38.2 C
Hyderabad
April 27, 2024 16: 38 PM
Slider సంపాదకీయం

ఢిల్లీ లిక్కర్ స్కాం: నోరు మెదపని ఏపీ బీజేపీ నాయకులు

#liquorshop

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదు? ఢిల్లీ బీజేపీ నాయకులు, తెలంగాణ బీజేపీ నాయకులు ఈ కుంభకోణం గురించి, ఈ కుంభకోణంలోని పాత్రధారుల గురించి విపరీతమైన హడావుడి చేస్తున్నా ఏపీ బీజేపీ నాయకులు మాత్రం నోరు మెదపడం లేదు.

ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంగా జరిగిన ఈ లిక్కర్ కుంభకోణంపై ఎన్ ఫోర్సెమెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే పలు విషయాలను వెల్లడించింది. దాదాపు 15 మంది అధికారులు, అనధికారుల పేర్లు ప్రస్తావిస్తూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా పలు చోట్ల విస్తృతంగా తనిఖీలు చేసి కుంభకోణం అంతుతేల్చే పనిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా ఈడీ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ఈ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావిస్తూ ఢిల్లీ బీజేపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలను తీవ్రంగా తీసుకున్న కల్వకుంట్ల కవిత వారిపై పరువు నష్టం దావా వేశారు.

అయితే ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే కుంభకోణానికి సంబంధించి ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భార్య పై పలు ఆరోపణలు చేశారు. లిక్కర్ కుంభకోణంలో వైసీపీ కీలక నాయకుడు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి బంధువుల పేర్లు కూడా ఈ ఆరోపణలలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆరోపణల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇవే ఆరోపణలను చేశారు. కల్వకుంట్ల కవిత పేరుతో బాటు విజయసాయిరెడ్డి అల్లుడి పేరు కూడా ఆయన ప్రస్తావించారు. ఈడీ దాడులు చేసిన వారి పేర్ల ను కూడా ఆయన ప్రస్తావిస్తూ విజయసాయి రెడ్డి బంధువుల పేర్లు బయట పెట్టారు.

ముఖ్యమంత్రి జగన్ భార్య పేరును తెలుగుదేశం ప్రస్తావించడంతో మనస్తాపం చెందిన ఆయన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ మంత్రులు ఎవరూ కూడా ఈ అంశంపై స్పందించకపోవడాన్ని తప్పు పట్టారు. మంత్రులు ఈ ఆరోపణలను ఎందుకు ఖండించడం లేదని ఆయన మంత్రి వర్గంలో ప్రస్తావిస్తూ మంత్రులపై మండిపడ్డట్టు కూడా వార్తలు వచ్చాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఒకరిద్దరు మంత్రులు, మరి కొద్ది మంది నాయకులు తెలుగుదేశం ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. అయితే ఢిల్లీ బీజేపీ నాయకులు గానీ, తెలంగాణ బీజేపీ నాయకులు గానీ చేస్తున్న ఆరోపణలను ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు ప్రస్తావించడం లేదు? వైసీపీ కి చెందిన వారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉన్నట్లు సమాచారం వస్తున్నా ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదు?

ఏపీ బీజేపీ స్పందించకపోవడంపై ఏపిలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఏపి బీజేపీలో చంద్రబాబు అనుకూల భావజాలం ఉన్న నాయకులు, చంద్రబాబు వ్యతిరేక భావజాలం ఉన్న నాయకుల మధ్య అనునిత్యం పైకి చెప్పని ఘర్షణ జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి జగన్ కు పూర్తిగా అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

బీజేపీ అధిష్టానవర్గం పదే పదే రాష్ట్ర ప్రభుత్వం గురించి జగన్ పాలన గురించి వ్యతిరేకంగా మాట్లాడండని ఆదేశాలు ఇస్తున్నా ఏపీ బీజేపీ నాయకులు మాత్రం పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరైనా బీజేపీ నాయకులు వైసీపీ పనులను వ్యతిరేకిస్తూ మాట్లాడితే వైసీపీ సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇలా తమ నేతలపై దారుణాతిదారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదు.

జగన్ అనుకూల వర్గం బీజేపీలో పూర్తి స్థాయి ఆధిపత్యంలో ఉండటం వల్లే ఇలా జరుగుతున్నదనేది ఆ పార్టీ పరిశీలకులు కూడా అధిష్టానవర్గానికి నివేదిస్తున్నారు. జగన్ అనుకూల బీజేపీ నాయకులు ఏపిలోనే కాదని ఢిల్లీలో కూడా ఉన్నారని బీజేపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ సందిగ్ధంలోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో పెరగకుండా మరుగుజ్జులా ఉండిపోతున్నదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.   

Related posts

ఎమ్మెల్యే నుండి ప్రాణ హాని ఉంది…. నాకు న్యాయం చేయండి

Satyam NEWS

కార్మికులు

Satyam NEWS

14 కళ్యాణ మండపాలు లీజుకు టీటీడీ నిర్ణయం

Sub Editor 2

Leave a Comment