29.7 C
Hyderabad
April 29, 2024 07: 38 AM
Slider సంపాదకీయం

ఢిల్లీ యాత్రలు ‘ముందస్తు’ కు యత్నాలా?

#jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ ప్రధాని నరేంద్ర మోదీని ఎందుకు కలుస్తున్నారు? కలిసి ఏం మాట్లాడుతున్నారు? సీఎం కలవడం సరే…. వేరే ఏ పనీ లేనట్లు ప్రధాని ఎందుకు కలుస్తున్నారు? ఈ ప్రశ్నలు ప్రజల్లో పలు సందేహాలను రేకెత్తిస్తున్నాయి. దేశంలో ఎన్నో సమస్యలు ఉండగా ప్రధాని ఏపీ విషయంలో ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారనేది కూడా మరొక సందేహం. ఏపిలో బీజేపీకి ఏ మాత్రం ఓట్లు లేవు.

బీజేపీ ఏపిలో ఒక్క పార్లమెంటు సీటు అయినా సరే ఒంటరిగా గెలవడం అనేది అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని, ప్రధానితో బాటు దేశంలో అత్యంత ముఖ్యమైన మరో వ్యక్తి దేశ హోం శాఖ మంత్రి అమిత్ షా ఏమీ పని లేనట్లు ఏపి ముఖ్యమంత్రిని తరచూ కలవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయ్యారు.

ఈ నెల 17 ప్రధాని సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. నిన్న గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వారాల వ్యవధిలో మళ్లీ ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. సీఎం జగన్ అడిగిందే తడవుగా ప్రధాని ఇంత తక్కువ సమయంలో అప్పాయింట్ మెంట్ ఇవ్వడం పలువురిని ఆశ్చర్య పరుస్తున్నది. ఏపి ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నది.

ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును సీబీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ కేసులో జగన్ సోదరుడు కడప ఎంపి అవినాష్ రెడ్డిని అతి త్వరలో అరెస్టు చేస్తారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు జగన్ పై పలు ఆర్ధిక సంబంధమైన కేసులు ఉన్నాయి. వీటన్నింటితో బాటు వైసీపీలో తాజాగా తిరుగుబాట్లు మొదలయ్యాయి. నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ప్రతిపక్షాలను పోలీసులు వేధిస్తున్న కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై పలు వర్గాలలో ఆందోళన తీవ్రంగా ఉంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఏ మాత్రం పురోగతి లేదు. రాజధాని అమరావతి సమస్య రోజుకో మలుపుతిరుగుతున్నది తప్ప ఆశించిన పురోగతి కనిపించడం లేదు.

మూడు రాజధానులపై మంకుపట్టు పట్టి ఉన్న సీఎం జగన్ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కూడా రాజకీయాలు మాత్రం ఆసక్తిగా నడుస్తున్నాయి. వీటన్నింటికి ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలు ఆలంబనగా ఉంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాజకీయంగా ఎలాంటి పొత్తు లేదు.

కానీ ఈ రెండు పార్టీలూ పొత్తు ఉన్నట్లే ప్రవర్తిస్తుంటాయి. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలపై తాము రాజీలేని పోరాటం చేస్తున్నట్లు బీజేపీ చెబుతుంటుంది కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం క్రమం తప్పకుండా సీఎం జగన్ ను కలుస్తుంటారు. ఒక్క ప్రధానే కాదు. హోం మంత్రి అమిత్ షా కూడా జగన్ ను ప్రోత్సహించే విధంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంటుంది.

బీజేపీ రాష్ట్రంలో పుంజుకోవడానికి బదులు తెలుగుదేశం పార్టీని అణచి వేసేందుకు ఏం చేయాలో మాత్రమే ఆలోచిస్తుంటుంది. దానికి అనుగుణంగానే సీఎం ఢిల్లీ పర్యటనలు ఉండటంతో బీజేపీ, వైసీపీ మధ్య పైకి చెప్పని అనుబంధం కొనసాగుతున్నదని రాష్ట్రంలోని ప్రజలు అనుమానిస్తున్నారు.

సీఎం రాష్ట్రంలో గవర్నర్ ను కలవడం, వెనువెంటనే ప్రధానిని, హోం మంత్రిని రెండు వారాల వ్యవధిలో రెండో సారి కలుస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. పార్టీపైనా ప్రజల్లో వ్యతిరేకత పూర్తిగా పెరగక ముందే, పార్టీ నాయకులలో తిరుగుబాటు పెరగక ముందే ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ ఢిల్లీ యాత్ర అని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారా? అందుకేనా ఈ ఢిల్లీ యాత్రలు? త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related posts

అయ్యప్ప భక్తులకు అనీల్ కుమార్ క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

రూ. 29 కోట్ల ఖరీదు చేసే బంగారం, డ్రగ్స్‌ పట్టివేత

Sub Editor

28న హైదరాబాద్‌లో స్టార్టప్‌ 20-గ్రూప్‌ సమావేశం

Bhavani

Leave a Comment