40.2 C
Hyderabad
April 29, 2024 18: 49 PM
Slider ప్రత్యేకం

సీరియల్ కంటిన్యూస్: ఏపికి తదుపరి సిఎస్ ఎవరు?

l v neelam

ఆంధ్రప్రదేశ్ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అనే అంశంపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన అతి స్వల్పకాలంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్ వి సుబ్రహ్మణ్యం ను సాగనంపారు. ఆ తర్వాత వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్న నీలం సాహ్నీ తీవ్రమైన వత్తడిలో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలతో నీలం సాహ్నీ తీవ్ర ఆందోళనలో కూడా ఉన్నారు.

మరో మూడు నెలల్లో ఆమె రిటైర్ కానున్న నేపథ్యంలో ఆమె వారసుడిని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆమె తర్వాత ఉన్న జాబితా చూస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టును భర్తీ చేయడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అంత సులభమైన విషయం కాదు. పైగా ఎల్ సుబ్రహ్మణ్యం, నీలం సాహ్నీ అనుభవాలు చూసిన తర్వాత ఆ పోస్టులోకి వచ్చేందుకు నిజాయితీ తో ఉండే సీనియర్ల సాహసించకపోవచ్చు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండే వ్యక్తి కేవలం తన ఆదేశాలను శిరసావహిస్తే చాలన్నట్లు ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉండే వ్యక్తి రూల్ పొజిషన్ చూసుకోకుండా కేవలం ముఖ్యమంత్రి చెప్పినట్లు వింటే న్యాయ పరమైన చిక్కులు తప్పవని సీనియర్ ఐఏఎస్ లు అనుకుంటున్నారు. ఈ కారణంతో వారసుడి ఎంపిక కష్టసాధ్యమౌతుందని అంచనా.

నీలం సాహ్నీ మధ్యలో వెళ్లిపోయినా, లేదా రిటైర్ అయ్యే వరకూ ఉన్నా ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలో నీలం సాహ్నీ తర్వాత ఎపి క్యాడర్ ఐఏఎస్ అధికారుల సీనియారిటీ లిస్టులో ఆమె భర్త ఏపీ సాహ్నీ ఉన్నారు. ఆయన రాష్ట్రంలో చేసింది తక్కువ. ఎప్పుడూ కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. అంతే కాకుండా ఆయనకు రెండేళ్ల సర్వీసు ఇంకా ఉంది. ఈ సమయంలో నీలం సాహ్నీకి జరిగిన అనుభవాలను స్వయంగా చూసి కూడా ఆ పోస్టులోకి వచ్చే అవకాశం లేదు.

ఆ తర్వాతి సీనియారిటీలో సమీర్ శర్మ, ఆ తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం ఉన్నారు. వీరు రాష్ట్రంలో పని చేసేందుకు ఇష్టపడకపోవచ్చు. నాలుగో స్థానంలో ఉన్న సాంబశివరావు అత్యంత సమర్ధుడైనా కూడా సామాజిక వర్గం నేపథ్యంలో ఆయన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వరు. ఆ తర్వాత సీనియర్ అయిన అభయ్ త్రిపాఠీ ముక్కుసూటిగా వెళ్లే అధికారి కాబట్టి ఆయన వచ్చినా ఆ పోస్టులో ఉండలేరు.

తర్వాతి స్థానంలో ఉన్న సతీష్ చంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబునాయుడి సమయంలో ఆయనకు తలలో నాలుకగా ఉండేవారు. ఆయనను చీఫ్ సెక్రటరీగా పెట్టుకుంటే చంద్రబాబు చేతికి తన జుట్టు ఇచ్చినట్లే అవుతుంది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న జెఎస్వి ప్రసాద్ కు వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోస్టింగే ఇవ్వలేదు కాబట్టి ఆయనను చీఫ్ సెక్రటరీ చేస్తారనే నమ్మకంలేదు.

ఆ తర్వాతి స్థానంలో నీరబ్ కుమార్ ప్రసాద్ ఇంట్లో ఎన్నికల సమయంలో ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్ లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున డబ్బు దొరికిన కేసు పెండింగ్ లో ఉంది. ఇది చీఫ్ సెక్రటరీ కావడానికి అవరోధం కాదు అనుకుంటే అడ్డురాదు. తర్వాతి స్థానంలో ఆదిత్యానాథ్ దాస్ ఉన్నారు. పదో స్థానంలో ఉన్న గిరిధర్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.

ఆయన రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదు. ముక్కుసూటి మనిషి కావడం వల్ల వచ్చినా ఎక్కువ కాలం ఉండలేరు. ఆ తర్వాతి స్థానంలో పూనం మాలకొండయ్య ఉన్నారు. 11 స్థానాల వరకూ అన్వేషిస్తే ఉన్న సీనియారిటీ ఇది. కాబట్టి చీఫ్ సెక్రటరీ ఎంపిక అంత సులభం కాదని చెప్పవచ్చు.

ఈ స్థానాన్ని కోరుకునే వ్యక్తి నిబంధనల గురించి ఆలోచించకుండా ముఖ్యమంత్రి చెప్పిన పనులు యాజ్ ఇట్ ఈజ్ గా చేసే వ్యక్తి అయి ఉండాలి. అలా చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయేమోనని ఆలోచించేవారు ఈ పోస్టులో ఎక్కువ కాలం ఉండలేరు. అన్నింటికి సిద్ధపడిన వారు మాత్రమే ఈ పోస్టుకు రావాల్సి ఉంటుంది.

Related posts

చౌటుప్పల్ రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

Satyam NEWS

సాధారణ చార్జీలతోనే సంక్రాంతి బస్సులు

Bhavani

గులాంనబీఆజాద్ పరువు తీసేసిన కాంగ్రెస్ పార్టీ

Satyam NEWS

Leave a Comment