసిన బీజేపీ నేత విష్ణు

Satyam NEWS

Leave a Comment