28.7 C
Hyderabad
April 26, 2024 09: 07 AM
Slider జాతీయం

ఆన్ లైన్ విద్యావిధానంలో యోగాను కూడా చేర్చండి

#Venkaiahnaidu

సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్ లైన్ విధానంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విద్యాసంస్థలు.. ఈ విద్యావిధానంలో యోగాను కూడా చేర్చాలని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సమాజంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా ఓ అద్భుతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు.

స్పిక్ మెకే సంస్థ నిర్వహించిన ’డిజిటల్ యోగా అండ్ మెడిటేషన్ శిబిరం’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆన్ లైన్ లో యోగా సాధకులకు సందేశాన్నిచ్చారు. యావత్ ప్రపంచానికి భారతదేశం తన సంప్రదాయ ఆరోగ్యశాస్త్రాన్ని, ఓ కళను కానుకగా ఇచ్చిందని.. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాల్లో సానుకూల పరివర్తనను గమనించవచ్చన్నారు.

పాఠశాల స్థాయినుంచే యోగాభ్యాసాన్ని అలవర్చడం ద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు వీలుంటుందన్నారు. చిన్నారుల కోసం 13 యోగసనాల జాబితాను ‘యునిసెఫ్ కిడ్ పవర్’ ప్రస్తావించడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.

ఐదువేల సంవత్సరాల ప్రాచీన భారత సంప్రదాయ కళ కేవలం.. శారీరక వ్యాయామం మాత్రమే కాదని ఇది శరీరాన్ని, మనసును సంతులనం చేస్తూ ఒత్తిడి, మానసిక ఆందోళన, చెడు అలవాట్లనుంచి విముక్తి కలిగిస్తుందన్నారు. వ్యక్తిగత ప్రశాంతతతోపాటు సమాజంలో శాంతిసామరస్యాలు నెలకొనేందుకు బాటలు వేస్తుందన్నారు.

యోగచికిత్స విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడంతోపాటు.. ఎన్నో ఆరోగ్య సమస్యలకు యోగాతో పరిష్కారం లభిస్తుందని.. శాస్త్రపరంగా రుజువైందని ఆయన గుర్తుచేశారు. దీన్ని మరింతగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు విస్తృతమైన శాస్త్రపరమైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచీకరణ కారణంగా ప్రజల జీవనశైలిలో వస్తున్న మార్పులతో అసంక్రమిత వ్యాధులు (నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్) పెరుగుతున్నాయని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో భారతదేశంలో సంభవించిన మరణాల్లో 63% అసంక్రమిత వ్యాధుల కారణంగానేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొన్న గణాంకాలను ఆయన ఉటంకించారు.

ఈ పరిస్థితుల్లో యోగాభ్యాసం ద్వారా జీవనశైలిలో మార్పుల కారణంగా వస్తున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. వృత్తిపరమైన, ఇతర సమస్యల కారణంగా మానసిక ఒత్తిడితో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలను ప్రస్తావిస్తూ.. యోగా ద్వారా ఒత్తిడి, ఆదుర్దా, నిరాశ నిస్పృహలను జయించవచ్చని సూచించారు.

భారతదేశానికి మన దేశ యువజనాభాయే కొండంతబలమన్న ఉపరాష్ట్రపతి.. ఆ యువత శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల విషయంలో ఫిట్ గా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. యోగా అధ్యాపకులకు స్వచ్ఛంద సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు. యోగాను మరింత విస్తృతం చేసేందుకు ఇది దోహదపడుతుందన్నారు. డిజిటల్ మాధ్యమాలు, వేదికల ద్వారా ఇలాంటి ప్రత్యేక శిబిరాలను నిర్వహి స్తూ.. యువతను ప్రోత్సహిస్తున్న కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు.

Related posts

మారిషస్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

Satyam NEWS

వై ఎస్ జగన్ రాజకీయ వలలో చిక్కుకున్న వకీల్ సాబ్

Satyam NEWS

బహరేన్ నుంచి వచ్చిన వ్యక్తికి అవగాహన కల్పించిన ఆరోగ్య సిబ్బంది

Satyam NEWS

Leave a Comment